Friday, December 27, 2024

మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలి : పోలీసు, ఎక్సైజ్ అధికారుతో సీఎం

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గంజాయి, తదితర నార్కోటిక్ డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) వాడకాన్ని తెలంగాణలోంచి సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలనీ, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందనీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు.  ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని  సీఎం కేసీఆర్ అన్నారు.

ద్విముఖ వ్యూహం

Hyderabad: Campaign against drug menace launched
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రదర్శన

డ్రగ్స్ ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. మొదట వ్యూహంలో ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని (మాదకద్రవ్యాలు సేవించే వ్యవసనానికి బానిసలైనవారిని) గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం (వ్యసనం మాన్పించడం) కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు.  ఆ తర్వాత.. డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం, వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని, నిష్ణాతులైన మెరికల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై  విజృంభించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 స్కాట్ లాండ్ యార్డ్ పోలీసుల తరహాలో తయారు కావాలి

స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి డ్రగ్స్ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా  తెలంగాణ పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. స్కాట్ లాండ్ యార్డ్ మాదిరిగా… డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు. ఎంత ఖర్చయినా పర్వాలేదనీ, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందనీ సీఎం పునరుద్ఘాటించారు. గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలనీ, డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలనీ సీఎం అన్నారు.

తల్లిదండ్రులకు సీఎం విజ్ఞప్తి

అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి, కొకైన్, ఎల్సీడి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం వైపు ఎక్కువగా యువత ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు, పేదలు అనే భేదం లేకుండా అన్ని తరగతుల కుటుంబ సభ్యులూ, తల్లితండ్రులూ అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లల అలవాట్ల పై దృష్టి సారించాలని సీఎం కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకారని, దానిన కూకటివేళ్లతో నాశనం చేయకుంటే  మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు, అభివృద్ధికి అర్థం లేకుండాపోతుందని సీఎం స్పష్టం చేశారు.

Telangana Gets Its Act Together To Check Growing Drug Menace | Nation
మాదక ద్రవ్యాలు

“ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? మన పిల్లలు మన కండ్ల ముందే  డ్రగ్స్ కు బానిసలై వాళ్ళ భవిష్యత్ మన కళ్ళ ముందే నాశనమై పోతుంటే ఎంత వేదన?” అంటూ సీఎం యువత తల్లి దండ్రులను హెచ్చరించారు. డ్రగ్స్ కంట్రోల్ లో సభ్యసమాజం సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. అందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్,  విద్యార్థులతో సమావేశాలు, సజావుగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా స్ధానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచలని సీఎం అన్నారు. గ్రామం లో ఏ రైతు గాంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం  అందించక పోతే ఆ గ్రామానికి ‘రైతుబంధు’ తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని..ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని సీఎం కేసిఆర్ ఆదేశించారు.

‘అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ ప్రయోగించండి’

ఇది అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మనసు మీదికి తీసుకుని డ్రగ్స్ కంట్రోల్ విషయంలో కృషి చేయాలనీ సీఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్ కంట్రోల్ అంశంలో వినియోగించుకోవాలని అన్నారు. వ్యవస్థీకృత నేరాలను కంట్రోల్ చేస్తున్న విధంగా పి.డి.యాక్ట్ లు కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ” మీరు ఏమి చేస్తారో ఏమో..ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది..మీరు రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం లో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టాల” నీ సీఎం డీజీపీ నీ ఆదేశించారు. డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయి కి చేరుకోలేదనీ, రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని  మొగ్గలోనే తుడిచేయాలనీ సీఎం అన్నా రు . నేరస్థులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ ను   మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు చేయాలన్నారు.

న్యాయస్థానాల ముందు డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా,  నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల సాక్ష్యాధారాలనూ సేకరించాలనీ, ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలనీ ముఖ్యమంత్రి చెప్పారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles