- ఉపఎన్నిక విజయంపై కాంగ్రెస్ ఆశలు
- అభ్యర్థి అన్వేషణలో బిజీగా టీఆర్ఎస్, బీజేపీ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోనుంది. కాంగ్రెస్ నేతలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష ఎంపిక కూడా వాయిదా పడింది. దీంతో పార్టీ నేతలంతా నాగార్జున సాగర్ ఉపఎన్నికపై దృష్టి సారించారు. దుబ్బాక శాసనసభ, ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ కూడా నాగార్జున సాగర్ లో గెలిచితీరాలని పట్టుదలగా ఉంది.
నాలుగు దశాబ్దాలుగా నాగార్జున సాగర్ నుంచి పోటీచేస్తున్న జానారెడ్డి ఇపుడు కూడా కాంగ్రెస్ తరపున బరిలో దిగుతుండటంతో ఆపార్టీకి ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యాగా మారింది. నేతలందరూ ఐక్యంగా సమన్వయంతో పనిచేయాలని అధిష్ఠానం ఇప్పటికే సూచనలు చేసింది. గత కొద్దినెలలుగా తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ ప్రాభవాన్ని కూడా నిలువరించాలని కాంగ్రెస్ నేతలు గట్టిగా భావిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చూపిన అత్యంత పేలవ ప్రదర్శనతో ఖంగుతిన్ననేతలు ఈ సారి పక్కా ప్రణాళికతో ఎన్నికల బరిలోకి దిగేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలో విజయం ద్వారా టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. జానారెడ్డి ఇప్పటికే పలుగ్రామాలు కలియ తిరుగుతూ శ్రేణుల్లో జోష్ ను నింపుతున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఎనిమిదో సారి విజయం సాధించి తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలియజెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇదీ చదవండి: జానారెడ్డిపైన కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి
అభ్యర్థి ఎంపికపై రాని స్పష్టత:
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవడంద్వారా బీజేపీ కి కళ్లెం వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. సాగర్ టికెట్ నోముల నర్శింహయ్య కుటుంబానికి ఇస్తుందా లేదా వేరెవరినైనా బరిలోకి దించుతుందా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నోముల నర్శింహయ్య కుమారునికి టికెట్ ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది.
ఇదీ చదవండి: లేదు..లేదు….నేను పోటీలోనే ఉన్నా : జానా
త్రిముఖ పోటీలో పైచేయి సాధించాలని బీజేపీ వ్యూహం:
ఇక ఈ ఎన్నికలో విజయం సాధించాలంటే బీజేపీ అధికార టీఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్ తో కూడా గట్టిగా పోరాడాల్సిఉంటుంది. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించాల్సిఉంది. ఇతర పార్టీలలోని వారికి గాలం వేస్తారా లేదా సొంత పార్టీ నేతల్నే బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సిఉంది. అయితే త్రిముఖపోటీ తమకే లాభిస్తుందని బీజేపీ అంచనావేస్తోంది.
ఇక్కడి నుండి రెండు సార్లు జానారెడ్డిపై పోటీ చేసిన నోముల నర్శింహయ్య 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో నోముల మృతిచెందడంతో నాగార్జున సాగర్ కు ఉపఎన్నిక అనివార్యమైంది. జూన్ 1లోపు ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇదీ చదవండి: కమలం వైపు కదలికలా?