పొత్తూరి వెంకటేశ్వరరావుగారింట్లో మొట్టమొదటగా కలిశాము. రోశయ్యగారు తరచూ పొత్తూరిగారింటికి వస్తూ ఉండేవారు. వాళ్లిద్దరూ గుంటూరు హిందూ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. నేటి కుర్తాళ పీఠాధిపతి, పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయకులపతిగారు హిందూ కాలేజీలో ట్యూటర్ గా చేరిన కొత్తల్లో (19 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది ) విద్యార్థిగా ఉన్న రోశయ్యగారు కులపతిగారి ఉపన్యాసాలు (పాఠాలు) వింటూ ఉండేవారు. ఆ విధంగా కులపతిగారిని గురువుగా భావించేవారు. పొత్తూరిగారితో స్నేహం, కులపతిగారి పట్ల గురుభావం చివర వరకూ అలాగే కొనసాగింది. వాళ్లిద్దరూ మాకు ఆత్మబంధువులు, బంధువులు కాన,నన్ను రోశయ్యగారు ఆప్యాయంగా పితృవాత్సల్యంతో చూచేవారు (చూసేవారు అంటే రోశయ్యగారి ఆత్మ ఒప్పుకోదు). వివిధ సందర్భాల్లో అనేకసార్లు కలుసుకున్నాము. రోశయ్యగారి అల్లుడు పైడా కృష్ణప్రసాద్ గారు కూడా నాకు బాగా పరిచయస్తులు కనుక వారింట్లోనూ ఎన్నోసార్లు కలుసుకున్నాం.
పదవి పోయిన తర్వాత వచ్చిన గ్లామర్
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో ( గవర్నర్ కాకముందు) అల్లుడుగారింటికి వచ్చారు. నేను వచ్చానని చెప్పగానే వెంటనే లోపలికి రమ్మన్నారు. అప్పుడే నిద్ర లేచి టీ తాగుతున్నారు.”ఎవరికైనా పదవిలోకి ఎక్కిన తర్వాత గ్లామర్ వస్తుంది.. మీకు దిగిపోయిన తర్వాత గ్లామర్ పెరిగిందే?.. “అన్నాను. ఆ మాటకు అరగంట సేపు ఆగకుండా నవ్వారు. ‘‘అవును, నువ్వన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. హాయిగా ఉన్నాను. బాగా నిద్ర పోతున్నాను..’’ అంటూ సమాధానం చెప్పారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ అయిన కొత్తల్లోమరోమారు విశాఖపట్నం వచ్చారు. గవర్నర్ బంగ్లా (సర్క్యూట్ హౌస్) లో ఉన్నారు.అప్పుడు నేను hmtv లో పనిచేస్తున్నాను. ఏదో పని మీద రామచంద్రమూర్తిగారు కూడా విశాఖ వచ్చారు. రోశయ్యగారిని కలుద్దామా? అని మూర్తిగారిని అడిగాను. ఓ! తప్పకుండా కలుద్దామన్నారు.ఇద్దరం వెళ్లి కలిశాము. ముగ్గురం చాలాసేపు మాట్లాడుకున్నాం.
జయలలిత వైభవమే వేరు
ఇటాలియన్స్ కు ఎంత పగబట్టే స్వభావం ఉంటుందో!.. చెప్పుకుంటూ వచ్చారు. (సోనియా గాంధీ ఇటాలియన్ అన్న విషయం వేరే చెప్పక్కర్లేదు) అందులోనే ఆన్నీ ఉన్నాయి). తమిళనాడులో అప్పుడే రుచి చూస్తున్న కొత్త అనుభవాలను చెబుతూ…ముఖ్యమంత్రి జయలలిత చుట్టూ ఉండే వాతావరణం, మంత్రులు, ఎమ్మెల్యేలు,కొందరు అధికారులు సైతం సాష్టాంగ దండప్రమాణాలు/ప్రణామాలు పెట్టే వైనం,భయంతో వణికిపోయే తీరు చూసి ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయని రోశయ్యగారు పులకించిపోతూ వివరించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో.. ఆయన అనుభవాలకు – జయలలిత చుట్టూ ఉండే వాతావరణంకు ఎంత తేడా ఉందో!! ఆయనకు బాగా తెలుసు కదా.. అందుకే అంత ఆనందం.
నిన్నటి దాకా పంచెకట్టులో మనమధ్యే సందడి చేసిన నాయకులలో రోశయ్యగారు ఒకరు. పల్లెదనం, తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తి. గుంటూరు మాండలికం పట్ల అభిమానం మెండు. జర్నలిస్టులందరితో చాలా చనువుగా ఉండేవారు. ఎక్కువమందిని ఏకవచనంతోనే పిలిచేవాడు. అది కేవలం వయసు రీత్యా వచ్చిన పలకరింపు కాదు. ఏకవచన ప్రయోగం కూడా పల్లెదనానికి ఒక గుర్తు. రాయలసీమ, తెలంగాణ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో నిన్నమొన్నటి వరకూ అదే తీరు నడిచేది. ఆ ఏకవచనపు పలకరింపులో బోలెడు ప్రేమ దాగి ఉంటుంది. అది ఆయనకు పుష్కలంగా ఉంది. కబుర్లు, చతుర్లు అంటే చెవికోసుకుంటారు. ఆయన చమత్కార భాషణ తెలుగువారందరికీ చిరపరిచయమే.
కాసుల విషయంలో క్రమశిక్షణ
డబ్బుల విషయంలో ఆయన క్రమశిక్షణ గురించి ఇక చెప్పనవసరమే లేదు. తమిళనాడు గవర్నర్ గా ఉన్న సందర్భంలో కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా రావాల్సిందని పొత్తూరిగారు కోరారు. రాకపోకలకు ఎంతవుద్ది? అని రోశయ్యగారు వెంటనే అడిగారు. మీరు గవర్నర్ కదా? అంతా ప్రభుత్వం చూచుకుంటుంది కదా.. అని పొత్తూరిగారు అన్నారు.అది సరే కానీ, ఊరకనే… ఎంతవుద్దో తెలుసుకుందామని అడిగాను.. అంటూ రోశయ్యగారు ప్రతిస్పందించారు. ధనం పట్ల, అందునా ప్రభుత్వం సొమ్ముల పట్ల ఎంత భయభక్తులతో ఉంటారన్నదానికి, ఆర్ధిక క్రమశిక్షణకు ఇదొక ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
అవధానం అంటే మక్కువ ఎక్కువ
తెలుగు పద్యానికి ప్రతిరూపమైన ‘అవధానం’అంటే మక్కువ ఎక్కువ. వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొప్పరపు కవులకు నీరాజనంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘అవధాన సప్తాహం’ చాలా ఘనంగా నిర్వహించింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం అప్పుడు సాంస్కృతిక మండలి ఛైర్మన్ గా ఉన్నారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి మొదటిరోజు ముఖ్యఅతిధిగా వి.రామారావుగారు, అప్పటి సిక్కిం గవర్నర్, వచ్చారు. ముగింపు ఉత్సవానికి రోశయ్యగారు ముఖ్యఅతిధిగా వచ్చారు. అవధానాలు, పద్యం, తెలుగు భాషా, సంస్కృతులపై గొప్ప ప్రసంగం ఇచ్చారు. మిత్రుడు రమణమూర్తిగారు విశాఖపట్నంలో నిర్వహించిన ‘లీడర్’ పత్రిక 20ఏళ్ళ ఉత్సవాల వేదికపై చివరగా రోశయ్యగారిని కలుసుకున్నాను. ఆయన
‘జీవితం – వృత్తి – ప్రవృత్తులు – అనుభవాలు – జ్ఞాపకాలు’ పై సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేద్దామనుకున్నాను. చెయ్యలేక పొయ్యాను. అది ఒక వెలితిగా మిగిలింది. మంచి మాటకారి, ఆత్మీయులు, పాతతరం ప్రతినిధిగా మిగిలివున్న రోశయ్యగారు వెళ్లిపోవడం బాధాకరం. నిండు జీవితాన్ని గడిపారు. రాజకీయాల్లో ఎంతో ఎదిగారు. కేంద్రమంత్రి తప్ప అన్ని ముఖ్యపదవులు ఆయనను వరించాయి. విజయవంతమైన, ఫలవంతమైన జీవితం అయనది. నివాళులు సమర్పిస్తూ…