Sunday, December 22, 2024

అమ్మా, నీకు వందనమే!

ఇవాళ్టికి  మా అమ్మగారు పోయి సరిగ్గా ఏడేళ్లయింది. 2009 ఆగస్టు 9 న ఆవిడ తన 83 సంవత్సరాల వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయింది.  1926 లో పుట్టింది ఆవిడ చైత్ర బహుళ అమావాస్య నాడు . కొత్త అమాస్య అని కూడా అంటారు దాన్ని మా వైపు . ఆవిడకి నాకు ముఫై సంవత్సరాల వ్యవధి సరిగ్గా!  మా అమ్మమ్మా వాళ్ల ఇంట్లో కామేశ్వరి దేవత ఉండేది కుల దేవతగా! అలా ఉంటే ఆ ఇంట్లో అమ్మాయి పుడితే ఆ దేవత పేరే పెట్టాలి. అందుకని అమ్మ పేరు లలితా కామేశ్వరి అని పెట్టారు వాళ్ళ అమ్మా నాన్నాను! అమ్మ పుట్టింటి పేరు అయ్యగారి వారు. అయ్యగారి సోమేశ్వరరావు   ప్రముఖ వైణికుడు.  అమ్మా వాళ్ళ పొరుగున ఉండేవాళ్ళు. వీళ్ళందిరిదీ  విజయనగరం దగ్గర ఉన్న లోగీశ  అన్న అగ్రహారం! అదీ మా  అమ్మ పుట్టిల్లు. మా అమ్మమ్మా తాతయ్యలకి మా అమ్మ తొలి సంతానం. వాళ్ళింట   అందరికీ ఆమె అంటే చాలా ప్రేమ. మా నాన్నగారు అనిపిండి  సోమన్న గారు. అలా ఆమె అయ్యగారింటి నించీ అనిపిండివారింటికి  పెళ్ళైన తరువాత  గృహిణిగా  వచ్చినప్పటికి  ఆమె వయసు  సరిగ్గా తొమ్మిది ఏళ్ళు! 

Also read: కొడవటిగంటి  కుటుంబరావు  అక్షరం

నా ఎనిమిదవ ఏటనే మా నాన్నగారు కాలం చేశారు. అంత  చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న నన్ను.. ..  ఒక యాభై సంవత్సరాలపాటు  నా వెనక   అన్నీ తానే   అయి ఉండీ  నన్ను  ఎంతో ప్రేమగా కాపాడుకుంది  మా అమ్మ. నేనంటే చాలా ఇష్టం అమ్మకి. నా తొలి గురువు ఆమె! చిన్నప్పుడు  రాత్రివేళ  అందరమూ  ఆరుబయట పడుకున్నప్పుడు తన పక్కన చిన్నదాన్నైన నన్ను పడుకోపెట్టుకుని ఎన్నో కధలు చెప్పిన అమ్మ.. నాకు ఇంకా ఆనాటి   ఆవిడ పడుచు వయసు రూపంతోనే  ఇప్పటికీ  గురుతుంది. అమ్మ  నాకు తొలిగా మాటలు నేర్పింది .. . ఇరవై ఏడు  నక్షత్రాల పేర్లు నేర్పింది. తెలుగు వారాల, తిధుల, సంవత్సరాల పేర్లు నేర్పింది.  (అప్పటికి నా వయసు బహుశా మూడేళ్లు / లేదా నాలుగో? అలాగే  శ్లోకాలు సైతం ఆవిడ నాకు ఆ వయసునించే నేర్పింది. నాకు ఒక ఐదేళ్లు వచ్చేసరికే చాలా పాటలు పద్యాలూ శ్లోకాలూ  నోటికి ఒప్పజెప్పడానికి వచ్చేశాయి)

నన్ను ఎడో  ఏట గానీ స్కూలులో వేయలేదు. అమ్మ కొంగు పట్టుకుని బేఫికర్ గా తిరిగిన బాల్యం నాది. మా అమ్మ ఒక్కసారైనా నన్ను మందలించేది కాదు. ఏమి చెప్పినా అనునయంగా చెప్పేది. “అమ్మా! ప్రభా!! ” అని పిలిచేది. ఆమె నాకు బోలెడన్ని పాటలు నేర్పేది! ఈ పదం అని లేదు.. ఆ కీర్తన అని లేదు. అసలు ఆమెకి  వచ్చినన్ని  శ్లోకాలు.. పద్యాలూ .. పాటలూ  నేను మరెవ్వరి నోటా విన్నది లేదు. ఆవిడ పద్యం చదివే పధ్దతి  వేరుగా ఉండేది. అది ఇంట్లో బ్రాహ్మణ స్త్రీలు చదివే ఒక విధానం అన్నమాట! పండితులు చదివే పధ్ధతి  కాదది! పాట  కూడా అలాగే! భజన సంప్రదాయంలో  పాడే విధానంలోనే ఉండేది ఆమె పాట పాడే పధ్ధతి. ఆమె పాడే పాటల్లో ఎన్నో రకాలవి ఉండేవి. రెండవ ప్రపంచ యుధ్ధ కాలం నాటివీ! హిట్లర్ .. ముస్సోలినీ మొదలైన వారిని విమర్శిస్తూ..  బ్రిటీషు ఇతర మిత్ర పక్షాల పట్ల  మాత్రం ఎంతో  సానుకూలంగా ఉండే పాటలు అవి. అలాగే  ఇంకోపాట పూసపాటి మహారాజు గుఱ్ఱపు పిల్లకి —  రైలింజనుతో జరిగిన పరుగు వేగపు పోటీ పాట! అందులో చివరికి ఆ గుఱ్ఱం పిల్ల గెలుస్తుంది పొగ బండితో పోటీపడి .. కానీ పందెం ముగిసిన కాసేపటికే అది ప్రాణాలు విడిచేస్తుంది. ఇంకా ఎన్నిరకాల పాటలొచ్ఛేవో మా అమ్మకి. లాలి పాటలు.. జోలపాటలు .. కొట్నాల పాటలు ..ఆనాటి సినిమాల లోని పాటలు. పల్లెవారి పాటలు. ఇట్లా ఎన్నో! మహా జ్ఞాపక శక్తి ఆవిడది. నా తొలి దేశభక్తి గీతాలు కూడా ఆ ఐదేళ్ల వయసులోనే ఆవిడ నాకు నేర్పింది. “నమో హిందుమాత .. సుజాతా! నమోజగన్మాత!” అన్నదొకటీ .. అలాగే “జయజననీ పరమ పావనీ .. జయ జయ భారత జననీ!” అన్నదొకటీనూ! చాలా పెద్దయ్యాకనే  ఈ పాటల్ని ఆనాటి పాత సినిమాలలోని పాటలని నేను గ్రహించాను!)

Also read: కవిత్వంతో చిరునవ్వులు పూయించగల కొంటెదనం పఠాభి సొంతం: జయప్రభ

ఆవిడకి ఎన్ని పద్యాలు వచ్చినా  ఆవిడకి చాలా ఇష్టమైనది మాత్రం పోతనగారి భాగవతం. అందులోని చాలా ఘట్టాలు ఆవిడకి కంఠాగ్రాన పిలిస్తే పలికినట్టు వచ్చేవి మరి. మా అమ్మ పోయిన తరవాత పన్నెండవ రోజు నాటి రాత్రి అందరూ కలిసి అమ్మని గుర్తు చేసుకుంటూ ఆమె పాడిన పాటలన్నీ పాడుదాం అని అనుకుని మొదలు పెట్టారు. ఒక ఐదు గంటలు అలా అవిరామంగా ఆవిడ చెల్లెళ్ళు .. మా అక్కలూ పాడుతూనే ఉన్నారు. చివరికి పాడి పాడి వాళ్ళంతా అలిసిపోయారు గానీ ఆవిడకి వచ్చిన పాటల జాబితా మాత్రం పూర్తే  కాలేదు!

అమ్మకి పోతన భాగవతం లోని ఎన్నో పద్యాలు వచ్చినా  “భీష్మ స్తవం” అంటే మాత్రం మహా ఇష్టం! ” కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి  గగన భాగంబెల్ల  గ్రప్పికొనఁగ” అని కళ్ళు మూసుకుని  తానె భీష్ముడై ఉహించుకుంటున్నట్టుగా   కృష్ణుడిని తన్మయంతో  స్తుతించేది.   ఆవిడ గొంతు అలా నా చెవిలో ధ్వనిస్తూనే ఉంటుంది ఆవిడని తలుచుకున్నప్పుడల్లా!

ఆవిడ నా చేతిలోనే కన్నుమూసింది[ 2009 ఆగస్టు 9 రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో!  విశాఖపట్నంలో ఉన్న కేర్ ఆస్పత్రి లో! ఆవిడ పోయిన రోజు ఆదివారం! సరిగ్గా అంతకు ముందు రోజు పొద్దుట-  అంటే శనివారం నాటి ఉదయం  ఆవిడకి గుండెపోటు వచ్చినట్టు కబురు రాగానే పరుగెత్తి వెళ్ళాము వైజాగ్ కి!  కేవలం నన్ను చూడడం కోసమే అన్నట్టుగా ప్రాణాలు నిలుపుకుంది అమ్మ. అంత పెద్ద వయసున్న నన్ను- ఆవిడ చిన్న పిల్లని ముద్దాడినట్టుగా రెండు బుగ్గలూ గట్టిగా నొక్కి నవ్వుతూ ముద్దులాడింది.  ఆ మరునాడు  ఐసీయూ లో నాతొ మాట్లాడుతూనే   మంచం మీద అలా పక్కకి ఒరిగిపోయింది. ఆవిడతో నేనింకా మాట్లాడుతూనే ఉన్నాను. ఆవిడ పోయిందన్న సంగతి కాసేపటికి గాని నాకు తెలియలేదు. అది తెలియగానే స్తబ్దురాలినై ఉండిపోయాను. ఒక్కసారిగా నాలోని చిన్నతనం కరిగిపోయింది శాశ్వతంగా! నాలోని ఒక భాగం ఎదో అమ్మతోనే వెళ్ళిపోయింది. అమ్మ పోయింది అన్నది ఎంత వాస్తవమే అయినా .. నాకు దాన్ని గ్రహించడం చాతకాలేదు. ఎప్పుడూ ఎవరితోనీ నేను  నాలోని వంటరితనాన్ని బాధనీ   పంచుకోను లేదు. అది ఒకలాంటి నిస్సహాయత! దానికి వయసుతో సంబంధం ఉండదు. ఎన్ని అనుబంధాలున్నా గానీ  ఆ లోటు తీరదు. ఆవిడ గురించి నేను నా అన్నమయ్య పదపరిచయం రెండవ సంపుటంలో రాసాను. ఆపుస్తకం ఆవిడ ఇంకా రెండు నెలలకి పోతుందనగా విశాఖపట్నంలోని జరిగిన ఒక సభలో  దాని ఆవిష్కరణ జరిగింది. చాలా కస్టపడి ఆ సభకి అమ్మ వచ్చింది. అందరూ ఆవిడని పలకరించి.. ఆరోజు సభ ముగిసాకా  చాలామంది  ఆవిడ కాళ్ళకి నమస్కారం చేశారు. కాళీపట్నం మాస్టారు గారి తో సహా!!

Also read: శరీరం!

అమ్మ కి నా దుడుకుతనం అంటే ఎప్పు డూ  బెంగే. నాగురించి ఆవిడకి చాలా చింత ఉండేది. బతకనేర్వని దాన్నని! చింతతో పాటే — నేనంటే ఆవిడకి చాలా గర్వంగా కూడా ఉండేది . కానీ చాలా మంది మంచి తల్లుల మాదిరే ఆ విషయాన్ని ఆవిడ  ఎప్పుడూ  కూడా బయటకి అనేది కాదు. పిల్లల్ని పెద్దవాళ్ళు మెచ్చుకుంటే ఆయుక్షీణం అన్నది ఆవిడ ప్రగాఢమైన నమ్మకం! అయితే, ఆవిడ నా అన్ని పుస్తకాలనీ చదివింది. నాకు రచన అన్న ఒక నైపుణ్యం అంటూ అబ్బితే —తెలుగు భాష అంటూ  నా కవిత్వంలో బాగా పలికితే —అది ఆవిడ నేర్పిన నా బాల్యంలోనిదే !!

నాకు మూడేళ్ళప్పటి నించీ ఆవిడ నేర్పిన మాటలూ పాటలూ పద్యాలూ శ్లోకాలూ మరి ఇన్నీ అన్నీ కావే!! సరస్వతీ కటాక్షం ఆవిడ నించే నాకు  అలా  పసితనం లోనే  అనుగ్రహించబడింది! బోలెడన్ని బుధ్ధులు ఆవిడ నేర్పినవే! నిక్కచ్చితనమైనా! నిజాయితీ అయినా!!

కాకపొతే మా అమ్మకీ నాకు అన్నిటా చుక్కెదురే! ఆవిడ స్వభావం వేరు. లోకం పట్ల  ఎన్నో అసమానతల పట్ల కూడా  ఆవిడ చాలా సౌమ్యురాలు!  కానీ నేను  మాత్రం చాలా పేచీకోరునీను!  కానీ నేనంటే ఉండే అమితమైన ప్రేమ వల్ల  ఆవిడ నన్ను ఎలా ఉన్నా ఒప్పుకుంది.

అప్పుడు కూడా ఆవిడకి నేను తండ్రిలేని చిన్నపిల్లననే!  అందుకనే బహుశా నేను చాలా ఏళ్ళు నాలో ఒక పసితనాన్ని నిలుపుకోగలిగాను. ఇప్పుడా? ఆవిడలేకపోయాకా … ఇంకా నేను పసిదాన్ని ఎలా అవగలను??

అమ్మా ! నీకు వందనమే!!

Also read: నాకిష్టమైన కాలమిస్ట్ శ్రీరమణ: జయప్రభ

(10 ఆగస్తు 2016న రాసింది)

Jayaprabha Anipindi
Jayaprabha Anipindi
జయప్రభ ప్రఖ్యాత కవి, స్త్రీవాద రచయిత్రి. విమర్శకురాలు. కథలూ, వ్యాసాలూ అనేకం రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles