Tuesday, January 21, 2025

లంక తర్వాత పాకిస్తాన్ వంతు!

ఫొటో రైటప్: పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా

  • పాలకులు అవినీతిని ఒడిగడుతున్నారు
  • పౌరులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు

కంచే చేను మేస్తే… అన్న సామెతకు అక్షరాలా అద్దం పట్టేలా ఉన్నాయి కొన్ని దేశాల అధినేతల, అధికారుల తీరుతెన్నులు. కొందరు క్రమశిక్షణా రాహిత్యం చేత, మరికొందరు అమితమైన అవినీతి చేత దేశాలను భ్రష్టు పట్టిస్తున్నారు. వారిపై ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తోంది. వారిని అధికార పీఠాల నుంచి దించేసి కొత్తవారిని కొలువుపీఠంపై కూర్చోబెడుతున్న సంఘటనలు మనకు కొన్నాళ్ళుగా కనిపిస్తున్నాయి. మొన్న శ్రీలంక, నిన్న బ్రిటన్, నేడు పాకిస్థాన్ ఈ దుష్ట సంప్రదాయాలకు ప్రతిబింబంలా నిలుస్తున్నాయి. చెప్పాలంటే ఈ చిట్టా చాలా పెద్దగా ఉంది. అప్పుల ఊబిలోకి దేశాన్ని నెట్టేసిన ఘనత ఆ ఏలినవారికే దక్కుతుంది. తాజాగా పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా ఆ వరుసలోకి వచ్చేశారు.  పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్స్ ఫోకస్ అనే సంస్థ వెలువరించిన పరిశోధనాత్మక కథనంలో సంభ్రమం కలిగించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. గత ఆరేళ్ళ కాలంలోలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కుటుంబ ఆస్తులు అమితంగా పెరిగిపోయాయని సారాంశం. దీనికి సమాంతరంగా ఆ దేశంలో అప్పులు కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని సమాచారం. అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియాలో పాకిస్థాన్ దుస్థితిపై వరుస కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబ ఆస్తుల వివరాలు విస్తు గొలుపుతున్నాయని ఆ కథనం చెబుతోంది. దేశ విదేశాల్లో పేరుకుపోయిన వాటి విలువ అమెరికా కరెన్సీ ప్రకారం సుమారు 56 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also read: సైబర్ మోసాలు సవాలక్ష రకాలు

పాక్ సైన్యాధిపతి బజ్వా అక్రమ సంపాదన

బజ్వా సతీమణి అయేషా అంజద్ 2015లో తన ఆస్తుల విలువ సున్నాగా ప్రకటించారు. 2016లో 220 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. కుమారుడు, కోడలు ఆస్తులు కూడా వరుసగా పెరుగుతూ వచ్చాయి. పాకిస్థాన్ లో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన బజ్వా వెనకాల ఇంత చీకటి చరిత్ర నమోదు కావడం దురదృష్టకరం. మరి కొన్నాళ్లల్లోనే ఆయన పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ తరుణంలో ఇటువంటి కథనాలు ఆ దేశ ప్రతిష్ఠను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ఈ సమాచారం బయటకు పొక్కిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వెబ్ సైట్ ను పాకిస్థాన్ లో బ్లాక్ చేశారని చెబుతున్నారు. చైనా ఎర వేసిన సొమ్ముకు శ్రీలంక అధినాయకులు రాజపక్సా కుటుంబీకులు లొంగిపోయారు. వ్యక్తిగతంగా కోట్లాది రూపాయలు పోగుచేసుకొని, స్వర్గ సుఖాలను చవి చూచి దేశ ప్రజలను నరకంలోకి నెట్టేశారు. ఆ కష్టాలన్నింటినీ దాటుకొని ఆ దేశం బతికి బట్ట కట్టాలంటే ఏళ్ళుపూళ్లు పడుతుంది. కరోనా కష్టాలు, లాక్ డౌన్ నిబంధనల మధ్య దేశం మగ్గిపోతోంటే బ్రిటన్ అధినాయకుడు బోరిస్ జాన్సన్ విందు వినోదాలు చేసుకుంటూ,  తాను చేసింది తప్పనే భావన ఏ కోశానా లేకుండా ప్రవర్తించారు. ఆగ్రహించిన బ్రిటన్ ప్రజలు, తోటి నాయకులు ఆయనను పదవి నుంచి దించి మూలన కూర్చోబెట్టారు. పార్టీగేట్ పేరుతో ఆ అంశం ఆ దేశానికి పెద్దమచ్చ తెచ్చి పెట్టింది. అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన పాలనా కాలంలో విశృంఖలంగా ప్రవర్తించి దేశానికి శత్రువులను పెంచేశాడు. కరోనాను గాలికొదిలేసిన అంశం కూడా తీవ్ర విమర్శలకు గురైంది.

Also read: మాంద్యానికి చేరువలో…

తప్పు చేసినవారు ఎంత పెద్దవారైనా శిక్షపడాలి

దేశ ప్రతిష్ఠ మసకబారటమే కాక ఆర్ధికంగానూ అగ్రరాజ్యమైన అమెరికా దెబ్బతింది. నయా సామ్రాజ్య కాంక్షతో రగిలిపోతున్న చైనా అధిపతి జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ తీరుకు ఆ దేశాల సర్వ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. దేశానికి రక్షణగా నిలిచి ప్రజలను కాపాడుతూ, చైతన్యవంతులను చేస్తూ, ప్రగతి పథంలో నడిపించాల్సిన పెద్దలు ఈ తీరున వ్యవహారిస్తే ప్రపంచం ఏ తీరాలకు చేరుతుంది. కరోనా దుష్ప్రభావాలు, రష్యా -ఉక్రెయిన్ యుధ్ధోన్మాదం, ఆర్ధిక మాంద్యం కలిసి సాగుతున్న ఈ కలివేళ, కరకు ఆకలివేళ ఏలికలు బాధ్యతాయుతంగా మెలగాలి. తప్పు చేసినవారు ఏ స్థాయి వారైనా కఠిన దండనలు చవిచూడాలి. స్వార్ధాలు మరచి పెద్దదేశాలు, పేదదేశాలు కలిసి సాగాల్సిన సమయంలో ఉన్నామని గుర్తెరగాలి.

Also read: నిరంకుశుడైన అక్షరయోధుడు ముట్నూరి కృష్ణారావు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles