- చాలా దేశాల అర్థికం కుదేలు కాబోతోంది
- స్వార్థం చెప్పినట్టు నడుస్తున్న దేశాలు
- ఉక్రెయన్ లోని రెండు తూర్పు రాష్ట్రాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి
ఉక్రెయిన్ – రష్యా మధ్య సాగుతున్న ‘రణం -రుధిరం-రౌద్రం’లో రుణం కూడా కలుపుకోవాల్సి వస్తుంది. కొన్ని దేశాలు అప్పులు పాలవ్వడం, మరికొన్ని దేశాల అప్పులు పెరగడం సంభవించే శకునాలు కనిపిస్తున్నాయి. నేటి పరిణామాలతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఏర్పడినట్టి ఆర్ధిక సంక్షోభం మళ్ళీ ఏర్పడుతోంది. ‘జాతీయత’ అంశంతో పాటు ఆర్ధిక స్వార్ధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
Also read: ఉక్రెయిన్ కార్చిచ్చులో కర్ణాటక యువకుడి బలి
ఆంక్షల ప్రభావం రష్యాపైనే కాదు ఇతర దేశాలపైనా ఉంటుంది
రష్యా అనుకూలురైన వేర్పాటువాదులు 2014లో తూర్పు ఉక్రెయిన్ లోని డొనెత్స్క్,లుహాన్స్క్ లను అదుపులోకి తీసుకున్నారు. బొగ్గు క్షేత్రాలతో ఎంతో సుసంపన్నమైన ప్రాంతం అది. ఈ ఆక్రమణల పర్వం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాదు.18వ శతాబ్దపు జార్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ పైనే మొత్తంగా యుద్ధం ఆరంభమైంది. ప్రస్తుతం రష్యాపై సాగుతున్న ఆంక్షల దుష్ప్రభావం రష్యాకే పరిమితం కాదు. ప్రపంచ ఆర్ధికరంగంపైన కూడా విపరీత పరిణామాలు చూపిస్తాయని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా దుష్ప్రభావాల నుంచి ఇంకా లోకం బయటపడలేదు. ఇప్పుడు యుద్ధం రూపంలో మరో సంక్షోభం పొంచివుంది. కరోనా ప్రభావాలు ద్రవ్యోల్బణం దిశగా వాకిళ్ళు తెరిచాయి. నేటి యుద్ధం సాగుతున్నంతకాలం ప్రతిక్షణం ప్రపంచ దేశాలకు ఆర్ధికంగా నష్టం జరుగుతూనే ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారులు. చమురు,సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో రష్యాదే పైచేయి. ఐరోపా దేశాల గ్యాస్ అవసరాలు తీరడంలో దాదాపు సగం భాగం రష్యాదే. ఈ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో గోధుమ ధరలు 10% పెరిగాయి. మొక్కజొన్న, బార్లీ ఎగుమతుల్లోనూ ఆ దేశం సింహభాగాన్ని ఆక్రమించింది. ‘స్విప్ట్’ నుంచి రష్యాను వెలివేసిన కారణంతో ఆ దేశపు కరెన్సీ ‘రూబుల్’ విలువ గణనీయంగా పడిపోతోంది.
Also read: ఉక్రేన్ కీ, నాటోకీ రష్యా బలప్రదర్శన
పెరగనున్న ద్రవ్యోల్బణం
చమురు, సహజవాయువుల సరఫరాకు విఘాతం కలగడం వల్ల రాబోయే మూడు నెలల కాలంలో ప్రపంచ ద్రవ్యోల్బణం ఒక శాతం వరకూ పెరుగుతుందని ఆర్ధిక ప్రపంచంలో చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల జీడీపీలు కూడా మారిపోనున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల భారత్ కు నష్టం వాటిల్లుతుంది. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే మన దేశ రాజధానిలో 10గ్రాముల మేలిమి బంగారం ధర ఒకేసారి రూ.1200 పెరిగింది. దీనితో 10 గ్రాముల ధర 51,889 రూపాయలకు చేరింది. వెండి కూడా దాదాపు అదే బాటలో ఉంది. మరో వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడంతో ధరల మోత తప్పేట్లు లేదు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నాడు భారీ నష్టాలతో ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలితాన్ని ఇవ్వడం లేదు.ఎవరి పట్టుదలలో వారు ఉన్నారు. ఈ యుద్ధం ప్రభావంతో ధరలు పైకి ఎగబాకడం, కరెన్సీల విలువ కిందకు దిగజారడం తప్పదు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంకా నష్టం. ఆర్ధిక స్వార్ధాలే ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు బాగుపడాలంటే ఆరోగ్యకరమైన ఆర్ధిక ఆలోచనా విధానాలను అలవాటు చేసుకోవడమే శిరోధార్యం.
Also read: ఉక్రెయిన్ పై ‘తగ్గేదే లే’ అంటున్న రష్యా