- ప్రధాన పాత్రధారులందరూ తెలుగువారే కావడం విశేషం
- తెలుగు సినిమాలో నటించే అవకాశం బాలీవుడ్ తారలకు
- దేశభక్తిని రక్తగతం చేసిన రసాత్మకచిత్రం
తెలుగు పౌరుషాన్నీ, తెలుగు తేజాన్నీ, ఖ్యాతినీ ప్రపంచపటంలో రెపరెపలాడిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ కీర్తి కిరీటాన్ని రూపొందించింది రాజమౌళి బృందం. ఇంత డబ్బు, అంత పేరును తేవడంలో ఘన విజయం సాధించిన ఈ బృందాన్ని మనసారా అభినందించి తీరాల్సిందే. దేశభక్తి-మైత్రీబంధం పెనవేసుకొని సాగిన కథ-కథనం.. నిప్పు,నీరుగా నిలిచాయి. దృశ్యకావ్యమై, కోట్లాది హృదయాలను కొల్లగొట్టాయి. ఐదు భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలాది తెరలపై రెపరెపలాడింది. కథకుడు, దర్శకుడు, నిర్మాత, కథానాయకులు, సంగీత దర్శకుడు మొదలైన ప్రధాన భూమికలన్నింటిలోనూ తెలుగువారే ప్రధానంగా ఉండడం తెలుగువారందరికీ మిక్కిలి ఆనందకరం.
Also read: ఆదిత్యనాథ్ యోగిమహరాజ్ దిగ్విజయం
అక్షరతూనీరమైన ఆంధ్రపౌరుషం
కథకు మూలాధారమైన పాత్రలు కొమరం భీమ్,అల్లూరి సీతారామరాజు. వీరిద్దరూ తెలుగువారే. ‘ఆంధ్రపౌరుషం’ ఆయుధరూపం ఎత్తినట్లుగా ఈ యోధులు ఉంటారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపంలో ఈ తెలుగు దేశభక్తులు దేశానికి, ప్రపంచానికి మరోమారు అత్యంత బలంగా పరిచయమయ్యారు. అటు పాత్రల పరంగానూ – ఇటు పాత్రపోషణా పరంగానూ తెలుగు కథానాయకులనే ఎంచుకొని సినిమా రూపొందించడం ద్వారా, ‘తెలుగుఖ్యాతి’ మిన్ను ముట్టింది. ఒక హాలీవుడ్ సినిమాలో భారతీయ నటుడికి ఒక చిన్న పాత్ర లభించినా, అందుకు మనమెంతో ఆనందిస్తాం. ఇక్కడ దృశ్యం ( సీన్ ) తిరగబడింది (రివర్స్). తెలుగువాడి సినిమాలో, భారతీయ యవనికపై హాలీవుడ్ నటులకు అవకాశం వచ్చింది. వారు కొన్ని ముఖ్య పాత్రలను పోషించినా,ప్రథాన కథానాయకులు తెలుగువారే కావడం ఇక్కడ విశేషం. ‘బాహుబలి’ చిత్రంతో బౌండరీలు బద్దలు కొట్టిన రాజమౌళి,ఇప్పుడు ఖండాలను దాటి పైకి ఎగిరాడు. ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు తెలుగువారే కావడం తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం. ఈ సినిమా ద్వారా అందులో భాగస్వాములైనవారందరికీ పేరు,డబ్బు రెండూ వచ్చాయి. ఆ సంగతి అట్లా ఉంచుదాం. ఈ సినిమా దేశానికి ఏమిచ్చింది? ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛాఫలాలు ఎందరో సమరయోధుల త్యాగఫలాలు. ధన,మాన,ప్రాణాలను,జీవిత సర్వస్వాన్ని పుడమితల్లికి అంకితం చేసిన ఇద్దరు మహనీయులను ఈరోజు మళ్ళీ మనం గుర్తుచేసుకొనేలా చేసింది ఈ సినిమా. దేశభక్తి నుంచి దేహభక్తిలోకి ప్రయాణం సాగిస్తున్న ఈ తరాలకు మట్టివాసనను మరోమారు రుచి చూపించింది. నాకేంటి? అనుకుంటూ జీవించే స్వార్ధపరులకు,అవసరార్ధం కల్పించుకొనే పరిచయాలకు స్నేహమనే అందమైన పేరు పెట్టుకుంటున్న నకిలీలకు ‘మైత్రీబంధం’ అంటే ఎలా ఉంటుందో చూపించి, వారి నడ్డి విరిచింది.ద్వేషానికి భాషలేనట్లే.. ప్రేమతత్త్వానికి ఎల్లలు లేవని ‘జెన్నీ’ పాత్ర ద్వారా చూపించింది.
Also read: విశాఖ ఉక్కు కర్మాగారం దక్కేనా?
సమస్త కళలను అత్యంత రసాత్మకంగా…
సాహిత్యం,సంగీతం, నృత్యం, నటనం, చిత్రలేఖనం మొదలైన లలితకళలను ఎంతటి రసాత్మకంగా చూపించవచ్చునో ఈ సినిమా తెలిపింది. పసిడికి తావి అబ్బినట్లు,సారస్వతానికి అద్భుతమైన సాంకేతికత జత కలిస్తే ఎలా ఉంటుందో నిరూపించింది.అడుగడుగునా పాటలు, మాటలు తూటాలై పేలి, తెలుగుపదం విలువను కదం తొక్కించాయి. ఈ సినిమాలోని ఒక్కొక్క పాట గురించి, ఒక్కొక్క మాట గురించి ఒక్కొక్క ప్రత్యేక వ్యాసమే రాయాల్సి వస్తుంది. పాటలు రాసిన ప్రతికవీ, మాటలు రాసిన రచయిత తమ కలాలను రససముద్రంలో ముంచి,దేశభక్తిలో మునిగి రాశారు. వీటి ద్వారా తెలుగుభాష గొప్పతనం తెరతెరపై ధ్వనించింది. సంగీత నిర్దేశకత్వం,తెరవెనక ధ్వనివిన్యాస ప్రతిభలో మనతనం మార్మోగాయి. యూట్యూబ్ లో వివిధ ట్రైలర్స్, వీడియోస్ చూసిన పరాయిదేశీయులు ఎందరెందరో గొప్పగా స్పందిస్తూ తమ వ్యాఖ్యలను పంచుకున్న వైనమే దానికి అద్దం పడుతుంది. భాష అర్ధం కాకపోయినా,ఆ తీరున ప్రతిధ్వనించడం ఈ సినిమా ద్వారా జాతికి అందిన బహుమానం.
Also read: పద్మపురస్కారం పరవశించిన రోజు!
పొంగిపొరలిన భావోద్వేగం
‘బాహుబలి’ని దాటిందా? ‘బెన్ హర్’ ను మించిపోయిందా అన్నది అప్రస్తుతం. ఈ సినిమాను ఈ సినిమాగానే చూడాలి. ఇందులో అడుగడుగునా, అణువణువునా భావోద్వేగం పొంగి పొరలింది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను స్ఫూర్తిగా మాత్రమే తీసుకొన్నారు. దాని చుట్టూ కల్పన చేసుకుంటూ వెళ్లిపోయి కథను రక్తికట్టించారు. ఈ సినిమాకు కథానాయకులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదలు… ప్రతి పాత్రకు పాత్రోచితమైన న్యాయం జరిగింది.ఎవ్వరూ ఎక్కువ కారు,తక్కువ కారు. సందర్భోచితానికి,ఔచిత్యానికి పట్టంకట్టారు.బడబాగ్నికి – జడివానకు (నిప్పు -నీరు) దోస్తీ బాగా కట్టారు.పోట్లగిత్తలను- పోతురాజులను పోటెత్తినట్లు చూపించారు.ఎర్రజొన్న రొట్టెలో మిరపతొక్కు కలుపుకుంటే ఎట్లా ఉంటుందో రుచి చూపించారు. ‘జననీ ప్రియభారత జననీ’ అంటూ దేశభక్తుల పాదధూళిని దేశప్రజల ఫాలతిలకంగా ప్రకాశమానం చేశారు.జెండా ఎత్తించి జాతిజనులలో నెత్తురు మరిగించారు. పుడమితల్లికి బతుకు భరణమిచ్చిన ‘కొమరం భీముడి’ని ఎగసిన కొడవలి వలె ఎలుగెత్తి చూపించారు. వెరసి,రామం – భీమంలో ‘రణధీరం-రాజసం’ను రసవత్తరంగా రంగరించారు. ‘రౌద్రం-రణం-రుధిరం’ (ఆర్ ఆర్ ఆర్ ) సినిమా ద్వారా తెలుగునేలకు,భారతీయ చలన చిత్ర చరిత్రకు ‘వీరం -విజయం-విఖ్యాతం’ దక్కాయి.
Also read: ఇంటి నుంచి పనికి ఇకపై స్వస్తి?