- జనాభా కాదు, జవసత్త్వాలు కావాలి
- ప్రగతి వేగం పెరగాలి, అంతరాలు తగ్గాలి
- సకల పక్షాలు జాతిహితం కోసం పని చేయాలి
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? అన్నాడు శ్రీ శ్రీ. అవి ఎప్పుడో కరిగిపోయాయి. ఎందరో దేశభక్తుల, త్యాగ ధనుల వజ్రసంకల్పంతో స్వాతంత్ర్య సిద్ధి జరిగింది. ఆ ఫలసిద్ధికి చిహ్నంగా, భవ్య భారత స్మృతిగా నేడు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఉత్సాహాన్ని నింపుకొనే ప్రయత్నం చేస్తున్నాం. ఐకమత్యమే మహాబలంగా బ్రిటిష్ వారిఫై గెలుపు జెండా ఎగురవేశాం. స్వేచ్చా వాయువులు పీల్చాం. సాధించాల్సినంత ప్రగతి తీరాలకు చేరక పోయినా, ఆధునిక ప్రపంచ దేశాల ఆటలో, ఆ రేసులో ఏదో ఒక స్థాయిలో పరుగెడుతున్నాం. మన దేశానికి గుర్తింపు తగ్గకుండా ఎంతోకొంత నిలబెట్టుకున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాలే సంపదగా లోకం ముందు ఇంకా గౌరవం మిగుల్చుకున్నాం.
చైనాను మించిన చేవ కావాలి
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా మార్కెట్ లో ఎప్పటికీ మన గిరాకీ ఉంటుంది. అతికొద్ది కాలంలోనే చైనా జనాభాను కూడా దాటి మొదటి స్థానంలో నిలుస్తాం. ఆర్ధిక పటుత్వం,వాణిజ్య వికాసం, పరపతిలో చైనాను మించినప్పుడే మనతనం నిలబడుతుంది. కేవలం జనాభాలో కాక, ప్రతిభలో, ప్రభలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నప్పుడే అసలు విజయ ప్రస్థానం ఆరంభమైనట్లు. “స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ” అన్న కవి వాక్కులనే స్ఫూర్తి గీతాలుగా మలుచుకుని, నిదురించిన పౌరుషాగ్నిని మళ్ళీ రగిలించుకుని ముందుకు సాగక తప్పదు. ఆకాశం అందుకొనే ధరలు, కిందకు దిగజారుతున్న రూపాయి విలువలు, అదుపులేని నిరుద్యోగం, అవినీతి, బంధుప్రీతి అలివిమాలి అలుముకున్న అంధకారం, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, స్వార్ధ పరమార్థ ప్రయాణాలను అధిగమించకపోతే అనర్ధమే ఎదురవుతుంది. కరోనా వైరస్ మనల్ని ఎన్నో ఏళ్ళు వెనక్కు నెట్టింది. లోపలికి చూసుకొని అలోచించుకోండనే హితబోధ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే చెబుతున్న ‘ఆత్మనిర్భర భారత్’, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్రగతి సాకారమవ్వాలంటే మన పరిపాలనా యంత్రాల వేగం మరెన్నో రెట్లు పెరగాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల నడుమ చెలరేగిన సామాజిక అసమానతలకు చరమగీతం పాడాలి. అభివృద్ధి – అవకాశాలలో అందరికీ వాటా దక్కాలి. మనకున్న పెద్ద సంపదలు మానవ వనరులు, సహజ వనరులు. వాటిని సంపూర్ణంగా, సమగ్రంగా సద్వినియోగం చేసుకొనే సంకల్పం మరింత ఆచరణాత్మకం కావాలి.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ప్రధానం
రాజకీయాల మాటున కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్యస్ఫూర్తి ( ఫెడరల్ సిస్టమ్) ప్రశ్నార్ధకమవుతోంది. ఈ ఇరు సంబంధాలు అసమదీయులు – తసమదీయులుగా మారిపోయాయి. పరిపాలనా వికేంద్రీకరణ సంగతి దేవుడెరుగు! సర్వశక్తులు కొందరి దగ్గరే పెట్టుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ చాలా మంది కేబినెట్ స్థాయి మంత్రులకు సైతం పదవులు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయి, వారు బొమ్మలుగా మారిపోయారనే మాటలు బాగా వినపడుతున్నాయి. ప్రతిపక్షాలు బలహీనంగా మారితే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదని పూర్వులు చెప్పిన మాటలను గుర్తుచేసుకోక తప్పని పరిస్థితిలోకి వచ్చేశాం. ఇరు పక్షాలు దేశభక్తితో జాతిహితం కోసం పనిచేయకపోతే స్వాతంత్య్రం సాధించుకున్న ఫలం నిష్ప్రయోజనమై పోతుంది. చాలా దేశాల్లో అధినేతలు ప్రజల ముందు తమ గౌరవాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కొన్ని దేశాల్లో ఇటీవల చోసుచేసుకున్న పరిణామాలే దానికి ఉదాహరణ. భారతదేశంలో పెద్దల పట్ల గౌరవం ఇంకా పదిలంగానే ఉంది. కరోనా ప్రభవిస్తున్న తొలినాళ్లల్లో గంటలు మోగించండని ప్రధాని చెబితే అందరూ అలాగే పాటించారు. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని ప్రజలకు వినిపిస్తే ఔదల దాల్చి ఆచరించారు. మంచి సూచనలు చేస్తే పాటించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రజను కలుపుకొని పాలకులు ముందుకు సాగితే ప్రజాస్వామ్యం వెల్లివిరిస్తుంది. ఆ స్పృహను ఏలికలు మదిలో నిలుపుకోవాలి.
పునస్సమీక్ష అవసరం
75 ఏళ్ళ స్వాతంత్ర్య ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వేళ, దేశ పరిస్థితిని, అన్ని రంగాల ప్రయాణాన్ని పునఃసమీక్ష చేసుకోవడం అవశ్యం. గణాంకాలను గమనిస్తే మన అసమానతలు, అసలు రూపాలు అర్థమవుతాయి.
ఉన్నవాడు – లేనివాడు మధ్య దూరం ఇంకా పెరుగుతోంది. అధికారం కొందరి దగ్గరే కేంద్రీకృతమైనట్లు సంపద కూడా కొందరి దగ్గరే రాజ్యమేలుతోంది. ఈ పరిణామాలు దేశ శాంతి, సామరస్యలకు ఎప్పటికైనా గొడ్డలిపెట్టవుతాయి. సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నాయి. లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదం కోరలు చాచుకొనే ఉంది. మన కుండే సామర్ధ్యం, జనాభా శక్తి, మార్కెట్ దృష్ట్యా పెద్ద దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయి. మనం అన్ని రంగాల్లో సర్వశక్తిమంతులం కావడమే ప్రధాన లక్ష్యం కావాలి.ఈ దిశగా మన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అవసరమైన చోట పునఃలిఖించుకోవాలి. “సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా? ” అని ఆరుద్ర ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం అన్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్న, అదే అనుమానం రేకెత్తుతున్నాయి. భరతభూమి బంగారుబాట పట్టాలని ఆకాంక్షిద్దాం. ఆజాదీ కా అమృత మహోత్సవం వేళ అమ్మకు వందనం. జై హింద్!