ప్రఖ్యాత, వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీ కోలుకుంటున్నారు. వెంటిలేటర్ తీసివేశారనీ, మాట్లాడుతున్నారనీ ఆయన ఏజెంటు ఆండ్రూ వైలై ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. అంతలోనే ఆయన ట్వీట్ ను తొలగించారు. సహరచయిత ఆటిష్ తెసీర్ కూడా రష్టీ మాట్లాడుతున్నారని ధ్రువీకరించారు.
సల్మాన్ రష్టీ (75)పైన న్యూయార్క్ సమీపంలో జరిగిన ఒక సాహిత్య సభలో ఆగంతుకుడు దాడి చేసిన విషయం, కత్తితో పొడిచిన విషయం విదితమే. ఆ దాడిలో మెడమీద, ఒక చేతి నరాలమీద, కాలేయం పైనా దెబ్బలు పడినట్టు తెలిసింది. ఫలితంగా ఒక కన్ను కోల్పోవలసి రావచ్చుననీ, చేతి నరాలు తెగిపోయాయనీ తెలుస్తోంది. ‘ద శటానిక్ వర్సెస్’ అనే గ్రంధాన్ని 1988లో ప్రచురించినప్పటి నుంచీ దానిమీద వివాదం చెలరేగుతున్నది. ఆ గ్రంధాన్ని ఇరాన్ లో, ఇండియాలో, మరికొన్ని దేశాలలో బహిష్కరించారు. ఆ పుస్తకం మహమ్మద్ ప్రవక్తపైన నిందారోపణలు చేసిందనీ, అందుకని అది పఠనీయం కాదనీ ఇస్లాం మతపెద్దలు తీర్మానించారు. ఇటువంటి అపచారానికి పాల్పడిన రష్డీని హత్య చేయవలసిందిగా ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా రుహల్లా ఖొమైనీ ‘ఫట్వా’ (ఆదేశం) జారీ చేశారు. ఫట్వా జారీ చేసిన మరుసటి సంవత్సరమే, 1989లో, ఖొమైనీ కన్నుమూశారు. ఈ ఫట్వాను పట్టించుకోబోమంటూ ఇరాన్ ప్రభుత్వం 1998లో ప్రకటించింది. అంతవరకూ లండన్ లో బిక్కుబిక్కు మంటూ రహస్య జీవితం గడుపుతున్న రష్టీ నిర్భయంగా బయటికి వచ్చారు. ఆ తర్వాత పద్మను పెళ్ళి చేసుకున్నారు. అనంతరం వారు విడిపోయారు. అమెరికాలో రెండు దశాబ్దాలుగా ఉంటున్నారు.
హత్యాప్రయత్నం చేసిన హడీ మటార్ అనే 24 ఏళ్ళ యువకుడిని శనివారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. తాను ఏ నేరమూ చేయలేదని అతని తరఫు న్యాయవాదిద్వారా అతడు ప్రకటించాడు. అతడిపైన దాడి, హత్యాప్రయత్నం ఆరోపణలు నమోదు చేశారు. బెయిల్ లేకుండా కస్టడీలో ఉంచాలని డిస్ట్రిక్ట్ అటార్నీ జాసన్ స్కిమిట్ ఆదేశించారు. నకిలీ గుర్తింపుకార్డుతో సాహిత్య సదస్సు జరుగుతున్న చౌటాకా ప్రాంగణంలో ప్రవేశించాడని కూడా హడీ మటార్ పైన ఆరోపణ ఉన్నది.