- దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ చివరి వారంలో
- మూడు టెస్ట్ లూ, మూడు ఒన్ డేలూ
- టెస్ట్ మ్యాచ్ లకు రోహిత్ నాయకత్వం కొనసాగింపు
ముంబయ్ : భారత ఒన్ డే క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) బుధవారంనాడు ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొహ్లీని సంప్రతించకుండానే అతడి స్థానంలో రోహిత్ శర్మ ను నియమించాలని సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఉన్నతాధికారవర్గం నిర్ణయించినట్టు సమాచారం. 33 ఏళ్ళ కొహ్లీకి ముందస్తు సమాచారం లేకుండా ఆయనను నాయకత్వం నుంచి తొలగించడం విశేషం. ద్వంద్వ నాయకత్వం లేకుండా చేయడానికీ, వైట్ బాల్ తో ఆడే రెండు ఫార్మాట్లలోనూ ఒకే నాయకుడిని ఉంచడానికీ ఈ నిర్ణయం దోహదపడుతుందని అంటున్నారు. టీ20 ప్రపంచకప్పు పోటీలు ముగిసిన తర్వాత ఆ పార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కొహ్లీ ప్రకటించారు. బ్యాటర్ గా, కెప్టెన్ గా తనమీద బాధ్యతల భారం ఎక్కువయిందని కొహ్లీ చెప్పారు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు కొనసాగిన తర్వాత భారం ఎక్కువైనట్టు భావించారు. టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా కొహ్లీ ఉంటారు. వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటారు. ఇంతవరకూ ఆ స్థానంలో అజింక్య రహానే ఉన్నారు. ఆయన ఈ మధ్య సరిగా పరుగులు చేయలేకపోవడంతో ఆ స్థానం నుంచి తప్పించారు. కానీ దక్షిణాఫ్రికా వెళ్ళే భారత జట్టులో స్థానం రహానేకి పదిలంగానే ఉంది. రవిశాస్త్రి స్థానంలో నేషనల్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ చేరిన తర్వాత ఇది భారత జట్టు చేసే తొలి విదేశీ పర్యటన.
డిసెంబర్ 26న మొదటి టెస్ట్ తో దక్షిణాఫ్రికాలో బారత్ జట్టు పర్యటన ప్రారంభం అవుతుంది. దక్షిణాఫ్రికాలో ఇండియా మూడు టెస్ట్ లనూ, మూడు ఒన్ డే ఇంటర్నేషనల్స్ నూ (ఓడీఐ) అడుతుంది.