- మోదీ కాశీ కసరత్తును పూర్వపక్షం చేసిన అజయ్ మిశ్రా దుష్ప్రవర్తన
- మీడియా ప్రతినిధులను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలది
- రైతులతో, మీడియాతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని మంత్రిమండలిలో కొనసాగిస్తారా?
కొంతమంది నేతల తలబిరుసుతనం, నోటి దుందుడుకుతనం, దురహంకారం, పదవులు తెచ్చిన మదాంధకారం ఆ పార్టీలకు, వాటి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలకు తలనొప్పులు తెస్తుంటాయి. అవి ముగియకపోగా, ముదిరిపాకాన పడుతూ కొత్త తలనొప్పులు తెప్పిస్తుంటాయి. దానికి ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న వరుస సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. లఖింపూర్ ఖేరీ మారణహోమం ఆ పార్టీకి, ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు మిగిల్చింది. దళితులు, బడుగువర్గాలపై అత్యాచార దుర్ఘటనల చీకటి ముద్రలు చెరిగిపోకముందే ఈ దుర్ఘటన ప్రభుత్వ పరువును బజారుకీడ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తాజా ప్రవర్తన కలకలం రేపుతోంది. సదరు మంత్రిగారు లఖింపూర్ లో విలేఖరులపై చిందులు తొక్కి, నానా దుర్భాషలాడి, నెట్టేసి, యాగీ చేసిన వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ హల్ చల్ చేస్తోంది. లఖింపూర్ ఖేరీ ఘటనపై మొన్ననే ‘సిట్’ నివేదికను సమర్పించింది. ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటన ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) తేల్చి చెప్పేసింది. పూర్వాపరాలలోని సంచలన విషయాలన్నింటినీ వెల్లడించింది. దీంతో ఈ కేసులో నిందితులపై హత్యాయత్న అభియోగాలు నమోదు చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో మొత్తం 13మంది నిందితులు అరెస్టై జైల్లో ఉన్నారు. వారిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కూడా ఉన్నాడు.
Also read: బాపు స్మరణీయం బహు రమణీయం
ఎనిమిది మరణాలకు కారకుడు కేంద్రమంత్రి తనయుడు
అక్టోబర్ లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న అన్నదాతలపై అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకెళ్ళడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో మరో ముగ్గురు మృతి చెందారు. మొత్తంగా ఈ దుర్ఘటన ఎనిమిదిమంది ప్రాణాలు తీసింది. దీనికి ప్రధాన కారకుడు, ప్రేరకుడు కేంద్ర సహాయ మంత్రిగారి పుత్రరత్నం. ఈ మారణహోమం నేపథ్యంలో అజయ్ మిశ్రాను పదవి నుంచి దించెయ్యండని నినాదాలు వెల్లువెత్తాయి. కానీ, ఆ పని జరుగలేదు. ఆయన మంత్రిగానే కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉండగా, అజయ్ మిశ్రా బుధవారం నాడు లఖింపూర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ ఓ ఆస్పత్రిని సందర్శించి బయటకు వస్తుండగా విలేఖరులు చుట్టుముట్టారు. తాజాగా విడుదలైన ‘సిట్’ నివేదిక గురించి ఆయనను అడిగారు. ఆశిష్ పై అభియోగాల గురించి ప్రశ్నించారు. అంతే.. ఆయన ఉన్న ఉదటున విలేఖరులపై విరుచుకు పడ్డారు. నానా వీరంగం ఆడారు. “మీ మెదడు పని చేయట్లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి. వీళ్ళకు సిగ్గులేదు” అంటూ దుర్భాషలాడారు. మైక్ ఆఫ్ చెయ్యి అంటూ ఒక విలేఖరిని తోసేశారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఇప్పుడు అన్ని మాధ్యమాల వేదికలపైన వైరల్ గా మారింది. నిన్నగాక మొన్ననే కాశీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ‘ ఆవిష్కరించి, జాతికి అంకితం చేసి తమ పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద ప్రచార అస్త్రంగా మలిచారు. ఆ శుభ సందర్భపు పారాణి ఆరకముందే, కేంద్ర సహాయ మంత్రి అదే ఉత్తరప్రదేశ్ లో కొత్త మరకలు అంటించారు. ఉద్యోగధర్మంలో భాగంగా, విలేఖరులు పలు అంశాలపై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. విలేఖరులను నానా దుర్భాషలాడి, అంతటితో ఆగక చెయ్యి చేసుకొని వికృతంగా ప్రవర్తించడం ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది.
Also read: నరేంద్రుని కాశీయాత్ర
ప్రశ్నించడం విలేఖరుల బాధ్యత
తాజాగా విడుదలైన ‘సిట్’ నివేదికపై ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదు. అది బాధ్యత కూడా. పైగా సదరు మంత్రి హోం శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోపణలు ఆయన కుమారుడిపై ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే విలేఖరులు ప్రశ్నించారు. దానికి మంత్రిగారు ఆ తీరున ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మిగిలిన పలు ముఖ్యమైన రాష్ట్రాలతో పాటు కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై వ్యతిరేకత పెరుగుతున్న దశలో ఇటువంటి దుర్ఘటనలు, దుష్ట ప్రవర్తనలు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో గెలుపు, అత్యధిక సీట్లను తెచ్చుకోవడం చాలా కీలకం. ఆ దిశగా ప్రధాని నరేంద్రమోదీ మొదలు అగ్రనేతలంతా తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ తరుణంలో అజయ్ మిశ్రా వంటివారి ప్రవర్తన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ దశలో వ్యతిరేకతలను పెంచుకోవడం ఏ మాత్రం లాభదాయకం కాదు. లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధ్యులైనవారిని శిక్షించాలి. అజయ్ మిశ్రా వంటి నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మేధావులు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. మీడియాపై, మీడియా ప్రతినిధులపై దాడులు జరగకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత.
Also read: దేవిప్రియ అంటే అనేక శిఖరాలు