ప్రముఖ సీనియర్ నటుడు, త్రిపురనేని రామస్వామి వారసుడు సాయిచంద్ కాలినడకదీక్ష కొనసాగిస్తున్నారు. అయిదవ రోజైన సోమవారంనాడు సూళ్లూరుపేట, గూడూరు దాటి తన స్వగ్రామం ప్రకాశం జిల్లా పడమటిపల్లె వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగువారికోసం పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ప్రభుత్వాలు కానీ పౌరసమాజం కానీ ఇంతవరకూ పట్టించుకోలేదన్న ఆవేదనతో ఈ నెల 15 తేదీన మైలాపూర్ లో బులుసు సాంబమూర్తి (పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచిన చోటు)నివాసం నుంచి కాలనడక దీక్ష ప్రారంభించారు.
Also read: సాయిచంద్ ఒంటరి యాత్ర
శ్రీరాములు స్మారక చిహ్నం దగ్గర నమస్కారం చేసి, కొంతమంది మిత్రుల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు. పెద్ద పటాటోపం, ఆడంబరం లేకుండా ఒంటరిగానే యాత్ర చేస్తున్న ప్రఖ్యాత రచయిత గోపీచంద్ కుమారుడు సాయిచంద్ గ్రామాలలో ప్రవేశించినప్పుడు ప్రజలు స్వాగతం చెబుతున్నారు. గ్రామం వీడి వెళ్ళే సమయంలో వీడ్కోలో పలుకుతున్నారు. ఆదివారం నాడు స్వర్ణముఖి నది వద్ద కొందరు చేరి ఆయనకు పుష్పమాల వేసి సత్కరించి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలియజేశారు. సోమవారం గూడూరు నుంచి యాత్ర బయలు దేరింది. శనివారానికల్లా పొట్టి శ్రీరాములు పూర్వీకుల స్వగ్రామమైన పడమటిపల్లెకు చేరుకుంటామనీ, తర్వాత బహిరంగ సభ ఉంటుందనీ ఆయన తెలియజేశారు. గాంధీ అనుచరుడు, గాంధీతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహారదీక్ష అనంతరం 15 డిసెంబర్ 1952న మద్రాసునగరంలో కన్నుమూశారు.
Also read: సాయిచంద్ పొట్టిశ్రీరాములు సంస్మరణ పాదయాత్ర చెన్నై నుంచి ప్రారంభం