వోలేటి దివాకర్
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సందడి కనిపించింది. ఉన్నది కొద్ది మంది అయినా కొత్త పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆయన మాటల్లో కూడా ఉత్సాహం… ధీమా ధ్వనించాయి. రాష్ట్రంలో అధికార వైస్సార్సీపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలను ఏకం చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ప్రకటిస్తుండగా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. 2024 కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ గాంధీ ప్రకటనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తిచేస్తామన్నారు.
Also read: సొంత జనంతో ‘మార్నింగ్ షో’
దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 26నాటికి శ్రీనగర్ చేరడంతో తొలిదఫా యాత్ర ముగుస్తుందని ఆయన చెప్పారు. యాత్ర స్పూర్తితో అన్ని రాష్ట్రాల్లో జనవరి 26నుంచి మార్చి 26 వరకు క్షేత్రస్థాయిలో ప్రజాపోరాట యాత్రల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలు సాగిస్తామని ఆయన వివరించారు.
ఉండవల్లి… లగడపాటి కాంగ్రెస్ లో చేరతారా?
ఉదయపూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా 50-55సంవత్సరాల లోపు వారికి పార్టీ లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంస్థాగతంగా పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ హర్షకుమార్ అలక…ప్రచార కమిటీ అధ్యక్షుడి పదవికి రాజీనామాపై స్పందించారు. ‘నాకు నేనుగా అధ్యక్షుడిగా నియమించుకోలేదని’ పార్టీ అధిష్టానం తనను నియమించిందని గిడుగు తెలిపారు. హర్ష రాజీనామా అంశం అధిష్టానం పరిధిలో ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వారు చేరే అవకాశాలు లేవు.
Also read: ముస్లింలకు అవసరం లేని తీర్మానం కాపులకు ఎందుకు?
మోడీ ముందు మెడలు వంచిన జగన్
రాష్ట్ర విభజన అన్ని పార్టీల లేఖలు ఇచ్చిన తర్వాతే జరిగిందని రుద్రరాజు చెబుతూ, విభజన చట్టంలో ఏపీకి ఒక లక్షా 50వేల కోట్ల రూపాయల ప్రయోజనం లభించేలా కాంగ్రెస్ చట్టంలో పొందు పరిచిందని అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దీన్ని అమలు చేయడం లేదని అన్నారు. ఐదేళ్లు పాలించిన టిడిపి, ఇప్పుడు పాలిస్తున్న వైసిపి కూడా విభజన అంశాల అమలు విషయంలో దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నాయన్నారు.
Also read: తెలుగుదేశంలో మరో తిరుగుబాటు…. పర్యవసానం ఇదే!
రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంకోసం కృషి చేయకుండా కాలయాపన చేయడం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఒక్కరే ఢిల్లీ వెళ్లడం కాకుండా అన్ని పక్షాల ప్రతినిధులను తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేసారు. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్రం ముందు మెడ వంచి, మోడీకి, అమిత్ షాకు నమస్కారం చేసి వస్తున్నారని రుద్రరాజు అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరం కూడా పూర్తిచేయలేకపోయారని ఆయన విమర్శించారు. ఈ దేశంలో కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, మన రాష్ట్రం వరకూ చూసుకుంటే నాగార్జున సాగర్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, వివిధ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందని రుద్రరాజు గుర్తుచేశారు.
Also read: ఏడుపు ఎంతో గొప్ప….