వోలేటి దివాకర్
రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును వై ఎస్సార్సిపి ప్రభుత్వ చివరి రోజుల్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ(రుడా) చైర్మన్ పదవి వరించింది. వచ్చే ఎన్నికల్లో ఎంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఎంపి సిఫార్సు మేరకు రౌతుకు రుడా చైర్మన్ పదవి లభించింది. ప్రభుత్వ ఉత్తర్వులు రావడం తరువాయి ఆయన వెంటనే పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా చాలా కాలం తరువాత రౌతు తన అనుచరులు, అభిమానులతో స్థానిక పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ కలయిక పేరిట బలప్రదర్శన చేశారు. ఈసందర్భంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఎంపి భరత్, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కోఆర్డినేటర్ లు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్, పార్టీకి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగరంలో కూడా కార్యకర్తల బలం ఉన్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబం, రౌతు చిరకాల ప్రత్యర్థి శ్రీఘాకోళపు శివ రామసుబ్రహ్మణ్యం హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారిని ఈకార్యక్రమానికి ఆహ్వానించలేదా …ఆహ్వానించినా వారు హాజరుకాలేదా అన్నది తేలాల్సి ఉంది.
2019 ఎన్నికల నాటి నుంచి రౌతుకు, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంకు మధ్య వైరం ఉంది. రౌతును ఓడిస్తానంటూ శివరామసుబ్రహ్మణ్యం బహిరంగంగానే ప్రకటించారు. అయితే జక్కంపూడి కుటుంబంతో రౌతుకు సత్సంబంధాలే ఉన్నాయి. భరత్ శిబిరంలోకి వెళ్లక ముందు రౌతు జక్కంపూడి వర్గంతోనే కలిసి తిరిగారు. జక్కంపూడి కుటుంబానికి, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంకు సొంత కేడర్ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రౌతు తద్వారా భరత్ వారిని దూరం చేసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భరత్ గెలుపోటముల పై ఈప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత రౌతుకు ఎమ్మెల్సీ, టిటిడి బోర్డులో సభ్యత్వం, రుడా ఛైర్మన్ వంటి పదవులు లభిస్తాయని ఆశించినా..నిరాశ ఎదురైంది. రుడా చైర్పర్సన్గా మరోసారి ఎం షర్మిలారెడ్డిని నియమించినట్లు వార్తలు రావడంతో రౌతు శిబిరంలో నైరాశ్యం ఏర్పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న భరత్ రౌతు కేడర్, బిసి ఓట్లు తనకు దూరమవుతాయని దూరదృష్టితో ఆలోచించారు.
దీంతో షర్మిలారెడ్డి నియామకాన్ని ఆగమేఘాల మీద నిలిపివేయించి, రౌతుకు చైర్మన్ పదవి దక్కేలా భరత్ చక్రం తిప్పారు. రౌతు అదృష్టం బాగుండి సిటీ నుంచి భరత్ ఎమ్మెల్యేగా గెలిచి, వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే రుడా చైర్మన్ పదవిని పొడిగించే అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఆయనకు ఈపదవి మూడునెలల ముచ్చటగానే నిలుస్తుంది. మరోవైపు ఆత్మీయ కలయిక ద్వారా భరత్, రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు మరోసారి బహిర్గతమైందని విశ్లేషిస్తున్నారు.