వోలెటి దివాకర్
తన తండ్రి, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావును రౌడీ అని ఆరోపణలు చేసే వారని, ఆయన ఎమ్మెల్యే అయ్యారని, తర్వాత గూండా అని ప్రచారం చేసే వారని తర్వాత మంత్రి ఆయ్యారని, ఇప్పుడు తన సోదరుడు, రాజానగరం ఎమ్మెల్యే రాజాపైనా, తన పైనా అదే విధమైన ఆరోపణలు చేస్తున్నారని ఈనేపథ్యంలో చరిత్ర పునరావృత్తం అవుతుందేమో చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము కింది స్థాయి నుండి ఎదిగామనీ, ఎటువంటి దుష్ప్రచారాలకు భయపడే రకం కాదనీ అన్నారు. కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
Also read: ఈ పదేళ్లలో ఎపికి బ్రిటీష్ పాలనలో కన్నా తీవ్ర అన్యాయం!
రూ.700కోట్ల ఆస్తులు రాసిస్తా
తెలుగుదేశం పార్టీకి చెందిన చైతన్య రధం అనే పత్రికలో, వారి ప్రాయోజిత సోషల్ మీడియాలో తనపైనా, తన అన్న, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాలపై తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారని గణేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంత మంది ఫేక్ ఐడిలతో సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని, వారికి దమ్ము ధైర్యం ఉంటే ఒరిజనల్ ఐడిలతో ఇటువంటి ఆరోపణలు చేస్తే క్షేత్రస్థాయిలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. తమకు 60 లారీలు ఉన్నట్లు, రియల్ ఎస్టేట్ సంస్ధ ఉన్నట్లు, అధికారులపైస దాడులు చేస్తున్నట్లు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము రూ.700 కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నామని లెక్కలు చెప్పారనీ, వారే గనుక ముందుకు వచ్చి వారు ఆరోపించిన దానిలో 5 శాతం అంటే రూ.35 కోట్లు ఇస్తే తమ కుటుంబ ఆస్తులన్నీ రాసిచ్చేస్తామనీ అన్నారు. తమపై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తూ 60 లారీలు ఉంటే వాటి నెంబర్లు పెడితే వారికే ఇచ్చేస్తామన్నారు. 12 భవనాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారని, గూగుల్ ద్వారా అవి ఎక్కడున్నాయో నిరూపిస్తే వారికే రాసిచ్చేస్తామన్నారు.
Also read: మహిళా ఎమ్మెల్యేకు రాత్రి 10గంటలకు ఫోన్లు!
మాజీ మంత్రి అనిల్ యాదవ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, బెట్టింగ్ చేస్తానని ఆరోపణలు గుప్పిస్తున్నారనీ, అయితే తాను అనిల్ యాదవ్‌ను టీవీలో చూడటమే తప్ప ఎన్నడూ కలవలేదనీ, ఆయనతో పరిచయం కూడా లేదనీ అన్నారు. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు తాను సిద్ధమన్నారు. రూ.2 కోట్ల కారులో తిరిగే అంత స్తోమత తమకు లేదన్నారు. ఆవ భూముల విషయమై తొలిసారి పెదవి విప్పింది తన అన్న ఎమ్మెల్యే రాజానే అని గుర్తు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, పార్టీనీ, మా ప్రతిష్టనూ తగ్గించాలనే ఉద్దేశంతోనే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు సంబంధించి పనుల నిర్వహణలో అధికారులు ఎవరైనా అలసత్వం వహిస్తే వారిని ఆ పనులు విషయంలో గట్టిగా ప్రశ్నించడం, నిలదీయం జరిగిందే తప్ప తన అన్న రాజా ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. తన తండ్రి ప్రజా నాయకులు దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, తన తల్లి విజయలక్ష్మిలు ప్రజలు కోసం నిరంతరం పనిచేయడం ద్వారా తమకు ప్రజాభిమానం అనే ఎనలేని ఆస్తిని కూడ బెట్టారనీ, దానిని ఎవరూ దూరం చేయలేరన్నారనీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు.
Also read: మా పార్టీలోనూ గ్రూపులున్నాయి:వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి
భరత్ వన్ టైమ్ ఎంపీ
ఆ నాయకుడు వన్‌టైమ్, సింగిల్ మేన్‌గా మిగిలిపోతారన్నారని పేరు ఎత్తకుండా పరోక్షంగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ పై జక్కంపూడి గణేష్ ధ్వజమెత్తారు. ఇటీవల గణేష్ తో బాహాబాహీకి దిగిన ఎంపీ వర్గానికి చెందిన వైసీపీ యువజన విభాగం నాయకుడు పితా రామకృష్ణ రౌడీ షీటర్ అని, నడిరోడ్డులో కత్తులతో తిరిగి ఎస్సీ కార్యకర్తకర్తను గాయపరిచాడని, అటువంటి వ్యక్తితో తాను ఎలా మాట్లాడతానని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధి అతడిని వెనకేసుకు వస్తున్నాడే తప్ప ఇంకెవరూ అతడ్ని వెనకేసుకు రారన్నారు. తామేదో శెట్టిబలిజ సామాజికవర్గానికి వ్యతిరేకమన్నుట్లు చిత్రీకరిస్తున్నారని, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రోత్సాహంతోనే మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయితో పాటు వాసంశెట్టి గంగాధర్ లాంటి ఎంతో మంది ఎదిగారన్నది గుర్తు చేసుకోవాలన్నారు.
6న జక్కంపూడి జయంతి
ఈనెల 6వ తేదీన జననేత, కార్మికనాయకుడు, మాజీ మంత్రి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా స్థానిక కంబాలచెరువు జంక్షన్‌లోని ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద జక్కంపూడి విగ్రహంతో పాటు, ప్రజా నాయకలు వంగవీటి రంగా, స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి మురళి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందనీ, వాతావరణం అనుకూలిస్తే అదే రోజున వాటిని ఆవిష్కరిస్తామనీ అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు, వంగవీటి రంగాలు మంచి మిత్రులని, వారి స్నేహం, కృష్ణా, గోదావరి కలయిక వంటిదని అభివర్ణించారు.
Also read: అందుకే పోలవరం నిధులు ఆపేశారు: పురందేశ్వరి వ్యాఖ్య