మండలి బుద్ధప్రసాద్, మాజీ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
‘‘ఒకరైనా పీ కేకకు
‘ఓ’యని రాకున్నా
ఒక్కడివే బయలుదేరు
ఒక్కడివే ఒక్కడివే
ఒకడివే బయలుదేరు’’ అంటూ
పదిమంది మెచ్చినా, మెచ్చకున్నా ఆగకుండా కర్తవ్యాన్ని నిర్వహించాలని విశ్వకవిరవీంద్రడు ‘ఏక్లా చలో రే’ అనే ప్రసిద్ధ గేయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రసిద్ధ సినీనటుడు త్రిపురనేని సాయిచంద్ అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్థంతినాడు అమరజీవి అసువులు బాసిన చెన్నైలోని స్మారక స్థలి నుండి ఆయన జన్మస్థానమైన పడమటిపల్లె వరకు కాలి నడకన దీక్ష ప్రారంభించారు.
సాయిచంద్ ప్రసిద్ధ సంఘ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామిగారి మనుమడు. ప్రసిద్ధ రచయిత గోపీచంద్ కుమారుడు. తాత, తండ్రుల వారసత్వాన్ని నరనరాన జీర్ణించుకున్నవారు. ‘మా భూమి’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశంచేసి, ఇటీవల ఫిదా, సైరా నరసింహారెడ్డి, విరాటపర్వం చిత్రాల ద్వారా మంచి నటుడుగా గుర్తింపు పొందారు. సందేశాత్మక డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించారు. వారసత్వంగా వచ్చిన సంఘ సేవా దృక్పథం ఆయన నుంచి దూరం కాలేదనడాని ‘కాలినడక దీక్ష’ చాటి చెబుతోంది.
నాయకులు చేస్తున్న పాదయాత్ర వలె తన వెంట వందలాది మంది పాల్గొనాలని గాని, పత్రిక, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కావాలని కానీ సాయిచంద్ కోరుకోకుండా ఒంటరిగా బయలుదేరారు.
1913లో బాపట్లలో ఆంధ్రోద్యమానికి అంకురార్పణ జరిగింది. ‘‘స్వయం నిర్ణయం, స్వయం కృషి మూలంగా ఆంధ్రులు తమ జాతీయతను, ఐక్యత, విజ్ఞానము, కళలు, భాష, ఆర్థిక సంపద, పరిశ్రమలు, సాంకేతిక స్థితి, ధైర్య, స్థయిర్య, వీర్య, సాహసౌదార్యాది నైతిక గుణ సంపత్తిని అభివృద్ధి పరచుకొని సంపూర్ణ ఆత్మ వికాసము నొంది, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలలో, తాను స్వీయధర్మ నిర్వహణలో సమర్థతతో నెరవేర్చటానికై సర్వతోముఖమైన ఆంధ్రాభ్యుదయము కొరకు నిరంతర కృషి చేయుట, ఇందుకు సాధనముగా సత్వరాంధ్ర రాష్ట్ర సిద్ధికై యత్నించుట” ఆంధ్రోద్యమ లక్ష్యాలుగా ప్రకటించి ఆంధ్రోద్యమానికి నడుం కట్టారు.
నలభై సంవత్సరాల ఉద్యమాల తరువాత, చివరికి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు కఠోర నిరాహారదీక్ష చేసి అమరుడైన తరువాత గాని రాష్ట్ర సిద్ధి జరగలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని అంగీకరించి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. అనంతరం పలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణే కారణమైంది. ఆ విధంగా భాషాప్రయుక్త రాష్ట్రాల జనకుడైనాడు శ్రీ పొట్టి శ్రీరాములు.
అయితే, మనం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరచిపోయాం. ఆంధ్రోద్యమ లక్ష్యాలను మరిచిపోయాం. తెలుగు భాషలో చదువుకోవడానికి, తెలుగులో పాలన చేసుకోవడానికి మనకో రాష్ట్రం కావాలని కోరి రాష్ట్రం సిద్ధించిన తరువాత ఆ విషయాన్ని మరచిపోయాం. తెలుగు భాషకు అధోగతి పట్టించాం. భాషాప్రయుక్త రాష్ట్రాల కొరకు పోరాడి, సాధించి తెచ్చిన మనమే రాష్ట్ర విభజనకు కారకులయ్యాము. దేశభక్తిలో, త్యాగనిరతిలో ఎవరికీ తీసిపోనప్పటికీ “ఆంధ్రానాం అనేకత్వం” అని చాటుకున్నాం.
స్వీయ ప్రయోజనం తప్ప సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించని నేటి రోజుల్లో సాయిచంద్ లాంటి వారి ఆవేదనల్ని, ఆలోచనల్ని ఎంతవరకు సహృదయంతో. ప్రజానీకం స్వీకరిస్తారో ప్రశ్నార్థకమైనప్పటికీ…
తెలుగు బిడ్డ మరచిపోకుర
తెలుగు దేశంబు పురిటిగడ్డర
కొక్కరకో పాట పాడర
తెలుగు వారల మేల్కొల్పర
అనే తన తాత త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రబోధ గీతాన్ని ఆలంబనగా తీసుకుని నడుస్తున్న సాయిచంద్‌ని అభినందిస్తున్నాను. యాత్రలో సాయిచంద్‌ని అనుసరించక పోయినా, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, ఆంధ్రోద్యమ లక్ష్యాలను స్మరించుకునే అవకాశం కల్పించారు.
తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి నడుం కట్టి ‘నేను తెలుగువాణ్ణి’ అని సగర్వంగా చెప్పుకునే రోజులు రావాలని సాయిచంద్ యాత్ర తెలుగువారిలో కొందరినైనా ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను.
Also read: సాయిచంద్ పొట్టిశ్రీరాములు సంస్మరణ పాదయాత్ర చెన్నై నుంచి ప్రారంభం