- విమానంలో వెనక్కి పోతున్నట్టుంది, దేశం ప్రమాదకర స్థితిలో ఉంది
- కులాలూ, మతాలూ, పేద, ధనిక, ఆడ, మగ ప్రాతిపతికగా చట్టాలు అమలు
ప్రస్తుతం భారత దేశం వెనక్కి నడుస్తున్న విమానంలాగా ఉన్నదని అభివర్ణిస్తూ బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీరాయ్ మానవహక్కుల నాయకుడు, ఆచార్యుడు అయిన ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసి నిర్బంధించడం దేశానికే అవమానమని చెప్పారు. దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎస్ సాయిబాబా రచించిన కవితలూ, వ్యాసాలతో కూడిన సంకలనం ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అరుంధతీరాయ్ దేశం ప్రమాదపుటంచులలో ఉన్నదని, ప్రభుత్వాల తీరు ఇదే విధంగా సాగితే చాలా నష్టపోతామని హెచ్చరించారు. దిల్లీలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సాయిబాబా భార్య వసంత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ అరుంధతీరాయ్, 1960 దశకంలో భూములను పేదలకు పంచాలంటూ విప్లవనాయకులు ఉద్యమాలు చేసిన విషయం గుర్తు చేశారు. విమానంలో మీరు వెనక్కి ప్రయాణించగలరా అని ఒక పైలట్ స్నేహితుడిని ఇటీవల అడిగితే ఆయన పెద్దగా నవ్వారనీ, కానీ ప్రస్తుతం భారత దేశంలో అదే జరుగుతున్నదని ఆమె వ్యాఖ్యానించారు. మన రాజకీయ నేతలు విమానంలో వేగంగా వెనక్కి పోతున్నారనీ, దీంతో అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోతున్నాయనీ, ఇదే పద్ధతి కొనసాగుతే దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనీ అన్నారు. అత్యాధునిక న్యాయశాస్త్రానికీ, పటిష్టమైన రాజ్యాంగానికీ పుట్టినిల్లయిన భారత దేశంలో ఈ రోజున మతం, కులం, ప్రాంతం, పేద, ధనిక వర్గాలు, స్త్రీలు, పురుషులు అనే పరిగణన ఆధారంగా చట్టాలు అమలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఏడేళ్ళ నుంచి జైలులో మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం శరీరం పక్షవాతంతో వ్యాధిగ్రస్థమైందనీ, అటువంటి వ్యక్తి జైలులో ఉండటం గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నామనీ అరుంధతి అన్నారు. మనందరం ఎటువంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇంతకంటే పెద్ద దృష్టాంతరం ఏమి కావాలని అడిగారు. ఇది దేశానికి అవమానకరం కాదా అని ఆమె ఆగ్రహం వెలిబుచ్చారు.
అరుంధతీరాయ్ రచించిన నవల ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ఆమెకు బుకర్ ప్రైజ్ సాధించిపెట్టగా, ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హాపీనెస్’ విశేష పాఠకాదరణ సాధించి పెట్టింది. ఆమె ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల జీవితాలనూ, అక్కడి పరిస్థితులనూ అధ్యయనం చేయడానికి అడవులలో చాలా రోజులు గడిపారు.