- పొట్టిశ్రీరాములు పూర్వీకుల సొంతూరు పడమటిపల్లి చేరిక
- డిసెంబర్ 15నుంచి చెన్నై నుంచి 380 కి.మీ. నడక
- పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రజలకు తెలియజేయడం కోసం దీక్ష
ప్రముఖ నటుడు సాయిచంద్ కాలినడకదీక్షలో అంతిమ ఘట్టంగా పొట్టి శ్రీరాములు సొంతూరు ప్రకాశం జిల్లా పడమటిపల్లి శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఈ నెల 15వ తేదీన పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకొని సాయిచంద్ చెన్నైలోని మైలాపూర్ లో పొట్టి శ్రీరాములు స్మారకభవనం నుంచి నడకదీక్ష ప్రారంభించారు. గూడూరు, నెల్లూరు, కావలి మీదుగా నడిచి ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టారు.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నేటి తరాలకు తెలియజేయడమే పరమలక్ష్యంగా కాలినడకదీక్షను సాయిచంద్ చేపట్టారు. ఇది 70వ వర్థంతి సంవత్సరం కనుక ఏడాది పొడవునా పొట్టి శ్రీరాములును స్మరించుకునే విధంగా సభలు జరపాలని సాయిచంద్ సంకల్పం. పొట్టి శ్రీరాములుపైన డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా నిర్మించాలని అనుకుంటున్నారు. పొట్టి శ్రీరాములంటే తనకు చిన్నతనం నుంచీ అభిమానమనీ, చిన్నతాతయ్యగా భావించేవాడిననీ ప్రముఖ సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి మనుమడు. ప్రముఖ రచయిత గోపీచంద్ కుమారుడు సాయిచంద్ అన్నారు. పడమటిపల్లికి చెందిన సాధారణ ప్రజలూ, ప్రముఖంగా ఆర్యవైశ్యులూ సాయిచంద్ కు ఘన స్వాగతం చెప్పారు. చెన్నై నుంచి ప్రకాశంజిల్లాకు నడిచివచ్చే దారిలో పొట్టి శ్రీరాములు అభిమానులు సాయిచంద్ ను కలుసుకొని పూలమాలలతో సత్కరించారు. పడమటిపల్లి చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన షామియాలో నిలబడి ప్రజలను ఉద్దేశించి సాయిచంద్ ప్రసంగించారు.
Also read: ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులతో సాయిచంద్ మాటామంతీ
కొప్పర్రు రైతు సంఘీభావం
సాయిచంద్ 380 కిలోమీటర్ల నడకదీక్షకు మద్దతుగా పశ్రిమగోదావరి జిల్లా కొప్పర్రురైతు నూకల రత్నాజీ, ఇతర మిత్రులతో కలసి శనివారం ఉదయం పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించి నరసాపురం వరకూ పది కిలోమీటర్లు నడిచారు. ‘సంఘీభావ యాత్ర’ అనే బ్యానరు పట్టుకొని మహిళలూ, పురుషులూ ‘‘అమరజీవి పొట్టి శ్రీరాములుకూ జోహార్లు జోహార్లు’’ అంటూ నినాదాలు చేస్తూ నడిచారు.
Also read: సాయిచంద్ తో పాటు నడిచిన బుడతడు