- ఫ్రాన్స్,జర్మనీ అధినేతల ప్రయత్నం
- బైడెన్ తో సమావేశం జాన్తానై అంటున్న పుతిన్
- ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపైనే ప్రదాన వివాదం
- ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా పట్టు
ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని రష్యా గర్జిస్తూ ఉంటే… అమెరికా గాండ్రిస్తోంది. శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే రష్యా తన పని తాను చేసుకుపోతోంది. ఆర్ధికంగా కాస్త కుదుటబడిన రష్యా వెనకాల చైనా మద్దతు కూడా ఉండడంతో రష్యా “తగ్గేదే లే” అంటోంది. జో బైడెన్ -పుతిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నా, రష్యా అధినేత ఆ మాటలు కొట్టి పారేస్తున్నారు. రెండు దేశాల మధ్య సయోధ్యకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది. అలాగే, ఉక్రెయిన్ -రష్యా మధ్య శాంతి చర్చలకు జర్మనీ కూడా మంతనాలు జరిపింది.
Also read: మరో వైరస్ ప్రమాదం: బిల్ గేట్స్
దీని వెనకాల కూడా అమెరికా ఉన్నదన్న విషయం బహిరంగ రహస్యమే. రష్యా – ఉక్రెయిన్ వివాదాలకు తోడు చైనా – అమెరికా దేశాల ఆధిపత్య పోరు ఎట్లాగూ ఉంది. దురాక్రమణ స్వభావం కలిగిన దేశాధినేతలందరిదీ ఒకటే తీరు. ఈ తీరుపై సభ్య సమాజాల వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది.
Also read: ముంబయ్ లో మరో ప్రత్యామ్నాయ ప్రయత్నం
బలవంతుడిదే రాజ్యమా?
“మైట్ ఈజ్ రైట్” అనేదే వీరి సిద్ధాంతం.” ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అని చెప్పిన మహాకవి శ్రీశ్రీ మాటలు నిత్య సత్యాలు. తూర్పు ఉక్రెయిన్ లోని రెండు రిపబ్లిక్ లు వేర్పాటువాదుల అధీనంలో ఉన్నాయి. వీటిని తమవిగానే రష్యా ప్రకటన కూడా చేసింది. అక్కడ జరుగుతున్న హింస, విధ్వంసాలపై తప్పులను ఉక్రెయిన్ -రష్యా ఒకదానిపై ఒకటి నెట్టుకుంటున్నా, అసలు నిజాలను ప్రపంచం గుర్తిస్తూనే ఉంది. కోరుకుంటున్నవన్నీ జరిగే దాకా రష్యా అధినేత పుతిన్ వెనక్కుతగ్గేట్టు లేరు. నాటో విధానాన్ని ఆయన తప్పుపడుతూనే ఉన్నారు. ఉక్రెయిన్ కు నాటోలో ప్రవేశం కల్పించరాదన్నది ఆయన నుంచి వినపడుతున్న మొదటి డిమాండ్. తూర్పు యూరప్ దేశాలు బలగాలను, ఆయుధాలను ఉపసంహరించుకోవాలన్నది రెండోది. నాటోలోకి చేరకపోతే తనకు జరగబోయే నష్టాల పట్ల ఉక్రెయిన్ కు ఎన్నో భయాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ శాంతినే కోరుకుంటున్నాయి.
Also read: దక్షిణాది నదుల అనుసంధానంపై చర్చ
ఉక్రెయన్ ప్రతిఘటన
రష్యా సరిహద్దు దేశాలన్నింటినీ నాటో లో చేర్చుకోవడం ద్వారా రష్యాను అణగదొక్కాలనే కుట్రలో అమెరికా ఉందని పుతిన్ అంటూనే ఉన్నారు. వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తూ రష్యా నిర్ణయం తీసుకోవడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా పరిగణిస్తోంది. దూకుడు ఇలాగే కొనసాగితే రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకోవడానికి కూడా వెనుకాడమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు కూడా. పుతిన్ వలె ఈయన కూడా ‘తగ్గేదే లే’ అంటున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు క్షణం క్షణం పెరిగిపోతున్న నేపథ్యంలో, ‘ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి’ అత్యవసరంగా సమావేశమైంది. రష్యా తీరును ఎక్కువ దేశాలు తప్పు పడుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి పాదుకొల్పడం అంతర్జాతీయ సమాజాల బృహత్ బాధ్యత. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు తక్షణం జరగాలని ఆకాంక్షిద్దాం. యుద్ధాలకు ముగింపు పలుకుతాయని ఆశిద్దాం. గత ప్రపంచ యుద్ధాల నుంచి, నేటి కరోనా వైరస్ కల్పించిన విషాదం నుంచైనా దేశాధినేతలు బుధ్ధి తెచ్చుకోవాలి.
Also read: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు