- అద్భుతమని ప్రశంసించిన నాసా శాస్త్రవేత్తలు
- భవిష్యత్ లో రాళ్లు, మట్టి భూమికి పంపనున్న రోవర్
అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ పర్సెవరెన్స్ తన పని మొదలు పెట్టింది. 7 నెలల సుధీర్ఘ ప్రయాణం అనంతరం అంగారక గ్రహంపై క్షేమంగా లాండ్ అయింది. దీంతో అంగారక గ్రహంపై తొలిసారి చేపట్టిన టెస్ట్ డ్రైవ్ విజయవంతమయినట్లు నాసా తెలిపింది. దీనికి సంబంధించిన చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ఆరు చక్రాలు కలిగిన రోవర్ పర్సెవరెన్స్ అంగారకుడిపై విజయవంతంగా నడిచింది. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్ల దూరం ప్రయాణించినట్లు నాసా తెలిపింది. నాలుగు మీటర్లు ముందుకు ప్రయాణించి 150 డిగ్రీల ఎడమవైపునకు తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించినట్లు నాసా వెల్లడించింది. ఇందుకు సంబంధించి రోవర్ పంపిన చిత్రాల్లో అది ప్రయాణించిన తీరు ఆయా ప్రదేశాల్లో ట్రాక్ జాడలు స్పష్టంగా కనిపిస్తుండటంతో నాసా శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
‘అంగారకుడిపై రోవర్ ప్రయాణించిన తీరు అద్భుతం. ఈ మిషన్‌లో రోవర్ వ్యవహరించిన తీరు భవిష్యత్ ప్రయోగాలకు కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. త్వరలో రోవర్‌తో కొన్ని దూర ప్రయాణాలు కూడా చేయించనున్నట్లు నాసా తెలిపింది. అంగారకుడి ఉపరితలంపై అది తిరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిఉందని నాసా అధికారులు తెలిపారు. నాసా చేపట్టిన మార్స్ మిషన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదని, ఇప్పటివరకు రోవర్ ప్రయాణం అద్భుతంగానే జరిగిందని పర్సవరెన్స్ డిప్యూటీ మిషన్ మేనేజర్ రాబర్ట్ హాగ్ స్పష్టం చేశారు.
అంగారక గ్రహంపై జీవం పుట్టుక గురించి పరిశోధించేందుక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2020 లో రోవర్ ను పంపింది. ఆరోవర్ ఫిబ్రవరి 18న అంగారకుడిపై విజయవంతంగా లాండ్ అయింది. రాబోయే రోజుల్లో మార్స్ పై ఉండే రాళ్లు, మట్టి నమూనాలను రోవర్ సేకరించి భూమికి పంపనుందని నాసా తెలిపింది.