- ఆహార సంక్షోభ నివారణకు రష్యా, ఉక్రెయిన్ సమ్మతి
- ఇస్తాంబుల్ మధ్యవర్తిత్వంతో శాంతిపర్వం
- ఉక్రెయిన్ ధాన్యం నిల్వలకు విముక్తి
ఉక్రెయిన్ – రష్యా మధ్య సాగిన యుద్ధం ఆ దేశాలను అతలాకుతలం చేయడమే కాక, ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు రూపాల్లో ప్రపంచదేశాలకు తలనొప్పులను తెచ్చిపెట్టింది. కరోనా కల్పిత ఆర్ధిక సంక్షోభం నుంచి తేరుకోక మునుపే ఆహార సంక్షోభానికి వాకిళ్ళు తెరుచుకున్నాయి. ఎరువుల కొరతకు మూలకారణం అయ్యాయి. ఆ రెండు దేశాల మధ్య ఇంకా ఘర్షణ వాతావరణం పూర్తిగా చల్లారలేదు.
Also read: రాజరాజ పట్టాభిషేకం – నన్నయ సహస్రాబ్ది
సందిగ్థంలో భారత్
ఈ ఇరుదేశాల యుద్ధం నడుమ ప్రపంచ దేశాల మధ్య చీలికలు వచ్చాయి. అంతర్జాతీయ వ్యవహారాలలోనూ, ఆర్ధిక, హార్థిక అంశాల్లోనూ భారత్ ఒక సంకట పరిస్థితిని ఎదుర్కొన్నది. అమెరికా ఆజ్ఞలు చేసే సాహసం చేసినా, రష్యాతో ఉన్న చిరకాల మైత్రి, నేటి, రేపటి అవసరాలు, మానవీయ కోణంతో మనం ధైర్యంతో చక్కని రాజనీతిని ప్రదర్శించాం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనవారిని రప్పించుకోవడంలోనూ మనం విజయం సాధించాం. రష్యా – భారత్ మధ్య దూరాన్ని కల్గించడానికి, పెంచి పోషించడానికి చైనా విశ్వప్రయత్నాలు చేసింది.అన్ని పావులు కడిపింది.దానివల్ల రష్యా – భారత్ మధ్య ఇదివరకున్న గాఢమైత్రికి కొన్ని గాట్లు పడ్డాయి. ఉక్రెయిన్ – రష్యా పరిణామాల్లో భారత్ వ్యవహరించిన తీరుకు రష్యా మురిసిపోయింది. ఇరు దేశాల మధ్య బంధాలు మరింతగా పెరిగే దిశగా సుహృద్భావ వాతావరణం ఇటీవల కాలంలో ఏర్పడింది. ఈ తరుణంలో, రష్యాకు దగ్గరవుతున్న నేపథ్యంలో, అమెరికా – భారత్ మధ్య దూరం పెరుగుతుందేమో అనే అనుమానాలు కూడా రేగాయి. వాటిని అధిగమిస్తూ మనం ముందుకు కదులుతున్నాం. అంతర్జాతీయ యవనికపై భారత్ జెండా విభిన్న సంరంభాల్లో తలఎత్తుకొని ఎగురుతూనే ఉంది.
Also read: దాశరథి – కవితా పయోనిథి
హాహాకారాల మధ్య సహకారం
ఉక్రెయిన్ -రష్యా భీకర యుద్ధమేఘాల ఉధృతి కాస్త తగ్గిన తరుణంలో, ఇటీవల కాలంలో ఏర్పడిన ఆహారసంక్షోభానికి పరిష్కారం దిశగా తాజాగా కీలకమైన అడుగులు పడ్డాయి. ఆహార ధాన్యాలు,ఎరుపుల ఎగుమతుల విషయంలో ఆ యా దేశాల మధ్య మొన్న గురువారం నాడు ఒక ఒప్పందం కుదిరింది. రష్యా, ఉక్రెయిన్, తుర్కీ (టర్కీ-తుర్కియే) రాజధాని ఇస్తాంబుల్ లో ఐక్యరాజ్యసమితితో వేర్వేరుగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీనివల్ల నల్ల సముద్రం ( బ్లాక్ సీ ) మీదుగా ఉక్రెయిన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ కు ఆహార ధాన్యాలు, రష్యా నుంచి ఎరువులు, ధాన్యం ఎగుమతుల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. నిన్నటి దాకా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకుంది. ఇకనుంచి ఉక్రెయిన్ లో నల్ల సముద్రం వెంబడి ఉన్న ఒడెస్సా, చెర్నోమోర్క్స్, యుజ్నీ నౌకాశ్రాయాల నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీనితో ఉక్రెయిన్ లో నిర్బంధంలో ఉన్న మిలియన్ల టన్నుల ధాన్యానికి విముక్తి లభించినట్లే. దీనిని “ఆహార సంక్షోభాన్ని గట్టెక్కించే ఆశాదీపం”గా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ అభివర్ణిస్తున్నారు. దీని వల్ల ప్రపంచానికి ఆహార విపత్తు నుంచి ఉపశమనం లభించనుందనే ఆశాభావాన్ని పలు దేశనాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇస్తాంబుల్ కేంద్రంగా ఎగుమతుల పర్యవేక్షణకు ‘ఉమ్మడి సమన్వయ కమిటీ’ని ఏర్పాటుచేయనున్నారు. రష్యా, ఉక్రెయిన్, తుర్కీ తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఈ కమిటీలో భాగస్వామ్యులుగా ఉండనున్నారు. ఆయుధాల వంటివి సరఫరా కాకుండా సురక్షిత రవాణా నిబంధనలు పాటించాల్సి ఉంది. గతం గతః. ఏది ఏమైనా ఇది మంచిపరిణామం.
Also read: ద్రౌపది ముర్ము, మేడమ్ ప్రెసిడెంట్