Sunday, December 22, 2024

మోదీ, కేసీఆర్ వ్యాఖ్యలకు తీవ్ర ఖండన

  • తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తీర్మానం
  • ఇద్దరి ఆలోచనా ధోరణీ రాజ్యాంగవిరుద్దమే

హైదరాబాద్ : రాజ్యాంగం మార్చాలని కెసిఆర్- తెలంగాణ ఏర్పాటు పై  నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమవారంనాడు  రౌండ్ టేబుల్  సమావేశం . ఈ సమావేశంలో చేసిన తీర్మానాలు ఇవి:

  1. కొత్త రాజ్యంగం రాయలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్  రావు  చేసిన వ్యాఖ్యలను రౌండ్ టేబుల్  సమావేశం  ఖండిస్తున్నది. ఇది  అంబేద్కర్ ను అవమానపరచడమే అవుతుందని రౌండ్ టేబుల్  సమావేశం  అభిప్రాయపడింది.
  • అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయని పాలకులకు కొత్త రాజ్యంగం కావాలని మాట్లాడే నైతిక అర్హత లేదని  రౌండ్ టేబుల్  సమావేశం తీర్మాణించింది.
  • ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటన స్వేచ్చను, పత్రికా స్వేచ్చను గౌరవించని కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలని అనడం అంటే ప్యూడల్ భవజాలంతో కూడిన రాజ్యంగం కావాలని కోరమడమేనని సమావేశం  అభిప్రాయపడింది.
  • భారత రాజ్యంగాన్ని మార్చాలి, కొత్త రాజ్యంగం కావాలి అనే చర్చపెడుతున్న శక్తుల పట్ల సెక్యూలరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, దళితులు, రాజ్యాంగ పరిరక్ష కొసం పోరాడాలని  రౌండ్ టేబుల్  సమావేశం తీర్మానించింది.
  • తెలంగాణపై నరేంద్ర మోడీ విషం చిమ్మడాన్ని రౌండ్ టేబుల్  సమావేశం ఖండించింది. రాజ్యంగబద్దంగా, చట్టబద్దంగా ఉభయ సభలలో జరిగిన రాష్ట్ర విభజన ప్రక్రియను మోడీ తప్పుపట్టడం అంటే రాజ్యాంగాన్ని, చట్టాలను అవమానించడేనని సమావేశం అభిప్రాయపడింది.
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హమీలైన బయ్యారం ఉక్కు  ప్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టు,గిరిజన యూనివర్సీటీ ను తక్షణం ఇవ్వాలని రౌండ్ టేబుల్  డిమాండ్ చేసింది.
  • తెలంగాణ  ప్రజలకు మోడీ క్షమాపణ చేప్పాలని సమావేశం డిమాండ్ చేసింది.

రాజ్యాంగం మార్చాలని కెసిఆర్- తెలంగాణ ఏర్పాటు పై  నరేంద్ర మోడీ  వాఖ్యలను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన  వేదిక సమావేశంలో పాల్గొన్న వక్తలు తీవ్రంగా ఖండించారు. రాజ్యంగం ప్రకారం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్నాన్ని పరిపాలించే వారే ఎధేచ్చగా రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ కొత్త రాజ్యంగం రాయాలని అనడం విస్మయం కల్గిస్తున్నదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యాలు  చేసేవారిని ప్రజలు తీవ్రంగా  వ్యతిరేకిస్తారని  అన్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అసంబద్దమైమైననీ, తక్షణం మోడీ  తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చేప్పాలనీ డింమాండ్ చేశారు.

ఈ సమావేశంలో  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పౌర హక్కుల నేత  ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టులు పీవి శ్రీనివాస్,  యోగానంద్ గౌడ్, జయసారథి రెడ్డి, పీవో డబ్ల్యూ నేత సంధ్య, కాంగ్రెస్ నేత మానవత రాయ్, అధ్యయన వేదిక అధ్యక్షుడు బి. వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాదిక్, ట్రెజరర్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణ రాష్ట్రం దయాదాక్షిణ్యాలతో రాలేదు : విరాహత్

దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాష్ట్ర విభజన జరగలేదని, దాదాపు ముప్పై ఏండ్ల ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలతో ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ అన్నారు. సమైక్యవాద ప్రాంతీయ పార్టీలు మినహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సమ్మతితో దేశంలో అత్యున్నత చట్టసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లుపై ఇటీవల రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అప్రజాస్వామ్యంగా, అగౌరవంగా ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి, ఆధిపత్యం, ఓ ప్రాంత రాజకీయుల మన్ననల కోసం మాత్రమే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని, గౌరవ ప్రదమైన ప్రధాని హోదాలో ఉంటూ అలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మోదీకి కొత్తేమీ కాదనీ, గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యటించిన సందర్భంలో తల్లిని చంపి పిల్లను బ్రతికించుకున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ విరాహత్ గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెప్పర్ స్ప్రే చేయించిందని, మైకులు కట్ చేసిందనే మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అలాంటి చేష్టలకు పాల్పడింది కొందరు సమైక్యవాదులేననే విషయాన్ని మరచిపోవడం విచారకరమన్నారు. రాజకీయాలను రాజకీయాలతో తేల్చుకోవాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల గుండెలకు గాయాలు కలిగించే విధంగా కాదన్నారు. పవిత్రమైన రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరమైనవేనని విరాహత్ ఖండించారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన  రాజ్యాంగం ప్రపంచ దేశాలు అసూయపడే విధంగా ఉందన్నారు. రాజ్యాంగమంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే పవిత్ర గ్రంథమని విరాహత్ స్పష్టం చేశారు. రాజకీయలబ్ది కోసం ప్రజల్లో ఆందోళన చేకూర్చే వ్యాఖ్యలకు రాజకీయులు స్వస్తిపలకాలని ఆయన సూచించారు.

కేసీఆర్ పై అట్రాసిటీ కేసు పట్టాలి : మందకృష్ణ మాదిగ

దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్, తన అనుచరులు బయటపెట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని దళితుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ మాట్లాడుతున్నారు. దళితులకు రిజర్వేషన్లు పెంచాలంటే కొత్త రాజ్యాంగం రావాలని కేసీఆర్ వ్యక్తం చేశారు. రాజ్యాంగం పై దళితులేంది మాట్లాడేంది అని కేసీఆర్ అంటున్నాడు.  కేసీఆర్ పై  అట్రాసిటీ కేసు పెట్టాలి. రాజ్యాంగంపై మాట్లాడే హక్కు దళితులకు లేదంటున్న కేసీఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెడతాం. కేసీఆర్ దళితులను అవమానించినందుకు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తం. వచ్చే ఏ ప్రభుత్వంలో కేసీఆర్ ను జైలులో వేస్తాం. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా  తీసుకొచ్చి జైలులో పడేస్తం. దళిత ముఖ్యమంత్రి మాటపై మోసగించిన కేసీఆర్ పై 420 కేసు పెడతాం. సబ్ ప్లాన్ నిధులను దళితులకు ఖర్చు పెట్టకుండా.. వేరే వైపు మళ్లించడం నేరమే అవుతుంది. దీనిపై కూడా జైలులో పెడతాం. భవిష్యత్ లో  కేసీఆర్ అరెస్టును ఎవరూ ఆపలేరు. మా తాత రాసిన రాజ్యాంగం పై మాకు మాట్లాడే హక్కు లేక పోతే మీకు ఉన్నదా..? దళితుడు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మాకు ఉంది. మేం లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదు. ఖమ్మం లో నిమ్మరసం తీసుకుంటే.. నీకు జీవించే హక్కు లేదని తెలంగాణ సమాజం ఎదురుతిరిగినందునే…‌ దళిత సమాజం మళ్లీ దీక్ష చేయమన్నందునే చేశావ్ కదా? మేం లేకపోతే దీక్ష చేద్దువా? 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇవి అవసరం లేదని చెప్పగలవా?  అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటే తన ఆటలు సాగవనే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటున్నాడు.  దళితుడు అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతం చేయలేదు.. తన పాటను చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. అంబేద్కర్ పేరిట ప్రాజెక్టు ఉంటేనే మార్చేసిండు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తుండు. అంబేద్కర్ అంటే కేసీఆర్ కు చాలా ద్వేషం ఉంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో కుల జనాభా పరంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మంత్రి వర్గంలో మీరే నలుగురు ఉంటారా? ప్రశ్నించే స్వేచ్ఛ ఉండొద్దనే కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలంటున్నాడు. నీ మాటలు ఎంత భ్రమల్లో ఉంటాయో, నీ చేతలు అణగదొక్కేలా ఉంటాయి. కేసీఆర్ మోసాలను అన్నివర్గాలు గమనిస్తున్నారనే కొత్త రాజ్యాంగం కోరుతున్నారు. మన ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకోవాలి.  తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన మీ పార్టీ సీనియర్ నేతలను అవమానిస్తున్నారు.

దమ్ముంటే బహిరంగ చర్చకు కేసీఆర్ రావాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మోడీ తెలంగాణపై, కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు స్ర్కీప్ట్ ప్రకారం చేస్తున్నవే. తెలంగాణలో వేల కోట్ల స్కామ్ జరుగుతోంది. వాటిని ప్రజలు గమనించాలి. 90 శాతం దళిత బహుజనులకు ఎన్ని పదవులు వచ్చాయి? వీటిపై కేసీఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాను. కేసీఆర్ విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రంలోని  కాంట్రాక్టులు దళిత బహుజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా.. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.

ఆప్ లాగా తెలంగాణలో కూడా చేయాలి : ఇందిరా శోభన్

దిల్లీలో ఆప్ ప్రభుత్వం చేస్తున్నట్టే ఆరోగ్య, విద్యారంగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవాలనీ, ఆ పని చేయకుండా రాజ్యాంగాన్ని మార్చాలనడం వ్యర్థ కార్యక్రమం అనీ ఆప్ తెలంగాణ నాయకురాలు ఇందిరాశోభన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావంపైన మోదీ చేసిన వ్యాఖ్యను కూడా ఆమె ఖండించారు.

రాజ్యాంగంపై కీసీఆర్ అక్కసు : జాజుల శ్రీనివాస్ గౌడ్

రాజ్యాంగంపై కేసీఆర్ అక్కసు కక్కుతున్నాడు. రాజ్యాంగం కావాలా… రద్దు చేయాలా అనే దానిపై చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ చేస్తున్నాను. దళితులకు ఎన్ని పదవులు ఇచ్చినవో చెప్పాలి. దోపిడి దారులంతా జైలుకు పోవాల్సిందే. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయటపెట్టాలి. రాజ్యాంగాన్ని మార్చే సత్తా కేసీఆర్ కు లేదు.  శాశ్వత సీఎంగా ఉండేందుకే చైనా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు.  రాజ్యాంగాన్ని రద్దు చేస్తే.. రాతియుగం కాలం వస్తది.. దాని కోసమే కేసీఆర్ తాపత్రయం అంతా. ‘కేసీఆర్ హటావో.. రాజ్యాంగం బచావో’ నినాదంతో ముందుకు వెళ్తాం. మోదీ పేరుకే బీసీనని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతీసేలా మోదీ మాట్లాడుతున్నారు. నీ మాటలు చూస్తే  ముఖ్యమంత్రి వా… చప్రాసివా.. అని అనుమానం వస్తుంది. తెలంగాణ లో వచ్చేది బీసీ రాజ్యామే. రాజ్యాంగం అంటే రాజకీయ పార్టీల మ్యానిఫెస్టో కాదు.. గొప్ప మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం అన్యాయం. తెలంగాణ  ఏర్పాటుపై మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.

రాజ్యాంగం అమలు చేశారా : పీవి శ్రీనివాస్

దేశంలో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు చేశారా..? అని మౌలిక ప్రశ్న వస్తుంది. నైతికంగా, రాజకీయంగా అమలైందా? రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించడం ముఖ్యం.

రాజ్యాంగం మౌలిక సూత్రాలకు గండి : జయసారథిరెడ్డి

‘రాజ్యాంగ మౌలిక సూత్రాలకు గండి కొడుతున్నారు. సీక్రెట్ ఎజెండా తోనే కేసీఆర్ రాజ్యాంగం పై మాట్లాడారు. డైనమిక్ రాజ్యాంగం మనది,’ అని సీనియర్ జర్నలిస్టు జయసారథిరెడ్డి అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగంపై దాడి మొదలు పట్టింది మోదీ : ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్

రాజ్యాంగం పై దాడి మొదలు పెట్టింది కేసీఆర్ కాదు.. మోడీ.. కేసీఆర్ ఏకకాలంలో దాడికి దిగారు. ఆర్టికల్ 3 మీద దాడికి పాల్పడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన విలువలతోనే దళిత బహుజనులు జీవిస్తున్నారు. దేశ కాషాయికరణలో భాగంగానే అంబేద్కర్, రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. విశ్వసనీయ లేని వ్యక్తులే రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు.

లోపం పాలకులదే, రాజ్యాంగానికి కాదు : కాశీనాథ్

‘కేసీఆర్ కు అహంకారం తారాస్థాయికి పెరిగిపోయింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చలేరు. కేసీఆర్ దొరల భావజాలంతో మాట్లాడుతుండు.  రాజ్యాంగాన్ని మార్చడం, తెలంగాణ ఏర్పాటు సమస్యలు కాదు… మోడీ, కేసీఆర్ కు మధ్య వచ్చిన సమస్యలతోనే మాట్లాడుతున్నారు. పాలకుల పరిపాలనలోనే లోపాలు ఉన్నాయి కానీ, రాజ్యాంగంలో కాదు. కేసీఆర్ కు అజ్ఞానం ఎక్కువైతుంది. మేధావులు గమనిస్తున్నారు. విద్యా, వైద్య, ఆర్థికరంగాలను కుప్పకూల్చారు,’ అని సీనియర్ అడ్వకేట్ కాశీవిశ్వనాథ్ వ్యాఖ్యానించారు.             

అప్రమత్తంగా ఉండాలి : ఫరెహమాన్

రాజ్యంగాన్ని మార్చితే మనం తిరగి రాతియుగంలోకి నెట్టబడుతామని అందోళన కల్గుతోంది. అప్పుడు,ఎస్సీ ఎస్టీ,మైనార్టీ ప్రజలు మూతికి ముంతా,మూడ్టీకి తాటకూ కట్టుకోని బ్రతికే  భయంకర పరిస్థితులు వస్తాయని అందుకే ప్రజలు ఇటువంటి పాలకుల పట్లా అప్రమత్తంగా ఉండాలని జనంసాక్షి ఎడిటర్ రెహమాన్ అననారు.

మరో ప్రాంతీయ పార్టీ అవసరం : యూసుఫ్ బాబు

‘రాష్ట్రంలో  టిఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అందుకే మరో ప్రాంతీయ  పార్టీ రాల్సిన అవసం ఉందనీ సీనియర్ పాత్రికేయులు యూసుఫ్ బాబు అన్నారు.

చర్చ జరగాలి : యోగానంద్ గౌడ్

రాజ్యంగం జడపదర్ధాం కాదు, దాన్ని మార్చుకోవచ్చు. మనుధర్మం శాస్త్రం మార్చుకొని పాలన చేస్తూంటే రాజ్యంగాన్నిమార్పుపై చర్చ జరగాలన్నారు. రాజ్యాంగం ఇప్పటికే చాల సార్లు అత్యచారనికి గురైందని సీనియర్ జర్నలిస్టు యోగానంద్ గౌడ్ అన్నారు.

అది బద్మాష్ మాట : మానవతారాయ్

‘‘రాజ్యాంగాన్ని మార్చాలన్న మాట కేసీఆర్ బద్మాష్ మాట. మోడీ, కేసీఆర్ లను మార్చాలనే ప్రజలు చూస్తున్నారు. తెచ్చుకున్న  వ్యూహకర్త ఉచ్చులో పడి కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను దేశం నుంచి తరిమి కొట్టాలి,’’ అని కాంగ్రెస్ నాయకుడు మానవతారాయ్ అన్నారు.                                                     

అది బీజేపీ, టీఆర్ ఎస్ ల ఉమ్మడి లక్ష్యం : సంధ్య

‘‘రాజ్యాంగాన్ని మార్చే లక్ష్యం బీజేపీ, టీఆర్ఎస్ లది. వారి అలోచనలను ప్రజలముందు ఎండగట్టలని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య పిలుపునిచ్చారు.

అధ్యయన వేదిక అధ్యక్షుడు బి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘దళితులకు రిజర్వేషన్ పెంచాలంటే పెంచుకోవచ్చు..  దీనికి రాజ్యాంగం మార్చాలి అవసరం లేదు… రాష్ట్రంలో మీకు కూడ అధికారం ఉంది. ఇక మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.  తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది,’’ అని అన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles