సిద్ధిపేట జిల్లాలో మానవహక్కుల వేదిక, విద్యావంతులవేదిక, దళిత్ బహుజన ఫ్రంట్ కార్యకర్తల పర్యటన
మార్చి 11, హైదరాబాద్: ఈ రోజు మానవ హక్కుల వేదిక, విద్యావంతుల వేదిక, దలిత్ బహుజన ఫ్రంట్ కార్యకర్తల బృందం, గజ్వేల్ మండలం గ్రామాలలో రీజియనల్ రింగ్ రోడ్ (Regional Ring Road) నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న పేద రైతులను కలిసి విషయ సేకరణ చేయడం జరిగింది.
నివేదిక 10.03.23
రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో, సిద్దిపేట జిల్లాలో భూములు కోల్పోయే గ్రామాలను పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు జిల్లాలో పర్యటించారు. గజ్వేల్ మండల్ లోని లింగారజ్ పల్లీ, వర్గల్ మండల పరిధిలోని లోని జబ్బపూర్ మరియు నింప్టూర్ గ్రామాలను సందర్శించారు.
1. లింగరాజ పల్లీ గ్రామం లో, మల్లాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన భూములు, ఈ రింగ్ రోడ్ వల్ల తిరిగి కొల్పోవబోతున్నారు. ఇళ్లు దొరకని వారికి ఇచ్చిన 134 అభివృద్ధి చెందిన లేఅవుట్ లో ఉన్న ప్లాట్లు కోల్పోతున్నారని తెలుస్తోంది.
2. జబ్బా పూర్ మరియు నింప్తూర్ గ్రామాలలో చెరొక వంద ఎకరాల దాకా కొల్పోవబోతున్నారు. నవంబర్ 23 వ తారీకు న తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రజాభిప్రాయ సేకరణకు నోటీస్ ఇచ్చినప్పటికీ , ఆ విషయం ఏ గ్రామ ప్రజలకి తెలియక పోవడం గమనించదగ్గ విషయం.
నింప్తుర్ గ్రామం లో మోహన్ రెడ్డి అనే రైతు నెల రోజుల క్రితం , ఎటువంటి సమాచారం లేకుండా తన పొలం లో రాళ్ళు పాతడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం లోకల్ మీడియా కవర్ చేసినప్పటికీ ఎక్కువ స్పందన రాలేదు.
నిజ నిర్ధారణకు వెళ్ళిన సభ్యులు ఈ విషయాలను డిమాండ్ చేస్తున్నారు:
1. అవకాశం ఉన్న ప్రతీ చోట ఫారెస్ట్ లాండ్, ప్రభుత్వ భూమిని రింగ్ రోడ్ నిర్మాణానికి వాడుకోవాలి.
2. భూ సేకరణ చట్టం 2013 కచ్చితంగా అమలు పరచాలి.
3. సంవత్సరానికి రెండు పంటలు పండే భూమిని వీలయినంత తక్కువగా సేకరించాలి.
4. గ్రామ ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహించి , ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, హరికృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ శంకర్, మానవ హక్కుల వేదిక నుంచి రోహిత్, సంజీవ్ పాల్గొన్నారు.