- 30,000 కి.మీ., 27 దేశాలు, ఒకె ఒక లక్ష్యం
- మట్టిని రక్షించే ఉద్యమానికి ప్రపంచ ప్రముఖుల మద్దతు
- ఒంటరిగానే మోటర్ సైకిల్ పై సుదీర్ఘ ప్రయాణం
ట్రఫాల్గర్ స్క్వేర్, లండన్: యోగి, దార్శనికులు సద్గురు ‘జగ్గూ’ వాసుదేవ్ ‘మట్టిని రక్షించేందుకు 100 రోజుల యాత్ర’ లండన్‌లోని ఐకానిక్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో సోమవారం (మార్చి 21) ప్రారంభమైంది. మట్టి క్షీణతను తిప్పికొట్టడానికి, అరికట్టడానికి చేసే అత్యవసర ప్రయత్నంలో సద్గురు మట్టిని రక్షించడానికి చైతన్యవంతమైన ప్రపంచం (కాన్షియస్ ప్లానెట్) ఉద్యమాన్ని ఆవిష్కరించారు.
బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం, భారతదేశం గుండా 30,000 కిలోమీటర్ల ఒంటరి మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభించిన సద్గురు రాబోయే కొద్ది నెలల్లో 27 దేశాలను సందర్శిస్తారు. ఆ ప్రయాణంలో ప్రపంచ నాయకులూ, మీడియా ప్రతినిధులూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులతో మట్టిని రక్షించడానికి సంఘటిత చర్యలు చేపట్టవలసిన తక్షణ అవసరాన్ని చర్చిస్తారు.
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టేషన్ (UNCCD) ప్రకారం, 2050 నాటికి భూమిపై ఉన్న నేలలో 90% పైగా నిస్సారమవ్వవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆహారం, నీటి కొరత, కరువుకాటకాలు, ప్రతికూల వాతావరణ మార్పులు, సామూహిక వలసలు, అపూర్వమైన జాతులు అంతరించిపోవడం వంటి విపత్తులకు, సంక్షోభాలకు దారితీయవచ్చు. వేగవంతంగా మట్టిలోని సారం క్షీణతకు గురవ్వడం కారణంగా మన ప్రపంచం ఆహారాన్ని పండించే సామర్థ్యాన్ని కోల్పోతున్నందున ఈ ‘మట్టి వినాశనం’ ప్రస్తుతం మానవాళికి తీవ్రమైన ముప్పుగా మారింది.
‘మట్టిని రక్షించు(సేవ్ సాయిల్)’ ఉద్యమం పలు దేశాలలో పౌరులను చైతన్యవంతం చేసి, వారి మద్దతు ప్రదర్శించడం ద్వారా, మట్టిని పునరుజ్జీవింపజేయడానికి, మరింత క్షీణించకుండా ఆపడానికి విధాన ఆధారిత చర్యను ప్రారంభించడానికి ప్రభుత్వాలకు సాధికారతను ఇస్తుంది. ఇది జరగడానికి, ఉద్యమం 350 కోట్ల మంది ప్రజలను, అంటే ప్రపంచ ఓటర్లలో 60%మందిని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
గత వారంలో, ఆరు కరేబియన్ దేశాలు మట్టిని రక్షించడం(save soil) పట్ల తమకున్న నిబద్ధతను వ్యక్తీకరిస్తూ కాన్షియస్ ప్లానెట్‌తో అవగాహన ఒప్పందాలపై(MoU) సంతకం చేయడంతో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టాయి.
ఈ ఉద్యమానికి ప్రఖ్యాత సంరక్షకురాలు డాక్టర్ జేన్ గూడాల్, పరమ పూజ్యులైన శ్రీ శ్రీ శ్రీ దలైలామా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ స్క్వాబ్ వంటి ప్రపంచ నాయకులు మద్దతు ఇస్తున్నారు. ఈ ఉద్యమంలో మార్క్ బెనియోఫ్ (సేల్స్‌ఫోర్స్), దీపక్ చోప్రా, టోనీ రాబిన్స్, మాథే హెడెన్, క్రిస్ గేల్, జూహీ చావ్లా, సంజీవ్ సన్యాల్ వంటి అనేక మంది ప్రముఖ కళాకారులు, క్రీడాకారులు, కార్పొరేట్ అధిపతులు ఇంకా వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు.