Sunday, December 22, 2024

శాక్యముని అడిగిన మౌలిక ప్రశ్నలు

                        My Confession

                        ————————-

                                               By Leo Tolstoy

                          నా సంజాయిషీ

                          ———————

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                             చాప్టర్ 6

                              ———–

జీవిత ప్రశ్నల సమాధానాల కోసం నా వెతుకులాటలో, అడవిలో దారి కోల్పోయిన మనిషి అనుభవించే ఒక రకమైన అనుభూతిని నేను  పొందాను.

ఆ మనిషి అడవి మధ్యలో మైదాన ప్రదేశం చేరుకొని, చెట్టు ఎక్కి చుట్టూరా అపరిమిత దూరం పరికిస్తాడు. అతడి ఇల్లు అక్కడ లేదని, ఉండదని తెలుసుకుంటాడు; అప్పుడు ఇంకా

దట్టమైన అడవిలోకి పోయి, చీకటి చూస్తాడు. అక్కడా అతని ఇల్లు ఉండదు.

అలా మానవ జ్ఞానం అనే అడవిలో నేను తిరుగాడాను. అక్కడ గణిత, ప్రయోగాత్మక సైన్స్ లో మెరుపుల మధ్య నేను అవధులు చూడగలిగాను. కానీ ఆ దిశలో ఏ ఇల్లూ ఉండటానికి వీల్లేదు; అలాగే  నైరూప్య శాస్త్రాల ( abstract sciences) లోతైన చీకటిలో నేనింకా దూరం వెళ్లిన కొద్దీ నిరాశ , దుఃఖంలో మునిగిపోయాను. చివరకు దాని నుండి నిష్క్రమణ అనేది లేదు అని నాకు నేనే ఒప్పుకున్నాను.

Also read: ‘నేనేమిటి?,’ ‘ఈ విశ్వం ఏమిటి?’

జ్ఞానం యొక్క వెలుగులోకి చూస్తూ — జీవిత ప్రశ్న నుండి నా దృష్టి మరల్చు కుంటున్నానని అర్థం చేసుకున్నాను. నా ముందు కనిపిస్తుంది క్షితిజాలు (అవధులు) ఎంత ఆకట్టుకునే విధంగా ఉన్నాగాని, అపరిమితంగా విస్తరించి ఉన్న ఆ శాస్త్రాల్లో మునిగిపోవడం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా గానీ — నాకు అర్థమైనదేమిటంటే — అవి ఎంత స్పష్టంగా ఉంటే అంత తక్కువ అనువర్తిస్తాయి. ఇంకా అంత తక్కువ నా ప్రశ్నకు సమాధానమిస్తాయి.

 “సైన్సు, ఏది ఆవిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తుందో ఆ దిశలో నా జీవిత

పరమార్ధానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం దొరకదు.” అని నాకు తెలుసనుకున్నాను. ఇక, — నైరూప్య శాస్త్రాల్లో — (వాస్తవం అయినప్పటికీ లేదా వాస్తవం మూలకంగా) — వాటి లక్ష్యం నా ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వటమే అయినా గాని జవాబు రాదు లేదా నేను నాకు చెప్పుకున్న సమాధానమే అవుతుంది. ఉదాహరణకు

      ” నా జీవిత పరమార్ధం ఏమిటి?”

 జ: ” ఏమీ లేదు.”

       “నా జీవితం నుండి ఏమి వస్తుంది?”

   జ: ” ఏమీ రాదు ”       (లేదా)

        “ఈ ఉనికిలో ఉన్నదంతా ఎందుకు ఉనికిలో ఉంది? ” “నేను ఎందుకు ఉనికిలో ఉన్నాను?”

   జ: “ఉనికిలో ఉంది కాబట్టి.”

మానవ జ్ఞానంలోని ఒక శాఖ గురించి దర్యాప్తు చేస్తుంటే — అనేక విషయాల గురించి అసంఖ్యాక పరిమాణంలో నేనడగని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి: నక్షత్రాల అంతర్గత రసాయన భాగాల గురించి, నక్షత్రాల కూటమి హెర్క్యులిస్ వైపు సూర్యుని కదలికల గురించి, జీవ ఆవిర్భావము, మనిషి ఆవిర్భావం గురించి నమ్మశక్యంగాని అత్యంత సూక్ష్మ ఈధర్ కణాల రూపాల గురించీను.   కానీ జీవితానికి అర్థం ఏమిటి అని నా ప్రశ్నకు : “నీ ‘జీవితం’ అంటే నువ్వే. నువ్వు తాత్కాలిక, సాధారణ చిన్న కణాల సంయోగం. పరస్పర చర్యలు, ఈ చిన్న కణాలలో మార్పులు నీ “జీవం” అనేదాన్ని తయారుచేస్తాయి. ఆ సంయోగం కొంత కాలం ఉంటుంది; తరువాత ఆ చిన్న కణాల సంయోగం, పరస్పర చర్యలు ఆగిపోతాయి. నీవనుకునే “జీవం”అనేది ఆగిపోతుంది. దానితోపాటు ప్రశ్నలు కూడా ఆగిపోతాయి. నీవు ప్రమాదవశాత్తు వేటితోనో కలిసి తయారైన ఒక చిన్న ముద్దవి. ఆ చిన్న ముద్ద పులిసిపోతుంది. ఆ చిన్న ముద్ద పులిసిన దాన్ని దాని ‘జీవం’ అంటుంది. ఆ ముద్ద విచ్ఛిన్నమవుతుంది. పులియటం అనేది ఆగిపోతుంది. ప్రశ్నలు ఆగిపోతాయి. ” సైన్సు స్పష్టంగా ఉన్న ఒకవైపు ఈ సమాధానాలు ఇస్తుంది. అది (సైన్స్) దాని సూత్రాలు పాటిస్తే సమాధానమివ్వలేదు.

Also read: ఆత్మహత్యవైపు ఆలోచనలు

ఆ సమాధానం ప్రశ్నకు అనుగుణంగా లేదని ఎవరికైనా తెలుస్తుంది. నాకు జీవితానికి అర్థం తెలుసుకోవాలని ఉంది. కానీ అది అనంతంలో ఒక ముక్క మాత్రమే. అది అర్థం ఇవ్వకపోగా —

సాధ్యమయ్యే ప్రతి అర్థాన్నీ అది నాశనం చేస్తుంది. జీవితం యొక్క అర్థం అభివృద్ధిలోనూ, దాని సహకారంలోనూ ఉంటుందని, ప్రయోగాత్మక సైన్సు అస్పష్టమైన, రాజీ ధోరణితో మాట్లాడుతుంది. అస్పష్టత, ఖచ్చితత్వం లేకపోవడం — ఆ రెండింటితో — ప్రయోగాత్మక సైన్సు చెప్పేవి సమాధానాలుగా తీసుకోలేము.

సైన్సుకి ఇంకోవైపు — నైరూప్య శాస్త్రం ఉంది. అది, తన సూత్రాలకు ఖచ్చితంగా అనుగుణంగా ఉండి సమాధానాలు ఇస్తే — ఎప్పుడూ, అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా సమాధానం ఇస్తుంది. “ఈ లోకం అనంతమైనది. అగోచరమైన ‘మొత్తం’ లో అగోచరమైన భాగం ఈ లోకం. “మరలా ఇక్కడ నేను నైరూప్య మరియూ ప్రయోగాత్మక సైన్సుల మధ్య రాజీ ధోరణులు మినహాయించి మాట్లాడుతున్నాను (అవి పూర్తి సైన్సు కాని వాటి — న్యాయ, రాజకీయ, చారిత్రకాల — సహాయం తీసుకోకుండా) .ఈ సెమీ సైన్సులలో — అభివృద్ధి, ఎదుగుదల అనే భావనలు తప్పుగా ప్రవేశపెట్టబడ్డాయి. అక్కడ అన్నింటి అభివృద్ధి అని అర్థం వస్తుంది. సెమీ సైన్స్ లలో మాత్రం మానవ సమాజ అభివృద్ధి అనే  అర్థం వస్తుంది. అందుచేత లోపం పూర్వం లాగే ఉంది : అభివృద్ధి, అనంతంలో ఎదుగుదల — వీటికి లక్ష్యము, దిశ ఉండవు. నా ప్రశ్నకు సంబంధించి సమాధానం రానట్లే!’’

Also read: జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో!

నిజమైన నైరూప్య శాస్త్రంలో అంటే వాస్తవ తత్వశాస్త్రంలో (ఉనికిలో ఉన్న విషయాలను తత్వశాస్త్ర వర్గాలుగా విభజించి, వాటికి కొత్త పేర్లు పెట్టే స్కోపెన్  హాయర్ యొక్క  ప్రొఫెసోరియల్ వేదాంతంలా కాక ) లాగా ( తత్వవేత్త అవసరమైన ప్రశ్నలను వదిలివేయకుండా) సమాధానం ఒకటిగానే ఉంటుంది. సోక్రటీస్, స్కోపెన్ హాయెర్, సోలోమన్ ఇంకా బుద్ధుడు — చెప్పినది కూడా అదే సమాధానం.

సోక్రటీస్

సోక్రటీస్  

———–      

“జీవితం నుండి దూరం వెళ్లే  కొద్దీ మనం సత్యానికి దగ్గరగా వస్తాం.” మరణానికి సన్నద్ధమవుతూ సోక్రటీస్ అన్న మాటలివి. 

“సత్యాన్ని ప్రేమించే మనం — జీవితంలో దేనికోసం శ్రమ పడుతున్నాం?” ఈ శరీరం నుండి మనంతట మనం విముక్తి పొందాలని, ఇంకా శరీరంలో ఉన్న జీవం కలిగించే బాధలనుండి విముక్తి పొందాలనే కదా! అప్పుడు మరణం మన దగ్గరకు వచ్చినప్పుడుసంతోష పడలేకపోతున్నాం — ఎందుకని?”

“జ్ఞాని, తన జీవితమంతా మరణం కోసం వెతుకుతూంటాడు. చావు అతనికి భయానకమైంది కాదు. “

స్కోపెన్ హాయర్

స్కోపెన్ హాయర్

———————–

స్కోపెన్ హాయర్ ఇలా చెప్తాడు : ” విశ్వం యొక్క అంతర్గత సారం — ‘సంకల్పము — దాని దృగ్విషయాలు ( phenomena)’ అని మనం గుర్తిస్తే, ప్రకృతి యొక్క ఏవో అస్పష్టశక్తులు స్పృహలో లేకుండా చేసే పనుల నుండి — పూర్తి స్పృహలో ఉండి మనిషి చేసే పనుల వరకు — అన్నీ ఆ సంకల్పం యొక్క నిష్పాక్షిక వ్యక్తీకరణలే! సంకల్పం యొక్క స్వచ్ఛంద త్యాగం, ఆత్మవినాశనంతో పాటు ఈ దృగ్విషయాలన్నీ మాయమై పోవడం — అనే ముగింపుని మనం నివారించలేము.

Also read: నేనూ, నా మిత్రులూ పిచ్చాసుపత్రిలో ఉన్నట్టున్నాం: టాల్ స్టాయ్

అలాగే  ‘లక్ష్యము, విశ్రాంతి లేకుండా నిరంతర శ్రమ,  ప్రయత్నమూ, నిష్పాక్షిక వ్యక్తీకరణ యొక్క అన్ని దశల్లో విశ్వం తన ఉనికిని చాటుకుంటుంది.’ అనేదాన్ని నివారించలేము. వరుస రూపాల వైవిధ్యం(భిన్నత్వం) మాయమవుతుంది. దాంతోపాటు — సంకల్పం యొక్క అన్ని వ్యక్తీకరణలు, ఇంకా విశ్వం యొక్క రూపాలైన  స్థలము, కాలము, చివరిగా దాని ప్రాథమిక రూపం — విషయమూ, వస్తువూ (subject, object) అన్నీ కనుమరుగవుతాయి. సంకల్పం లేకుండా భావన అనేది లేదు. ఈ విశ్వమూ లేదు. మన ముందు ఖచ్చితంగా ఏమీ మిగలదు. ఈ పరివర్తన  నిర్మూలనగా మారకుండా  ప్రతిఘటించేది — ఆ బ్రతకాలన్న కోరికయే! — విల్లే జిమ్ లెబెన్ —

(బ్రతకాలనే సంకల్పం) — అదే మనకు, ఈ లోకానికి రూపం ఇచ్చేది. మనం వినాశనానికి భయపడటం, బ్రతకాలనే  కోరికతో ఉండడం — మన బ్రతకాలనే కాంక్షకు ప్రతిరూపాలే. అయినా గాని దాని గురించి మనకేమీ తెలియదు. అందుచేత మన సంకల్పం యొక్క పూర్తి వినాశనం తర్వాత (పూర్తి సంకల్పంతో ఉన్న మనకు) మిగిలేది శూన్యం. కానీ మరోవైపు ఈ సంకల్పం ఎదురు తిరిగి త్యజించబడితే — సూర్యుళ్ళతోనూ, పాలపుంతతోనూ ఉన్న మన ఈ నిజమైన లోకం — శూన్యమే !”

సోలోమన్ రాజు

సోలోమన్

————-

 సోలోమన్ ఇలా అన్నాడు : ” అంతా వ్యర్థం.” “వ్యర్ధాతి వ్యర్థం.” సూర్యునికి కింద మండుటెండలో  పనిచేసే మనిషి పొందేదేమిటి? ఒక తరం పోయి ఇంకొక తరం వస్తుంది: కానీ భూమి బద్ధమై అలాగే ఉంటుంది. ఇంతకు పూర్వం ఉన్నది —  ఇక ముందు ఉండబోయేది ఒకటే ! పూర్వం చేయబడింది — మరలా ముందు కూడా చేయబడుతుంది. ఆకాశం కింద కొత్త విషయం ఏమీ ఉండదు. ఇది కొత్త విషయం — అని చెప్పబడిన విషయం ఏమైనా ఉన్నదా? మన ముందు ఉన్నదంతా ఎప్పటి నుంచో ఉంటున్నదే. ఇంతకుముందున్న విషయాల జ్ఞాపకాలు ఏమీ ఉండవు. వచ్చే విషయాలకు, ఆ తర్వాత రాబోయే విషయాలకు మధ్య జ్ఞాపకాల వంతెనలేమి ఉండవు;

జెరూసలేం లోని ఇజ్రాయిల్ రాజు నైన నేను — బోధకుడిని. స్వర్గం క్రింద జరిగిన అంతటినీ సమకూర్చుకొని, జ్ఞానంతో వెతకటానికి నా హృదయాన్ని ఇచ్చాను: మానవ పుత్రులకు చేయటానికి ఈ కఠినమైన శ్రమ భగవంతుడు కల్పించాడు. సూర్యుని క్రింద చేసే అన్ని పనులు నేను చూశాను: సరిగ్గా గమనించు. అంతా వ్యర్థము, ఆత్మ వేదనాను. నేను నా హృదయంతో మాట్లాడాను: నేను గొప్ప ఎస్టేట్ కు వచ్చాను. జెరూసలేంకు నాకంటే ముందు వచ్చిన వారి కన్నా నేను ఎక్కువ  తెలివిగలవాడిని. అవును నా హృదయం  జ్ఞానము, ప్రజ్ఞ యొక్క అనుభవం ఎక్కువ కలిగి ఉంది. జ్ఞానాన్ని, అవివేకాన్ని, ఉన్మాదాన్ని తెలుసుకోవడానికి నా హృదయాన్ని అర్పించుకున్నాను. ఇది కూడా ఆత్మ వేదనే  అనే విషయం చూడగలిగాను. జ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ దుఃఖం ఎక్కువవుతుంది. ఎవరైనా జ్ఞానం పెంపొందించుకుంటే, వారు దుఃఖం కూడా పెంచుకున్నట్లే.

Also read: ‘చదువు’  అంటే ..  ఏమిటి?

 “నేను నా హృదయంలో అనుకున్నాను నేను నిన్ను ఉల్లాసపరుస్తాను; ఆనందాన్ని ఆస్వాదించు: ఆగు, ఇది కూడా వ్యర్థమే. నేను నవ్వు గురించి చెప్పాను అదో పిచ్చి. ఆనందం గురించి కూడా! అది ఏమిటి? నా శరీరాన్ని మద్యంతో ఉల్లాసపరచాలని నా హృదయంలో కోరుకున్నాను. మానవ పుత్రులకు స్వర్గం కింద వారు ఎన్ని రోజులు సుఖంగా ఉంటారో చూడాల్సిన బాధ్యత నాది. నేను గొప్ప పనులు చేశాను; ఇల్లు కట్టాను; చెరుకు తోటలు వేశాను (మదిర కోసం). పళ్ళతోటలు వేశాను. అన్ని రకాల పండ్ల చెట్లు పెంచాను. నీటి సదుపాయం సమకూర్చాను. నేను పని మనుషులను సమకూర్చుకున్నాను. పని మనుషులు మా ఇంట్లో పుట్టారు. జెరూసలేంలో

ఇంతకుముందు ఉన్న  వారి కన్నా ఎక్కువ పక్షులు జంతువులను నేను పెంచాను. రాజుల నుండి, రాష్ట్రాల నుండి వెండి, బంగారు నగలతో ఒక నిధి సమకూర్చుకున్నాను: గాయనీ గాయకులను, సంగీత వైద్య పరికరాలను సమకూర్చి మానవ పుత్రులను రంజింప చేశాను. అందుకే నేను గొప్పవాణ్ణి. నాకన్నా ముందు జెరూసలేం లో ఉన్న అంతటినీ అభివృద్ధి చేశాను:  నా జ్ఞానం నా వద్దనే ఉంది. నా కళ్ళు ఏమి కోరుకుంటే అవి అన్నీ పొందాను. ఏ ఆనందం నుండీ నా హృదయాన్ని వేరు చేయలేదు. నా చేతులు చేసే పనులన్నీ చేశాను. కఠిన శ్రమ చేశాను : అదంతా వ్యర్థమే, ఆత్మ వేదనయే! సూర్యుడి కింద వాటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. జ్ఞానాన్ని, పిచ్చిని, మూర్ఖత్వాన్ని — గమనించడానికి అటు తిరిగాను. వాటికేమీ జరగలేదు. అప్పుడు నా మనసులో ఇలా అనుకున్నాను. ఒక తెలివి తక్కువ దద్దమ్మకు జరిగేదే నాకూ జరుగుతుంది. అప్పుడు నేనెలా వారి కంటే జ్ఞానిని  అవుతాను? ఇది కూడా వ్యర్థమేనని నేను మనసులో అనుకున్నాను. ఒక మూర్ఖుని కన్నా, జ్ఞానిని ఎల్లకాలం గుర్తుంచుకోరు. ఇప్పుడు చూసేదంతా కొద్దిరోజులు పోతే మరచిపోబడుతుంది. జ్ఞాని కూడా మూర్ఖుల్లాగానే మరణిస్తాడు. అందుచేత జీవితాన్ని నేను అసహ్యించుకుంటాను. సూర్యుని కింద చేసిన పని, నాకు ప్రమాదకరమైంది : ఎందుకంటే అంతా వ్యర్థమూ, ఆత్మ వేదనాను! అవును మండుటెండలో నేను చేసిన శ్రమ అంతటిని నేను అసహ్యించుకుంటాను: ఎందుకంటే — ఇదే శ్రమను నేను, నా తర్వాత వచ్చే వారికి వదిలి పోవాలి. తాను చేసిన శ్రమ, హృదయ వేదన, మండుటెండలో చేసిన కృషికి ఫలితమా? అతని రోజులన్నీ విచారకరమే! అతని శ్రమ దుఃఖమయం. రాత్రిపూట కూడా అతని  హృదయానికి విశ్రాంతి లేదు. ఇది కూడా వ్యర్థమే. అతని శ్రమ శక్తి నుంచి మనిషి — తింటానికి, త్రాగటానికి, ఆత్మ సంతృప్తి చెందటానికి భద్రత లేదు. అన్ని విషయాలూ అందరికీ —

మంచివానికి, చెడ్డవానికి

ధర్మానికి , అధర్మానికి

స్వచ్ఛత ఉన్నవాడికి, లేని వాడికి

త్యాగికి, త్యాగం చేయని వానికి

గుణవంతునికి, పాపికి

ప్రమాణం చేసే వానికి, చెయ్యని వానికి —

సమానంగానే వస్తాయి.

సూర్యుని కింద ఉన్న అందరికీ ఒకటే — చెడు. ఒకటే — అంతం. అవును. మానవ పుత్రుల హృదయాలు చెడుతో నిండి ఉంటాయి. వారు బ్రతికి ఉన్నప్పుడు వారి గుండెల నిండా పిచ్చితనం ఉంటుంది.  తర్వాత వారు కూడా మరణించిన వారి వద్దకు పోతారు. బ్రతికి ఉన్నవారిలో కొద్ది ఆశ ఉంటుంది. చచ్చిన సింహం కన్నా బ్రతికున్న కుక్క మేలన్నట్లు! బ్రతికిన వారికి తాము చనిపోతామన్న స్పృహ అయినా ఉంటుంది. కానీ చనిపోయిన వారికి ఏమీ తెలీదు. వారేమీ ప్రపంచానికి ప్రతిఫలం కాదు; వారి జ్ఞాపకాలు, వారి ప్రేమానురాగాలు, అసహ్యాలు, అసూయలు — అన్నీ నశిస్తాయి; ఆకాశం క్రింద జరిగే కార్యకలాపాల్లో వీరు ఎప్పటికీ భాగస్తులు కారు.”

సోలోమన్ (లేదా) పై మాటలు ఎవరైతే  వ్రాశారో వారు పై విధంగా చెప్పారు.

భారతీయ జ్ఞానం ఈ క్రింది విధంగా చెబుతుంది:

“శాక్యముని” అని ఒక యువరాజు ఉండేవాడు. రోగము, ముసలితనము, మరణమూ యొక్క ఉనికి — అతనికి తెలియకుండా దాచివేయబడతాయి. అతడు ఒకసారి విహారానికి బయటకు వెళ్తాడు. పళ్ళు లేకుండా, చొంగ కార్చే ఒక ముసలాయనను శాక్యముని చూస్తాడు. అప్పటివరకు ముసలితనము నేది ఆ యువరాజు నుండి దాచివేయబడింది. కనుక అతడు ఆశ్చర్యపోయి, ఇది ఏమిటి? అని అడుగుతాడు. ఆ ముసలాయన అటువంటి దయనీయ, అసహ్యకరమైన స్థితికి ఎలా వచ్చాడు? అని అడుగుతాడు. మనుషులందరూ ఈ కర్మ అనుభవించాల్సిందే; తనకు కూడా ఈ స్థితికి రావడం తప్పదు — అని తెలుసుకొని, ఇంకా ముందుకు సాగలేక తనను వెనక్కి (రాజ  ప్రాసాదానికి) తీసుకుపొమ్మని సారధిని ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయం గురించి ఆలోచించదల్చుకొని తలుపులు వేసి, ఒంటరిగా ఉండి ఆలోచిస్తాడు. బహుశా తనకు తాను ఒక ఓదార్పు రూపొందించుకొని ఉంటాడు! ఎందుకంటే — మరలా ఆ యువరాజు నగరానికి విహారం వెళ్లడానికి, సంతోషంగా తయారవుతాడు. కానీ ఈసారి ఓ రోగిని చూస్తాడు. ఆ రోగి కృశించి, నీలవర్ణంతో ఉండి, కాంతిలేని కళ్ళతో, వణుకుతూ ఉంటాడు. ఆయన నుండి రోగము అనేది దాచిపెట్టబడింది కాబట్టి, శాక్యమునికి, అదేమిటో తెలీదు. ఏమిటది ?అని అడుగుతాడు ఆయన. దాన్ని  ‘రోగం’ అంటారని, మానవులందరూ రోగం  బారిన పడవచ్చని, సంతోషం, ఆనందంతో సాగే తను కూడా

భవిష్యత్తులో ‘రోగి’అయ్యే అవకాశం ఉందని తెలుసుకొని — ఆ విహారం కొనసాగించలేక తనను వెనుకకు తీసుకుపొమ్మని సారధికి ఆదేశం ఇస్తాడు.

మరలా కొంత ఉపశాంతి పొందాలనుకున్నాడు. బహుశా ఉప శాంతి లభించిందేమో! మరలా మూడోసారి ఆనందించడానికి బయటకు బయలుదేరాడు. ఈసారి ఆయన కొత్త దృశ్యం చూశాడు: కొంతమంది మనుషులు ఏదో మోసుకుపోవడం చూశాడు.

“ఏమిటది?”.

జవాబు: “మరణించిన మనిషి ” ;

“మరణమంటే ఏమిటి?” యువరాజు అడిగాడు.

జవాబు : “మరణించడం అంటే ఆ మనిషి లాగా అవ్వడం.”

యువ రాజు శవం దగ్గరికి వెళ్లి, ముసుగు తొలగించి, శవాన్ని పరిశీలిస్తాడు.

“ఆ  మృతదేహానికి ఏమవుతుంది?” అని యువరాజు అడుగుతాడు.

జవాబు: “అది భూమిలో పాతి పెట్టబడుతుంది!”

“ఎందుకు?” యువరాజు అడుగుతాడు.

జవాబు: “ఆ మనిషి తిరిగి జీవం పొందడు. ఆ మృతదేహం పురుగులు, దుర్వాసన మాత్రమే కలిగిస్తుంది.”

“అందరికీ అంతిమంగా జరిగేది ఇదేనా?”

“నాకు కూడా అదే జరుగుతుందా? “

“నన్ను కూడా పాతి పెడతారా? “

” నేను కూడా దుర్వాసన కలిగిస్తానా? “

“నన్ను పురుగులు తినేస్తాయా? “

అన్నిటికీ “అవును”  అని జవాబు వస్తుంది.

 “ఇంటికి వెళదాం! నా ఆనందం కోసం నేనింక బయటకు వెళ్ళను. నేనెప్పటికీ బయటకి వెళ్ళను!”

శాక్య ముని జీవితంలో ఓదార్పు పొందలేకపోయాడు. జీవితమనేది అన్నిటికన్నా పెద్ద అరిష్టమని నిర్ణయించుకున్నాడు. దాని నుండి బయటపడడానికి, ఇతరులను విముక్తి చేయడానికి తన ఆత్మ శక్తి నంతా వినియోగించాడు; ఇంకా, జీవితమనేది మరణానంతరం మరలా పునరావృతం కాకుండా ఉండాలని, జీవం పూర్తిగా కూకటివేళ్లతో సహా నాశనం అవ్వబడాలని ఆయన కోరుకున్నాడు. భారతీయ జ్ఞానం పై విధంగా చెబుతోంది.

జీవిత ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు మానవ మేధస్సు ఇచ్చే సూటి జవాబులు ఇవి.” శారీరక జీవితం ఒక అనర్ధం మరియు ఒక అబద్ధం. అందుచేత ఈ శారీరక జీవిత వినాశనం ఒక దీవెన. దాన్ని మనం కాంక్షించాలి, ” సోక్రటీస్ ఉవాచ.

“జీవితం అనేది అరిష్టం కాకూడదు. శూన్యంలో జారిపోవడమే  జీవితంలో ఉన్న మంచి,”

స్కోపెన్ హాయర్ సిద్ధాంతమిది.

“ఈ లోకంలో ఉన్నదంతా —

 మూర్ఖత్వము — జ్ఞానము,

 సంపద — పేదరికం,

 ఆనందం — దుఃఖం,

 వ్యర్థము మరియు శూన్యము.

 మనిషి మరణిస్తాడు. అతనిది అంటూ ఏమీ     మిగలదు. అది మూర్ఖత్వం, ” సోలోమన్ చెప్పిన మాటలివి.

“దుఃఖము, దుర్బలత్వం, ముసలితనం మరియు మరణం ఇవన్నీ ఉంటాయని తెలుసుకొని, ఆ అనివార్యతలో జీవించడం అసాధ్యం — ఈ జీవితం నుండి మనం విముక్తులం కావాలి, ” గౌతమ బుద్ధుని ఆలోచన.

పై గొప్ప మేధావులు చెప్పినదంతా– వారి లాంటి కోట్లాదిమంది ప్రజలు అదే రకంగా చెప్పారు, ఆలోచించారు, భావించారు. నేను కూడా అదే భావించాను.

అందుచేత — సైన్స్ లో నేను సంపాదించిన జ్ఞానమంతా నన్ను నా నిరాశ నుండి విముక్తి చేయకపోగా, దాన్నింకా శక్తివంతం చేసింది.  సైన్స్ లో ఒక శాఖకు చెందిన జ్ఞానం జీవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇంకో శాఖ నా నిరాశను బలపరుస్తూ ఇలా చెప్పింది :  ‘నేను చెప్పినది తప్పు కాదు. రోగపూరిత మనసు చెప్పింది కాదు. నా ఆలోచనలు సరైనవే ! అతి శక్తివంతమైన మానవమేధస్సులు చెప్పినవే ఇవి!’ అని.

                  ఆత్మ ద్రోహం మంచిది కాదు. ఇదంతా వ్యర్థమే! పుట్టని వాడే సంతోషపరుడు. జీవితం కంటే మరణం మేలయినది. మనిషి జీవితం నుండి విముక్తి పొందాలి!

Also read: నా సంజాయిషీ

                    ———–   —— ————–

 గమనిక : టాల్స్టాయ్  రచన యధాతధంగా అనువదించబడినది. దీనిలో భారతీయ జ్ఞానము, గౌతమ బుద్ధుని ఆలోచనల గురించి చెప్పిన మాటలు అనువాదకుల  అభిప్రాయం కాదు.

 ఇది పాఠకులు గమనించగలరు.

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles