Sunday, December 22, 2024

హిందూత్వపైన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యపై పెనుతుపాను

అశ్వినీ కుమార్ ఈటూరు

  • హిందూత్వ పుట్టుక కూడా ఐఎస్ఐఎస్, బోకో హారం పట్టుక వంటిదే అంటారు
  • కాంగ్రెస్ సహచరుడు గులాంనబీ ఆజాద్ ఖండన, అతిశయోక్తులంటూ వ్యాఖ్య
  • ప్రజల మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని బీజేపీ విమర్శ
  • హిందూత్వను ఐఎస్ఐఎస్ తో పోల్చినందుకు ఇద్దరు దిల్లీ లాయర్లు ఖుర్షీద్ పై కేసు

దిల్లీ: ఇటీవల విడుదలైన సల్మాన్ ఖుర్షీద్ గ్రంథం ‘సన్ రైజ్ ఓవర్ అయోధ్య-నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ లోని ఒక అధ్యాయానికి ‘ద శాఫ్రన్ స్కై’ అని నామకరణం చేశారు. ఆ అధ్యాయంలో రాసిన అంశాలు కారణంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. నవంబర్ 11, గురువారంనాడు ఈ పుస్తకాన్ని సీనియర్ కాంగ్రెస్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించిన కథనాలు ఉన్నాయి.

సల్మాన్ ఏమన్నారు?

ఈ వివాదంపైన కోర్టు తీర్పు రావడానికి వందేళ్ళు పడుతుందని ప్రజలు అనుకునేవాళ్ళు. తీర్పు వచ్చిన తర్వాత తీర్పు పూర్తిపాఠం చదవకుండానే ప్రజలు చిత్తం వచ్చినట్టు వ్యాఖ్యాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎందుకు, ఎట్లా ఆ తీర్పు ఇచ్చిందో అవగాహన లేదు.

సల్మాన్ ఖుర్షీద పుస్తకంలో వివాదాస్పదమైన వాక్యాలు. సల్మాన్ ఖుర్షీద్.

శాఫ్రన్ స్కై పేరుతో ఉన్న ఆరో అధ్యాయంలో 113వ పేజీలో ఈ వాక్యాలు ఉన్నాయి: ‘‘రుషులకూ, మునులకు తెలిసిన సనాతన హిందూ ధర్మాన్నీ, క్లాసికల్ హిందూయిజం నూ బలమైన హిందూత్వవాదం పూర్తిగా పక్కకు నెట్టివేసింది. అది ఇటీవలికాలంలోవచ్చిన  ఐఎస్ ఐఎస్, బోకో హారాం వంటి ఇస్లామిక జిహాదీ గ్రూపులను పోలిన రాజకీయ సిద్ధాంతం.’’ ఈ వాక్యంతోనే వివాదం చెలరేగింది.

వివాదంలో ఉండిన 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మాణం, నిర్వహణ కోసం నెలకొల్పిన ట్రస్టుకు ఇవ్వాలని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ స్థలానికి బదులుగా సున్నీం వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలనీ, అందులో మసీదు నిర్మించుకునేందుకు వారికి స్వేచ్ఛనివ్వాలని కూడా ధర్మాసనం నిర్ణయించింది.

సల్మాన్ వ్యాఖ్యకు కాంగ్రెస్ దూరం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ తన సహచర కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయంతో విభేదించారు. ‘‘సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంలో అందరినీ కలుపుకొని పోయే హిందూయిజం సిద్దాంతంతో పోల్చితే హిందూత్వ రాజకీయ సిద్ధాంతంతో మనలో చాలా మందిమి ఏకీభవించము. కానీ హిందూత్వ నుఐఎస్ఐఎస్ తోనూ, జిహాదీ ఇస్లామిక్ గ్రూపులతోనూ పోల్చడం వాస్తవికంగా తప్పు, అతిశయోక్తి కూడా’’ అంటూ గులాంనబీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం నడుపుతున్న శివసేన కూడా సల్మాన్ పోలికను ఖండించింది.

సల్మాన్ ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి: బీజేపీ ప్రవక్త గౌరవ్  భటియా

సల్మాన్ ఖుర్షీద్ ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించవలసిందిగా బీజేపీ డిమాండ్ చేసింది. ఇంతకు ముందు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని వాడుకలోకి తెచ్చిందీ కాంగ్రెస్ పార్టీనేననీ, ఇప్పుడు  కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పూర్వాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రోద్బలంతో సల్మాన్ ఈ వ్యాఖ్యను పుస్తకంలో చేర్చి ఉంటారని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు.

హిందూత్వ వాదానికి పరువునష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఇద్దరు దిల్లీ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్ పైన కేసు పెట్టారు. ఆ పుస్తకంలోనే సనాతన ధర్మాన్ని, హిందూమతాన్ని ప్రశంసించానని సల్మాన్ ఖుర్షీద్ ఉద్ఘాటించారు. కానీ ఆయన పుస్తకంలో ఈ వివాదాస్పదమైన అంశం రాయడం, ఆ పుస్తకం ఉత్తరాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో విడుదల కావడం కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకంగానే పరిణమించవచ్చు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles