Saturday, December 28, 2024

అజాత శత్రువు, అపరచాణక్యుడు రోశయ్య

  • నలుగురు ముఖ్యమంత్రుల తలలో నాలుక
  • మృదుభాషి, చమత్కార సంభాషణలో చతురుడు
  • రాజకీయాలలో ఎత్తుపల్లాలు చూసిన అనుభవజ్ఞుడు

అతడు అనేక యుద్ధముల ఆరియుతేరిన… అనే పద్యార్థం కొణిజేటి రోశయ్య (88)కి బాగా అతికినట్టు సరిపోతుంది. ఎన్నో ఏళ్ళ రాజకీయం. ఎన్. జి.  రంగా నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వరకూ ఎందరో నాయకులతో సాన్నిహిత్యం. పదిహారు విడతల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన అనుభవం. సంఖ్యాబలం లేని చిన్న సామాజికవర్గానికి పెద్దనాయకుడిగా, పెద్ద దిక్కుగా దాదాపు ఆరు శతాబ్దాల ప్రస్థానం. వివాదాస్పదంగా మాట్లాడినా వివాదాలలోకి తలదూర్చని మనస్తత్వం. చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, జనార్దన రెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ముఖ్యమంత్రుల కెబినెట్ లో రెండో స్థానంలో నిలిచి వెలిగిన కార్యదక్షత, స్థిరమైన వ్యక్తిత్వం. ఆగ్రహం ప్రదర్శించినా, చిరునవ్వు చిందించినా, వినయంగా ఒదిగి ఉన్నా అంతా ముందుగా ఆలోచించి చేసే పనే కాని క్షణికావేశం ఎన్నడూ లేదు. స్వయంగా నిగర్వి. అవసరం అనుకుంటే ఎన్ టి రామారావు, చంద్రబాబునాయుడి వంటి ముఖ్యమంత్రులను మాటల ఈటలతో ఆట పట్టించేవారు. పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించేందుకు వెనకాడేవారు కాదు. అంతా నిష్కల్మషంగానే.

Also read: మమతా, పీకే రాజకీయ విన్యాసాలు 

జయలలిత, రోశయ్య చతుర సంభాషణలో

తెల్లటి ఖద్దరు ధోవతి, లాల్చీ, ఖద్దరుదే బనీను, కండువాతో పదహారణాల తెలుగుదనం మూర్తీభవించిన రూపంతో నిండుగా కనిపించే రోశయ్య ఇక కనిపించరంటే మనసు వికలం అవుతోంది. ఒక పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయనను ఎన్ని సార్లు కలిశానో లెక్కలేదు. ఎప్పుడు కలిసినా నవ్వుతూ స్వాగతం చెప్పేవారు. చిరునవ్వులోనే వీడ్కోలు చెప్పేవారు. ఎక్కువ వినేవారు. తక్కువ మాట్లాడేవారు. ప్రతి అక్షరాన్నీ ఆచితూచి ఉపయోగించేవారు. ద్వితీయ స్థానంలోనే హాయిగా ఉండేవారు. ప్రథమ స్థానంలో అసౌకర్యంగా కనిపించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం ముఖ్యమంత్రిగా పని చేసిన సంవత్సరకాలంలో ఎన్నడూ కుర్చీలో స్థిమితంగా కూర్చున్నట్టు కనిపించలేదు. అదేదో తాత్కాలికమైన హోదా అన్నట్టు కుర్చీ అంచుల్లోనే కూర్చునేవారు. అక్షరాలా ముళ్ళమీద కూర్చున్నట్టే ఉండేది.

Also read: జేబులో మహాప్రస్థానం, తిరుపతిలో ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రకటన చేసిన క్షణాలు

9డిసెంబర్ 2009న నాటి ముఖ్యమంత్రి రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమాలోచనలు జరపడానికి దిల్లీ వెళ్ళారు. అది కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ పుట్టిన రోజు. చిదంబరంతో మాట్లాడి హైదరాబాద్ కు విమానంలో బయలు దేరారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగడానికి పూర్వమే చిదంబరం చరిత్రాత్మకమైన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామనీ, దాని అమలు కార్యక్రమం మొదలు పెడతామనీ చెప్పారు. అప్పటి వరకూ 12రోజులుగా నిరాహారదీక్షలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిరాహారదీక్ష విరమించారు.  ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇవ్వగా స్వీకరించారు. దీనికంతటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. అంతకు ముందు కేసీఆర్ రమ్మంటున్నారని కబురు పెడితే చుక్కారామయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, నేనూ నిమ్స్ కి వెళ్ళాం. చిదంబరం ప్రటకనను కేసీఆర్ ఊహించి ఉండరు. మేము వెళ్ళిన తర్వాత నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ కు ఫోన్ చేయడం, తర్వాత చిదంబరం ప్రటకన చేయడంతో సీను మారిపోయింది. కేసీఆర్ దీక్ష ఆశించిన ఫలితం ఇచ్చింది. ముఖ్యమంత్రి రోశయ్యకు మాత్రం విమానం దిగిన తర్వాతనే చిదంబరం ప్రకటన వైనం తెలిసింది.  

రోశయ్యను ఆలింగనం చేసుకున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి

4 జులై 1933న గుంటూరు జిల్లాలోపుట్టి, అక్కడే చదువుకొని, గుంటూరులోనే డిగ్రీ పూర్తి చేసి, కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో వైశ్య సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడిగా కుదురుకున్నారు. రంగా శిష్యరికం చేశారు. స్వాతంత్ర్యోద్యమ నాయకులతో కలసి తిరిగారు. స్వాతంత్ర్యానంతర రాజకీయాలలో తనకంటూ ఒక పాత్రకు రూపకల్పన చేసుకున్నారు. శాసనసభ్యుడిగా, శాసనమండలిసభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులలో ఉండాలో అన్ని పదవులలోనూ ఉన్నారు. ఏ పదవిలో ఉన్నప్పటికీ తన నేపథ్యాన్నీ, పరిమితులనూ, వ్యక్తిత్వాన్నీ విస్మరించలేదు.

Also read: భారత ఎన్నికల వ్యవస్థ నిర్మాణంలో అంబేడ్కర్ అసాధారణ పాత్ర

చంద్రబాబునాయుడు అవాక్కయిన సందర్భం

రోశయ్య అనగానే చాలా ఛలోక్తులూ, శాసనసభలో ఆయన రెచ్చిపోయి వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన సందర్భాలూ గుర్తుకొస్తాయి. మచ్చుకు ఒక్కటి మనవి చేస్తాను. శాసన సభలో ఒక సారి టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు రోశయ్యని తెలివితేటలు కలిగిన రాజకీయ నాయకుడంటూ ఎద్దేవా చేశారు. మీకీ మధ్య తెలివితేటలు పెరిగి పోయాయి అంటూ ఒకటికి రెండు సార్లు రెట్టంచారు. రోశయ్య లేచి వీరంగం వేశారు. సభను దిగ్భ్రాంతికి గురి చేశారు. చంద్రబాబునాయుడు అవాక్కయినారు. ‘‘చంద్రబాబుగారూ, మీ అంత తెలివిగలవాడిని నేను కాను. మీలాంటి తెలివితేటలు ఉన్నవాడినే అయితే నేను కూడా ఎప్పుడో విజయభాస్కరరెడ్డి ఏమరుపాటుగా ఉన్నప్పుడు వెన్నులో కసుక్కున చాకుతో పొడిచేవాడిని. రాజశేఖరరెడ్డిని నిర్దాక్షిణ్యంగా వెన్నుపోటు పొడిచేవాడిని. మీ అంత తెలివితేటలు నాకు లేవండీ..’’ అంటూ కూర్చునే ముందు ముక్తాయింపుగా, ‘ఒకటి అనడం ఎందుకు, అయిదు పడటం ఎందుకు?’ అంటూ చురక అంటించారు. అటువంటి పదునైన పదజాలంతో, హాస్యోక్తులతో,చమత్కార సంభాషణతో, సరసోక్తులతో సభను రక్తి కట్టించడంలో రోశయ్యను మించినవారు లేరు. ముఖ్యమంత్రులకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ ప్రతిపక్షానికి సింహస్వప్నంగా ఉండేవారు.

భార్య పట్లా, సంతానం పట్లా అత్యంత ఆదరణ ఉన్నప్పటికీ వారి గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. రాజకీయాలలో తనతో పాటు తిప్పేవారు కాదు. నా బోటి వాళ్ళు ఎప్పుడైనా పిల్లల గురించి మాట్లాడినా ‘వారి బతుకు వారు బతుకుతున్నారు. వారి గురించి చింత లేదు. వారికి నా రాజకీయాలతో నిమిత్తం లేదు,’ అంటూ ముక్తసరిగా చెప్పేవారు. పిల్లలంటే మహాప్రేమ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రోశయ్య

Also read: పౌరసమాజమే శత్రువు అంటారా దోవల్?

ఆర్తితో రోశయ్యను ఆలింగనం చేసుకున్న వైఎస్

2009లో వైఎస్ పెద్ద రిస్కు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలని గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు చెవిలో ఇల్లుకట్టుకొని పోరారు. సోనియాగాంధీ కూడా విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. వైఎస్ కు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ తో పొత్తు ఏ మాత్రం ఇష్టం లేదు. 2004లోనే అధిష్ఠానం ఒత్తిడి చేస్తే కాదనలేక ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా అయిదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన విధానంతో అధిష్ఠానం దగ్గర పలుకుబడి పెరిగింది. వైఎస్ కు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ‘‘ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాదే’’ అంటూ ప్రకటించి తన వైఖరిని నిర్ద్వంద్వంగా పునరుద్ఘాటించి అధిష్ఠానం నోరు మూయించారు. వైఎస్ పట్ల ఉన్న గౌరవంతో, విశ్వాసంతో అధిష్ఠానం కూడా అియిష్టంగానే పట్టు సడలించింది. వైఎస్ కి స్వేచ్ఛ ప్రసాదించింది. కాంగ్రెస్ ఒక్కటీ ఒక వైపు, తెలుగుదేశంపార్టీ, టీఆర్ఎస్, వామపక్షాలు అన్నీ మరో వైపు. దిల్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. అహరహం శ్రమించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు జరిగిన నాడు ఉదయమే వైఎస్ తన గదిలో ఎవ్వరినీ కలవకుండా ఒంటరిగా టీవీవైపు చూస్తూ కూర్చున్నారు. కడుపులో ఎసిడిటీ వల్ల మంట. యాంటాసిడ్ బిళ్ళలు నములుతూ, గడ్డం కింద రెండుచేతులూ పెట్టుకొని టీవీ వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నారు. మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  శాసనసభలో అత్తెసరు మెజారిటీ వచ్చినప్పటికీ, 42 లోక్ సభ స్థానాలలో 33 స్థానాలు సంపాదించి సోనియాగాంధీ చేతుల్లో పెట్టారు. ఇన్ని లోక్సీ సభ సీట్లు సంపాదించిన రాష్ట్రం మరొకటి లేదు. తుది ఫలితాల ప్రకటన జరుగుతున్న సమయంలో రోశయ్య వైఎస్ ఇంటికి వెళ్ళారు. ఆయన వచ్చారని కబురు పెడితే కిందికి దిగి వచ్చి పరుగుపరుగున వెళ్ళి రోశయ్యను వైఎస్  ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఆయన కళ్ళలో తడి కనిపించింది. రోశయ్య ఆప్యాయంగా రాజశేఖర్ వీపు నిమురుతూ ఆలింగనంలో కొంత సేపు అలా ఉండిపోయారు. వారిద్దరి మధ్యా అనుబంధం అటువంటిది.  

Also read: పెగాసస్ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరిస్తుందా?

వైఎస్ హెలికాప్టర్ తప్పిపోయినప్పుడు నిబ్బరంగా…

సంక్షోభ సమయాలలో నిగ్రహం కోల్పోకుండా స్థిరచిత్తంతో వ్యవహరించడం రోశయ్య నైజం. ఈ లక్షణం 2 సెప్టెంబర్ 2009నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ తెలియక రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పరిస్థితిని అదుపులోకి తేవడంలొ నాటి ఆర్థికమంత్రి రోశయ్య పోషించిన పాత్రలో ప్రస్ఫుటంగా కనిపించింది. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్ హెలికాప్టర్ ఆచూకీ తెలియడం లేదనే వార్త వచ్చిన తర్వాత అందరికంటే ముందు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయంలోని సీ-బ్లాక్ కు వచ్చిన మంత్రి రోశయ్య. రాగానే ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రమాకాంతరెడ్డితోనూ, ఇతర అధికారులతోనూ సమాలోచనలు జరిపి అన్వేషణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తూ గంటల తరబడి అక్కడే ఉన్నారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అరవిందరావు పక్కనే ఉన్నారు. సీఐడీ, గ్రేహౌండ్ అధిపతులూ అందుబాటులో ఉన్నారు. వైఎస్ క్షేమంగా తిరిగి వస్తారనే ధీమాతోనే రోశయ్య ఉన్నారు. అదే మాట తనకు ఫోన్ చేసిన కాంగ్రెస్ నాయకులకూ, అధికారులకూ, జర్నలిస్టులకూ చెప్పేవారు. ఒకవేళ నల్లమల అడవులలో హెలికాప్టర్ దిగినప్పటికీ వైఎస్ చిరునవ్వుతో నడుచుకుంటూ ధైర్యంగా తిరిగి వస్తారనే విశ్వాసం వెలిబుచ్చేవారు.

వైఎస్ ను నక్సలైట్లు కిడ్నాప్ చేసి ఉంటారని ఒకరు సందేహం వెలిబుచ్చినప్పుడు వెంటనే గ్రేహౌండ్ దళాలను నల్లమల అడవులకు పంపించారు. మొత్తం పాలనా వ్యవస్థను రోశయ్య తన అదుపులోకి తీసుకొని ప్రతి విషయం పర్యవేక్షించారు. సీనియర్ మంత్రిగా అది తన బాధ్యత అని ఆయన గుర్తించి వ్యవహరించారు. వయస్సు మీదపడిన పెద్దవారు విశ్రాంతి తీసుకోవాలని అధికారులు చేసిన సూచనను పట్టించుకోకుండా వైఎస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే రేయింబవళ్ళూ సచివాలయంలోనే ఉన్నారు. చివరికి రెండో తేదీ సాయంత్రానికి హెలికాప్టర్ జాడ తెలియడం లేదంటూ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు రోశయ్య కబురు చెప్పారు. ఎవరికైనా హెలికాప్టర్ కనిపించినా, ముఖ్యమంత్రి కనిపించినా వెంటనే ఫలానా నంబరుకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరుసటి రోజు కర్నూలు జిల్లా పావురాలగుట్టమీద హెలికాప్టర్ కూలిపోయినట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత, వైఎస్, ఆయనతో పాటు మరి నలుగురు మరణించారని ధ్రువీకరించుకున్నారు.  అప్పుడు నేను హెచ్ఎంటీవీలో ఉన్నాను. పావురాలగుట్టపైన హెలికాప్టర్ పడిపోయినట్టు మా విలేఖరుల బృందమే మొదట గుర్తించింది. వెంటనే నాకు తెలిసిన సమాచారాన్ని రోశయ్యకు ఫోన్ ద్వారా తెలియజేశాను. తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రోశయ్య

రోశయ్య యువజన కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ నాయకుడుగా క్రమక్రమంగా ఎదిగారు. రెండు విడతల పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. 1968లో తొలిసారి ఎంఎల్ సీగా ఎన్నికైనారు. చీరాల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. ఒక సారి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైనారు. విషయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ నేతగా, మంచి వక్తగా, సమయస్ఫూర్తి దండిగా కలిగిన ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల గౌరవాన్నీ సంపాదించారు. అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అందరితోనూ చనువుగా, ఆత్మీయంగా మాట్లాడటం ఆయనకు బాగా తెలిసిన విద్య.

పైరవీలు చేయడం, డబ్బు సంపాదించడం వంటి పనులు పెట్టుకోలేదు. ఎవరైనా ఏదైనా పనికోసం ఆయన దగ్గరికి వెళ్ళినా నియమనిబంధనలు వివరించి, తాను చేయగలిగింది ఏమీ లేదని ఒప్పించి పంపించేవారు. అంతే కానీ తన అధికారం వినియోగించి మెహర్బానీకోసం అడ్డదారులలో పనలు చేయించడం అన్నది ఎరుగరు. ముఖ్యమంత్రిగా ఉండగా అమీర్ పేటలోని భూమి వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. అంతే.

తమిళనాడు గవర్నర్ గా నిశ్చింతగా…

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే  2011లో తమిళనాడు గవర్నర్ గా వెళ్ళారు. అదే హోదాలో 2016 వరకూ ఉన్నారు. ఆ సమయంలో విశాఖపట్టణంలో ఒకసారి నేనూ, మిత్రుడు మాశర్మ రోశయ్యను కలిశాం. ‘ముళ్ళకిరీటం తొలిగిపోయినందుకు సంతోషంగా ఉంది. రకరకాల ఒత్తిళ్ళు ప్రశాంతత లేకుండా చేసేవి. ఇప్పుడు చెన్నై రాజభవన్ లో ప్రశాంతంగా ఉన్నాను. జయలలిత నన్ను బాగా గౌరవిస్తుంది. సమస్యలంటూ ఏమీ లేవు,’’ అని చెప్పారు. నిజంగానే నిశ్చింతగా కనిపించారు.  తాను గవర్నర్ గా ఉండగా తన అతిథిగా చైన్నై రాజభవన్ కు కుటుంబంతో రావాలని చాలాసార్లు చెప్పారు కానీ కుదిరింది కాదు.

ఏ సమస్యనైనా సాకల్యంగా అధ్యయనం చేసి అవగాహన చేసుకొని సాధికారికంగా మాట్లాడే నికార్సయిన రాజకీయ నాయకుడూ, ప్రజాసేవకు అంకితమైన పాతతరం నేత రోశయ్య. మృదుభాషి, వివాదరహితుడు, అపరచాణక్యుడు అయిన రోశయ్య వంటి రాజకీయ నాయకుడు మరొకరు లేరు. ఎంత హడావిడిగా ఉన్నా, గందరగొళంలో ఉన్నా, రాజకీయ రొంపిలో ఉన్నా తామరాకుమీద నీటి బొట్టు చందంగా తనకేమీ అంటకుండా బహుజాగ్రత్తగా ఉండేవారు. అటువంటి రాజకీయ నాయకులు అరుదు. తెలుగు రాజకీయరంగంలో ఆరు దశాబ్దాలపాటు వెలిగిన మహానుభావుడికి ఇదే అక్షరాంజలి.

Also read: శత్రువులకూ, మిత్రులకూ ఆశ్చర్యం కలిగించిన కాంగ్రెస్ ఫలితాలు    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles