కె. రామచంద్రమూర్తి
గానగంధర్వుడు, పద్మభూషణుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఈ లోకం వీడి వెళ్ళిపోయారంటే నమ్మబుద్ధి కాలేదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బాలసుబ్రహ్మణ్యం ఒకే సమయంలో కోవిద్ బారిన పడి ఆస్పత్రులలో చేరారు. ప్రణబ్ దా 84 ఏళ్ళవాడు. మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నవాడు. ముందుగా నిష్క్రమించారు. బాలు ఆరోగ్యం కుదుటపడిందనీ, కోలుకుంటున్నారనీ వార్తలు రావడంతో ప్రమాదం లేదు కదా అనుకున్నాం. ప్రణబ్ కంటే పదేళ్ళు చిన్నవాడు కనుక బతికి ఆస్పత్రి నుంచి బయటపడతాడని ఆశించాం. ఇంతలోనే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించి మరణం సంభవిస్తుందని ఊహించలేదు. గురువారం మధ్యాహ్నం నుంచే పరిస్థితి బాగాలేదనే వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయానికి భయపడినంతా జరిగిపోయింది. రెండు, మూడు తరాల తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ, హిందీ, తదితర భాషలవారిని అలరించి తరింపజేసిన గంధర్వగాత్రం శాశ్వతంగామూగబోయింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి
బాలూ అని ప్రేమగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఏకసంతాగ్రాహి, అసాధారణమైన ధారణాశక్తిసంపన్నుడు. అద్భుతమైన స్వరసౌలభ్యం ఆయన సొంతం, ఏ నటుడికి ఎట్లా పాడితే నప్పుతుందో అట్లా పాడగల ప్రావీణ్యం ఆయనది. ఆయన వేల పాటలు అనేక భాషలలో పాడారు. అవన్నీ ఒక ఎత్తు. ఈనాడు రామోజీరావు ప్రోత్సాహంతో మొన్నటి వరకూ చేసిన ‘పాడుతా-తీయగా’ పాటల కార్యక్రమం ఒక ఎత్తు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో తెలుగు లోగిళ్ళలో ఆనందం నింపారు. ఎంతోమంది తెలుగు గాయనీగాయకులను ప్రోత్సహించి వేదికలెక్కించారు. తెలుగు చలనచిత్ర సంగీతానికి ఈ కార్యక్రమం ద్వారా బాలూ చేసిన సేవ అనన్యసామాన్యమైనది. ముంబయ్ లో ‘సరిగమప’ తర్వాత దేశం మొత్తం మీద ఇది రెండో మహాద్భుతమైన సంగీత కార్యక్రమం. బాలుగారు చెప్పినట్టు ఇది భారత చలనచిత్ర సంగీత గ్రంథంలో అపురూపమైన అధ్యాయం. ఈ కార్యక్రమాన్ని వీలైనప్పుడల్లా చూసి ఆనందించేవారిలో నేనూ ఒకడిని. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకుడూ, సంగీత దర్శకుడూ, నటుడూ ఆయనకు పూర్వం పుట్టలేదు. ఆయన తర్వాతా పుట్టరు. అటువంటి అరుదైన వ్యక్తిత్వం ఆయనది. దాదాపు అయిదు దశాబ్దాలపాటు తెలుగుప్రజలను ఉర్రూతలూగించిన సరస్వతీపుత్రుడు, గాత్రవల్లభుడు ఆయన. ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారే చాలా మాంది ఉన్నారు. ఎంతోకొంత పరిచయం ఉన్న నాబోటివారు ఎందరో ఉంటారు. ఆయనను మేము సన్మానించుకున్న సందర్భం మరువలేనిది. ఆ దృశ్యం నా కళ్ళలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. ఆ సాయంత్రం కార్యక్రమం యావత్తూ నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయింది.
బాలూకి హెచ్ఎంటీవీ సన్మానం
హెచ్ఎంటీవీ, ‘హన్స్ ఇండియా’ ప్రధాన సంపాదకుడి హోదాలో, సినిమా పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సహకారంతో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సన్మానం ఏర్పాటు చేశాను. బాలూగారినీ, దాసరిగారినీ మాశర్మగారు వెంటబెట్టుకొని వచ్చారు. అప్పటికే హెచ్ ఎంటీవీలో ‘జైతెలుగు, జైజై తెలుగు’ పతాకం కింద జొన్నవిత్తులవారు అనేక వారాల పాటు వైవిధ్యభరితమైన కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించారు. అశేషమైన అభిమానులను సంపాదించిపెట్టిన ఆ కార్యక్రమానికి ముగింపుగా బాలూగారిని సన్మానించుకోవాలని అనుకున్నాం. ఆయనను సన్మానిస్తే తెలుగుభాషామతల్లికీ, సంగీతసరస్వతికీ సాష్టాంగప్రణామం చేసినట్టేనని అభిప్రాయం.
హైదరాబాద్ లో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో 26 ఏప్రిల్ 2013 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రఖ్యాత దర్శకుడూ, ఉదయం దినపత్రిక వ్యవస్థాపకుడూ దాసరి నారాయణరావు. ముఖ్యఅతిధి అప్పటి అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్. జొన్నవిత్తులవారు నాతో పాటు నిర్వాహకులు. పరుచూరి గోపాలకృష్ణ విశిష్ట అతిధి. దాసరి సమక్షంలో కపిల్ గ్రూప్ చైర్మన్ కాసుగంటి వామనరావు, నేనూ కలిసి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంగారికి సన్మానం చేశాం. హెచ్ ఎం టీవీలో మాతోటి ఉద్యోగి, గాయకురాలు కాంతిశాస్త్రి సభలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
‘వందేళ్ళ కథకు వందనాలు’ శీర్షికాగీతం
హెచ్ఎంటీవీకి సంబంధించిందే మరో జ్ఞాపకం. గొల్లపూడి మారుతీరావుగారు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం హెచ్ఎంటీవీలో ధారావాహికగా సమర్పించారు. ‘వందేళ్ళకథకు వందనాలు’ అనే కార్యక్రమంలో నూటపదహారు కథలనూ, కథకులనూ తెలుగు వీక్షకులకు పరిచయం చేసిన అద్భుతమైన కార్యక్రమం అది. మాశర్మగారి పూనికతో, గొల్లపూడివారి ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యక్రమానికి శీర్షికాగీతం (సిగ్నేచర్ ట్యూన్) కింద ఒక పాటను విశాఖపట్టణానికి చెందిన కవి రాంభట్ల నృసింహశర్మ రాశారు. దాన్ని బాలూగారి చేత పాడించాలని సహచరుడు చక్రధర్ ని చెన్నై పంపించాను. ‘తెలుగు కథకు వందనం’ అంటూ బాలూగారు చక్కగా పాడారు. అది ఇప్పటికీ నా చెవులలో మార్మోగుతోంది. పారితోషికం కింద ముప్పయ్ వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చక్రధర్ చెప్పారు. నేను బాలూగారికి ఫోన్ చేసి బేరమాడాలని అనుకున్నా. తీరా ఫోన్ చేశాక, ఆయన నన్ను మాన్యులు రామచంద్రమూర్తిగారూ అంటూ ప్రేమగా సంబోధించడంతో కరిగిపోయి బేరం సంగతి మరచిపోయి పారితోషికం వెంటనే పంపిస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. అంత మొహమాటం ఆయనతో. దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ తరచు కలుసుకునేవాళ్ళం. ఆయన పలకరింపులో, చూపులో ప్రేమ ఉట్టిపడేది. అవి నాబోటి మిత్రులను కట్టిపడేసేవి. అటువంటి స్నేహశీలి, ప్రతిభాశాలి, సృజనశీలి ఇక లేరంటే నమ్మశక్యం కావడంలేదు. చాలా బాధగా ఉంది. ఆయన పాటలు శాశ్వతంగా ఉంటాయి.
వ్యవసాయక్షేత్రంలో బాలు అంత్యక్రియలు
గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువల్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని ఆయన వ్యవసాయక్షేత్రంలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. శైవమత సంప్రదాయాలను అనుసరించి ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. భార్య సావిత్రి, కుమార్తె పల్లవి, కుమారుడు చరణ్, సోదరి శైలజ, ఇతర బంధువులూ, స్నేహితులూ శుక్రవారం సాయంకాలం నండుంబాక్కంలోని బాలసుబ్రహ్మణ్యం నివాసంలో శ్రద్ధాంజలి ఘటించారు. బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు 72 తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ప్రఖ్యాత నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాస్, రజనీకాంత్, రాజీవ్, సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, ఇళయరాజా, దేవీశ్రీ ప్రసాద్, గాయనీమణులు సుశీల, జానకి, తదితరలు ఆయనకు నివాళులు అర్పించారు.
A very touching and moving account of reminiscences by Sri.k. Ramachandra murthy garu. Thanks for the piece.