హైదరాబాద్ : ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ కు స్పోర్ట్స్ బైక్ లంటే ఇష్టం. 15 అక్టోబర్ 1986న చిరంజీవి సోదరి విజయదుర్గకు పుట్టిన సాయికి బైక్ అంటే ప్రాణం. చిన్నతనంలో తన తాతగారు బైక్ నడుపుతుంటే పిలియన్ మీద కూర్చొని గంటల తరబడి ప్రయాణం చేయడం అలవాటు. అదే అలవాటు పెద్దయిన తర్వాత కూడా ఒక మోజుగా, ఒక ప్యాషన్ గా మారింది. మేనల్లుడి బైక్ లంటే ఇష్టమని తెలిసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఎవెంజర్ బైక్ బహుమతిగా ఇచ్చారు. తర్వాత సాయి తల్లి ఒక స్పోర్ట్స్ బైక్ కొని ఇచ్చారు. ఇప్పుడు సాయి గరాజ్ లో నాలుగు స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైన బైక్ ట్రయంఫ్ స్పోర్ట్స్ బైక్.
సాయి స్నేహితుల బృదం పెద్దది. వారాంతంలో వారితో పార్టీలలో గడపడం పరిపాటి. ఆ పార్టీలకు సైతం కారు కాకుండా బైక్ మీద వెళ్ళడానికే ఇష్టపడతాడు. సందీప్, కిషన్, హర్ష సాయికి ఆప్తమిత్రలు. జూబిలీ హిల్స్ లో బయలు దేరి గచ్చిబౌలిలో వారి దగ్గరికి వెడుతున్న సమయంలోనే దుర్గం చెరువు కేబుల్ రోడ్డు పైన ఇసుక చేరడంతో బైక్ జారి పడింది. 15 మీటర్ల దాకా ఈడ్చుకొని పోయింది. ఆ రోజు వినాయక చవితి కావడం, ప్రభుత్వం, ప్రవైటు కార్యాలయాలను సెలవు కావడంతో రోడ్డు మీద ట్రాఫిక్ అంతగా లేదు. లేకపోతే వెనకనుంచి భారీ వాహనాలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. సాయి ఎప్పుడు స్పోర్ట్స్ బైక్ బయటికి తీసినా స్పోర్ట్స్ జాకెట్, హెల్మట్ తప్పని సరి. శుక్రవారం రాత్రి కూడా జాకెట్ వేసుకోలేదు కానీ హెల్మెట్ పెట్టుకున్నాడు. దాని వల్లనే తలకు గాయం కాలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడటానికి హెల్మెట్ ప్రధాన కారణం.
ప్రమాదం సాయంత్రం గం.7.30కి జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ మీద వెడుతున్న ఒక మహిళ సాయి ధరమ్ తేజ్ ను గుర్తుపట్టి వెంటనే 100 నంబరుకు డయల్ చేసి పోలీసులకి విషయం తెలియజేసింది. నిమిషాలలో పోలీసులు వచ్చారు. ఎనిమిది గంటల కల్లా సమీపంలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ముందు జాగ్రత్త కోసం వెంటిలేటర్ పెట్టారు. స్కాన్ చేస్తే అంతర్గతంగా గాయాలు ఏమీ లేవు. కాలర్ బోన్ విరిగింది. అది నయం కావడానికి కొంతకాలం పడుతుంది. షాక్ వల్ల స్పృహ కోల్పోయాడు కానీ గాయాల వల్ల కాదు. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్ డీఎస్) ప్రభావం ఊపిరితిత్తులపై ఉన్నట్టు వైద్యులు గమనించారు. దానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం రాత్రే జూబిలీహిల్స్ లోని అపొలో ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్ ను తరలించారు. తన మేనల్లుడు క్షేమంగా ఉన్నాడనీ, ఆందోళన ఏ మాత్రం లేదనీ చిరంజీవి ట్వీట్ పెట్టారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, సాయి తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆస్పత్రికి వెళ్ళి సాయిని పలకరించారు. శనివారం ఉదయం నటులు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లు అపోలోలో సాయిని పరామర్శించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఇసుకను శనివారం ఉదయమే జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు.