అరుణ్ సాగర్ ట్రస్ట్ (హైదరాబాద్) అధ్వర్యంలో జనవరి 2వ తేదీన అరుణ్ సాగర్ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ప్రఖ్యాత న్యాయ కోవిదులు, కేంద్ర సమాచార పూర్వపు కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధరాచార్యులు `ఫేక్ న్యూస్-సోషల్ మీడియా` అనే అంశంపై `అరుణ్ సాగర్ స్మారకోపన్యాసం చేస్తారు.
తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించే కార్యక్రమానికి`సరస్వతీ నమ్మాన్` పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ప్రముఖ పాత్రికేయులు, `సకలం` సంపాదకులు కె.రామచంద్రమూర్తి, టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక అతిథులుగా, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ కట్టా శేఖరరెడ్డి, `ఆంధ్రజ్యోతి` సంపాదకుడు డా.కె.శ్రీనివాస్, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు,ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అందోల్ ఎమ్మెల్యే సీహెచ్ క్రాంతికిరణ్, టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు.
`సాక్షి` దినపత్రిక సంపాదకుడు వర్దెల్లి మురళి `విశిష్ట పాత్రికేయ పురస్కారం`, ప్రముఖ కవి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ `విశిష్ట సాహిత్య పురస్కారం` స్వీకరిస్తారు.
జనవరి 2 సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆఫ్ లైన్ సమావేశం జరుగుతుంది. ఆన్ లైన్ జూమ్ ద్వారా (ఐడీ: 9133345314 ,పాస్ వర్డ్ 123456) ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.
ఎం.రాజ్ కుమార్, కొండపల్లి పావన్, వైజై రాంబాబు, టి.జగన్ మోహన్ నిర్వహించే ఈ కార్యక్రమానికి బండ్ల మాధవరావు, అనిల్ డ్యాని, మువ్వా శ్రీనివాసరావు ఆన్ లైన్ ద్వారా సమన్వయం కర్తలుగా వ్యవహరిస్తారు.
అరుణ్ సాగర్ అంటే…!
ఎందరో ఉదయించే భాస్కరులకు `మేలుకొలుపు` పాడి, ఉజ్వల భవిష్యత్ గల `అరు`ణ్ ఐదుపదులకు ఏడాదికి ముందే అర్ధంతరంగా `అస్త` మించారు. పాతికేళ్లకుపైగా పాత్రికేయ ప్రస్థానంలో వివిధ పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో తనకంటూ ప్రత్యేకతను సాధించారు.మంచి సాహితీవేత్త, కవిగానే కాకుండా టీవీ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్నారు. సమకాలికులు, మిత్రులు ఆయా అంశాలను ముచ్చటించుకునేపటప్పడు అరుణ్ సాగర్ ను ప్రస్తావించకుండా ఉండలేరంటే ఆయన ముద్ర ఎలాంటిదో అవగతమవుతుంది.
`మూసధోరణికి అలవాటు పడిన వాళ్లకు కొత్తదనాన్ని పరిచయ చేసిన సంతకం.ఎవరి లోకంలో వాళ్లు ఊరేగుతున్నప్పుడు మనలోని మాలిన్యాలను,వంకరపోకడలను అక్షరాలతో సునిశితంగా దెప్పిపొడుస్తూనే బతుకు మార్మికత్త్వాన్ని కుండబద్ధలు కొట్టడం ఆయనకే (నీకే) చెల్లింది.కలం గండెల్ని చీల్చే ఆయుధమైనప్పుడు మనమంతా మౌనాన్ని ఆశ్రయిస్తాం. తనదైన శైలి,ఏకబిగిన చదివించే ఒరవడి. సముద్రమంతటి మేధోతనం. రాత్రుల్ని వెలిగించే సాయుధపు గొంతుక అతడి సొంతం.`అని ఒక మిత్రుడు ఆయన జన్మదినం సందర్బంగా ఫేస్ బుక్ లో పెట్టిన సందేశం ఆయన వ్యక్తిత్వానికి, రచనాశైలికి మచ్చు తునక.