ప్రముఖ నటుడు సాయిచంద్ చేపట్టిన కాలినడకదీక్ష చివరిఘట్టం చేరుకున్నది. పొట్టిశ్రీరాములుపైన అమితమైన అనురాంగంతో, భక్తిభావంతో ఆయన స్మృతి కోసం, ఆయన జీవిత విశేషాలను ప్రజలకు తెలపడం కోసం ప్రారంభించిన నడకదీక్ష శనివారంనాడు పొట్టిశ్రీరాములు పూర్వీకుల పుట్టినూరు ప్రకాశంజిల్లా పడమటిపల్లె గ్రామం చేరుకుంటారు. గురువారంనాడు సాయిచంద్ తో ఒక బుడతడు నడవగా శుక్రవారంనాడు ఒక యువతి పొట్టి శ్రీరాములు ఫొటో పట్టుకొని నడిచింది.
దారిలో కొందరు కలుసుకొని, ఒక మహిళ హారతి ఇచ్చి సాయిచంద్ ను దీవించింది. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులూ, విద్యార్థులూ పెద్ద సంఖ్యలో సాయిచంద్ ను కలుసుకొని పొట్టిశ్రీరాములు విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
గురువారంనాడు ‘ఈనాడు’ విలేఖరితో మాట్లాడుతూ, తాను చిన్నతనం నుంచి పొట్టిశ్రీరాములును చిన్నతాతగా పరిగణించేవాడినని సాయిచంద్ చెప్పారు. ఆయన గాంధీతో సమానుడనీ, ఆయనపైన సినిమా తీయాలని తనకు బలమైన ఆకాంక్ష ఉన్నదనీ, కానీ సినిమాకు సరిపడా సమాచారం లేదనీ, అందుకే డాక్కూడ్రమా తీయాలని యోచిస్తున్నాననీ అన్నారు. ఈ సంవత్సరం పొట్టిశ్రీరాములు 70 వ వర్థంతి కనుక సంవత్సరం పొడుగునా కార్యక్రమాలు చేయాలని సంకల్పించానని చెప్పారు. తనది పాదయాత్ర కాదనీ, కార్యదీక్ష అనీ అభివర్ణించారు. తెలుగు భాషపైన వల్లమాలిన అభిమానముందనీ, అందుకే అచ్చ తెలుగులో కాలినడకదీక్ష అని తన యాత్రకు పేరు పెట్టుకున్నాననీ ప్రముఖ సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి మనుమడు, ప్రముఖ రచయిత గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ తెలియజేశారు.
డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు వర్థందిని పురస్కరించుకొని చెన్నైలోని మైలాపూర్ లో శ్రీరాములు స్మారక మందిరం నుంచి నడకదీక్షను సాయిచంద్ ప్రారంభించారు.