Tuesday, January 28, 2025

ఎన్నికల్లో విజయం కోసం బహుకృతవేషం

  • పంజాబ్ లో రిస్కు తీసుకున్నకాంగ్రెస్
  • విజయకాంక్షతో దళిత ముఖ్యమంత్రి నియామకం
  • ఎన్నికల ఆట మొదలుపెట్టిన అన్ని పార్టీలు

ఎన్నికల వేళ గెలుపుగుర్రం ఎక్కడం కోసం ఒక్కొక్కరూ ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారో, వేస్తారో.. పంజాబ్ సంఘటనతో మరోమారు రుజువైంది.అవును మరి! మరికొన్ని నెలల్లోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోయే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత కీలకం. అందరూ ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంలో ఒకటనిపిస్తోంది… ఇందిరాగాంధీ నాటి ‘కాంగ్రెస్ స్కూల్’ ను ఇప్పటి ‘మోదీ బిజెపి’ పాటిస్తోందని, నేటి ‘మోదీ మార్కు’ వైనాన్ని కాంగ్రెస్ అనుకరిస్తోందని. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వరుసగా ముఖ్యమంత్రులను మార్చడం, ఎవరిని ఆ పదవిలో కూర్చోపెడతారో చివరి వరకూ తెలియకుండా నాటకమాడడం ఇందిరాగాంధీ ఏలుబడిలోని కాంగ్రెస్ సంస్కృతిని గుర్తుచేస్తున్నాయి. ప్రభావశీలురు కాకుండా అనామక నాయకులను అందలమెక్కించడం, నోరూవాయీ ఉన్నవాళ్ళ నోరునొక్కేసి మూలన కూర్చోపెట్టడం మొదలైనవి ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న దృశ్యాలు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎంపిక దానికి అక్షరాలా అద్దం పడుతుంది. “నన్ను సీఎంగా ఎంచుకుంటారని తెలియదు, తెలిస్తే.. కనీసం చొక్కాయైనా మార్చుకునేవాడిని” అని సన్నిహితులతో భూపేంద్ర అన్నమాటలు చాలు. అమరీందర్ సింగ్ ను దించేయడం కాంగ్రెస్ కు మొట్టమొదటి కర్తవ్యం. దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన స్థానంలో ఎవరిని ఎంపికచేయాలో కూడా అధిష్టానానికి ఒక స్కీమ్ ఉండే ఉంటుంది. దానిని యథాతధంగా పాటించారు. ఈలోపు ఎన్నోపేర్లు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఊహాగానాలు ఊపందుకున్నాయి. చివరకు అనూహ్యంగా పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్ని సింహాసనంపైకి వచ్చేశారు. గుజరాత్ లో భూపేంద్రకు వలె,ఈయనకు కూడా ముఖ్యమంత్రి అవుతానన్న విషయం బహుశా తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసివుంటే అందులో సిద్ధూ హస్తం ఉండి తీరాలి. రేపటి ఎన్నికల్లో గెలవాలంటే సిద్ధూ చెప్పినట్లు చేయాలని సోనియాగాంధీ కుటుంబం ఒకమాట ఆనుకొని ఉంటుంది. ఎన్నికలకు ఇక అయుదు నెలల సమయం మాత్రమే ఉంది. ఇలా తుదిసంధ్యలో అధికారమార్పిడి చేయడం దుస్సాహసమే. దశబ్దాలపాటు కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న అగ్రనేత అమరీందర్ ను అభాసుపాలు చేయడం మరీ దుస్సాహసం. సాహసమని లోకం అనుకుంటోంది,గొప్ప వ్యూహమని కాంగ్రెస్ భావిస్తోంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేశామనే గొప్ప సంకేతాన్నీ ఇవ్వాలనుకుంటోంది. ఈ సందేశం తప్ప పంజాబ్ లో ఈ నాలుగురోజుల్లో జరిగే అద్భుతాలు ఏమీ ఉండవని ఎక్కువమంది భావన.

Also read: అమరేంద్రుడి నిష్క్రమణ

ఓటు బ్యాంకు రాజకీయం ఎన్నికలలో అంతర్భాగం

ఎన్నికల్లో కులం, ధనం పాత్రలు విడదీయలేనివని ఓటుబ్యాంక్ రాజకీయాలు కొన్ని దశాబ్దాల నుంచి చెబుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ కాలం నుంచి వాటి పాత్ర పెరుగుతూ వచ్చింది. ఓట్లు ఎవరికి ఎక్కువ ఉంటే? ఆ సామాజిక వర్గాలను ఆకర్షించాలన్నదే మంత్రరహస్యం. కానీ ఎక్కువ చోట్ల, అధికారం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నదన్నదీ బహిరంగ రహస్యం. మెజారిటీ వర్గమైన హిందూవుల ప్రభావం విస్మరించరాదని అనుకున్నప్పుడు జంద్యాలు చూపించడం, స్తోత్రాలు ఫఠిoచడం, దేవాలయాలు దర్శించడం, పీఠాధిపతులను దర్శనం చేసుకోవడం అన్ని రాజకీయ పార్టీలకు క్రీడగా మారిపోయింది. దిల్లీలో కేజ్రీవాల్ హనుమాన్ ఛాలీసా పఠనం, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ చండీ పారాయణం, తమిళనాడులో స్టాలిన్ కుటుంబ దేవాలయాల దర్శనం, రాహుల్ గాంధీ జంద్యాల ప్రదర్శన మొదలైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇక  ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్త్రధారణా విన్యాసం జగమెరిగిందే. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై,గుజరాత్ లో పాటీదార్ సమాజానికి చెందిన భూపేంద్ర పటేల్ ఎంపిక విధానంలో కులం పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. పంజాబ్ లో దళిత ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం అభినందనీయమే. ఇన్నేళ్లకు, ఇన్నాళ్లకు ఆ రాష్ట్రంలో అధికారపీఠం అప్పగించడం హర్షదాయకమే. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ విజయం సాధిస్తే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చరణ్ జీత్ సింగ్ ను కొనసాగిస్తారా అన్నది ప్రశ్న. పంజాబ్ ను తన హస్తగతం చేసుకోవాలనే కోరికతో ఊగిపోతున్న నవ్ జోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తాడా అన్నది వేయిడాలర్ల ప్రశ్న. ముప్పై శాతంకు పైగా ఉన్న దళితులను ఆకర్షించడం కోసమే చరణ్ జీత్ సింగ్ ఎంపిక జరిగిందని దళితులు సైతం భావిస్తున్నారు. పంజాబ్ లో 2017ఎన్నికల్లో సుమారు 41శాతం మంది ఆ పార్టీకి ఓటువేశారని నివేదికలు చెబుతున్నాయి. ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ప్రస్తుతం ఉన్న బలానికి ఈ నిర్ణయం ఊతమిస్తుందన్నది ఆ పార్టీ విశ్వాసం. దళిత వర్గాలకు అంకితమని చెప్పుకొనే బహుజన సమాజ్, అకాలీదళ్ ఏకమై సాగనున్నాయి. ఈ ప్రభావం దళితుల ఓట్లల్లో కొంత చీలిక తేవచ్చు. కేజ్రీవాల్ పంజాబ్ పై పూర్తిగా కన్నేశారు. అక్కడ అప్ అధికారంలోకి రావాలన్నది అతని సుదీర్ఘ ఆకాంక్ష. ఓటింగ్ శాతం కాస్త తక్కువగా ఉన్నా, సీట్ల ప్రకారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్ రెండో స్థానంలో ఉంది.

Also read: యూపీలో ప్రియాంక మహాప్రయత్నం

అతి దుర్బలం కమలదళం

అన్నింటికంటే అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ బిజెపి. ఒకవేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ బిజెపిలోకి చేరితే, పార్టీ బలం కొంత పెరిగే అవకాశం ఉంది. సిక్కులు ఎక్కువగా ఉండే రాష్ట్రం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. దాదాపు 60 శాతం వారే ఉన్నారు. మొత్తం జనాభాలో 25శాతం, సిక్కులలో 60శాతంమంది జాట్ లు ఉన్నారు. జాట్ లు, దళితులు కలిసి తమ పార్టీని గెలిపిస్తారనే విశ్వాసంలో కాంగ్రెస్ ఉంది. ఇటు సిద్ధూ ద్వారా -అటు చరణ్ జీత్ సింగ్ ద్వారా ఈ కార్యాన్ని సాధించాలని కాంగ్రెస్ వ్యూహంగా అర్ధమవుతోంది. గతంలో ఎన్నికలు ఎలా ఉన్నా, ఈసారి కులాల కురుక్షేత్రం పెరిగేలా ఉంది. ఇందరి మధ్య పంజాబ్ రాజకీయ క్షేత్రం కుక్కలు చింపిన విస్తరిలా మారే అవకాశముంది. ఈ పీకులాటలో పెద్దముక్క ఎవరికి అందితే  వారు అధికారం వెలగబెడతారు. అణగారిన వర్గాల పట్ల, పేదల పట్ల, బలహీనమైన సమాజాల పట్ల నిజమైన ప్రేమతో వ్యవహారిస్తే మంచిదే. కేవలం ఎన్నికల కోసం వేషాలు వేస్తే,ఎప్పుడో ఒకప్పుడు చొక్కా చినిగిపోతోంది. భారతదేశ ఆర్ధిక,రాజకీయ చిత్రపటం మునుపటి వలె లేదు. చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ఓడలు బండ్లు అయ్యాయి, కొన్ని బండ్లు ఓడలు అయ్యాయి. రాజకీయ అధికారం కోసం కొత్త పోరాటాలు ఆరంభమయ్యే కాలం ఎంతో దూరంలో లేదు.  సంక్షేమంలో,అభివృద్ధిలో, అవకాశాల్లో, పరిపాలనలో, అధికార వికేంద్రీకరణలో సామాజిక సమతుల్యత పాటించకుండా వేసే ఎన్నికల వేషాలకు కాలమే బుద్ధి చెబుతుంది.

Also read: గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles