`కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా ఆరునెలలు జీవించు`అన్నది సామెత.దానిని నిజం చేసిన అరుదైన దేశభక్తులలో ఒకరు చంద్రశేఖర్ ఆజాద్ తివారీ. పాతికేళ్లు కూడా నిండకుండానే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు. అంతకు మించిన ఆత్మాభిమాని. పరాయి పాలకులకు బందీగా చని పోవడం కంటే బలిదానమే మిన్నగా భావించి తుపాకీతో పేల్చుకుని ఉసురు తీసుకున్న ఆత్మాభిమాని.
జీవిత విశేషాలు:
మధ్యప్రదేశ్ లోని బావ్రా గ్రామంలో పండిట్ సీతారాం తివారీ, అగరాణీదేవి దంపతులకు 1906 జూలై 23న జన్మించిన చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి, కాశీలో సంస్కృతాన్ని అభ్యసించారు.ఆరంభంలో ఆయనకు చదువుపట్ల అంతగా శ్రద్ధాసక్తులు లేవు.కుమారుడిని సంస్కృత విద్వాంసుడిని చేయాలన్న తివారీ తపనను కుమారుడు మొదట పట్టించు కోలేదు. చదువుకోవాలన్న కన్నవారి ఒత్తిడిని తట్టుకోలేక పదమూడో ఏట ఇల్లు వదిలి బొంబాయి చేరి, మురికివాడలో ఉంటూ కూలిపని చేశారు. రెండేళ్ల దుర్భరజీవితం తరువాత మనసు చదువుపైకి మళ్లీ వారణాసి చేరి సంస్కృత పాఠశాలలో చేరారు. అయినా దృష్టి అంతా స్వరాజ్య సమరంవైపే.దేశ స్వాతంత్ర్ర్యం కోసం ఏదో చేయాలనే ఆ తపన,మరోవంక గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం స్పూర్తితో నిండా పదిహేనేళ్లు లేని ఆయన పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్లి న్యాయస్థానంలో హజరుపరచగా, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిచ్చి కొరడా దెబ్బలు తిన్నారు. `నా పేరు ఆజాద్, నాన్న పేరు స్వాతంత్య్రం, ఇల్లు..జైలు`…ఇవి, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆయనిచ్చిన జవాబులు. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 15 రోజులు జైలు శిక్ష విధించి, ఆ వెంటనే తీర్పును పదిహేను కొరడా దెబ్బలుగా మార్చారు.అయినా చలించలేదు.శరీరంపై పడుతున్నప్రతి దెబ్బ ఆయనలో పట్టుదలను పెంచింది. శిక్ష అనుభవిస్తున్నంత సేపు `వందేమాతరం, భారత్‌మాతాకీ జై` అనే నినాదాలు చేశారు.ఆ దెబ్బలు కర్తవ్యాన్ని బోధించి,మరింత పట్టుదలను పెంచాయి.వారణాసి వాసులు ఆ బాలుడిని ‘ఆజాద్’ అని పిలవడంతో ఆ పేరే స్థిరపడిపోయింది.1919 నాటి జులియన్ బాలాబాగ్ సంఘటన బాగా కలచివేసింది. అంతే…స్వరాజ్య ఉద్యమంలో దూకుడు పెంచారు.
Also Read: అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర
పోరాట పథం:
ధర్మయుద్దంతోనే స్వరాజ్య సాధన అని నమ్మిన ఆజాద్ పంథా మార్చి సాయుధ పోరాటంవైపు మొగ్గు చూపారు. అలా ఏర్పాటైనదే ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ’.భగత్‌సింగ్, భగవతీచరణ్, శివవర్మ, మరికొందరు విప్లవవీరులతో కలిసి 1928 సెప్టెంబరు 8వ తేదీన ఫిరోజ్‌షా కోటలో దీనిని నెలకొల్పారు. అంతకు ముందు విప్లవవీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో కలిగిన పరిచయం అజాద్ జీవితంలో పెద్ద మలుపు. `ఆర్మీ`స్థాపనకు కూడా ఆయనే ప్రేరణే. ఆంగ్లేయులను పారదోలేందుకు తిరుగుబాటే శరణ్యమని భావించారు. ఉద్యమ నిర్వహణకు అర్థబలం అవసరం గుర్తించిన బిస్మిల్ సహా రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, యస్ఫతుల్లా ఖాన్ తదితర మిత్రులతో కాకోరి రైలు దోపిడీకి పాల్పడ్డారు.ఈ నేరంపై న్యాయస్థానం కొందరికి మరణదండన, మరి కొందరికి జైలు శిక్ష విధించింది. ఆజాద్ మాత్రం తప్పించుకుని, మారువేషాలలో సంచరించాడు. రహస్య జీవనంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న హనుమాన్ ఆలయం ప్రక్కన ఓ కుటీరంలో మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం సాగించిన ప్రతిఘటనల ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. అలా ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మి’ స్థాపించారు. లాహోర్ లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా జరిపిన లాఠీ చార్జీలో పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్‌పై నేలకొరిగారు. దీంతో రగిలపోయిన ఆజాద్ మిత్ర బృందం ఆ తర్వాత కొద్దిరోజులకే (1928 డిసెంబర్ 17న) సాండర్స్ ను హతమార్చారు. ఆ సంఘటనకు సంబంధించి 32 మందిపై నేరారోపణ చేసిన ప్రభుత్వం, విచారణానంతరం అజాద్‌తోసహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది.
Also Read: ` స్త్రీ జాతి శిరోమణి` సరోజినీదేవి
ఆత్మాహుతి:
పార్లమెంట్ పై దాడి కేసులో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు న్యాయస్థానం శిక్ష విధించడంపై కలత చెందిన ఆజాద్ వారిని ఎలాగైనా విడిపించాలనుకున్నారు. అందులో భాగంగా జవహర్ లాల్ నెహ్రూని కలిసి ఆయన సహాయాన్ని అర్థించారు. అటునుంచి స్పందన లేకపోవడంతో 1931 ఫిబ్రవరి 27 ఉదయం అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్కులో భగత్ సింగ్ తదితరులను విడిపించే విషయమై ఇతర విప్లవ మిత్రులతో చర్చలు జరుపుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు మొదలయ్యాయి.ఆజాద్ తన వద్ద గల పిస్తోలుతో ముగ్గురిని మట్టుపెట్టాడు. సమీపిస్తున్నపోలీసులను నిలువరిస్తూనే ఉన్నారు. తన పిస్తోలులోని ఒకే ఒక తూటా మరొకరని నేలకూల్చగలదు. ఆ తర్వాత..వారి చేతిలో తథ్యం. అలా వారికి చిక్కి చనిపోవడం కంటే ఆత్మాహుతి మిన్నగా భావించి కాల్చుకున్నారు.` చావు నా చేతుల్లోనే ఉంది. ఈ ఆజాద్ శత్రువుల తూటాలకు భయపడడు`అని నినదించారు. ఆ తర్వాత సరిగ్గా 25 రోజులకు భగత్ సింగ్ ను ఉరి తీశారు.
(ఈ నెల 27న చంద్రశేఖర ఆజాద్ వర్ధంతి)
Also Read: విద్యాపిపాసి `కట్టమంచి`