భారత్ 6 వికెట్లకు 300 పరుగులు
స్పిన్ పిచ్ పైన భారీమార్పులతో భారత్
చెన్నై చెపాక్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండోటెస్టు తొలిరోజు ఆటను భారత్ సంతృప్తికరంగా ముగించింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 161 పరుగులతో భారీ సెంచరీ సాధించడంతో భారత్ 6 వికెట్లకు 300 పరుగుల స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ ఆటగాళ్లు రిషభ్ పంత్ 33, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 5 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
సుందర్ కు రెస్ట్…కుల్దీప్ కు చాన్స్:
తొలిటెస్టులో 227 పరుగుల భారీ ఓటమి చవిచూసిన భారత్…నిర్ణయాత్మక రెండోటెస్టులో పలుమార్పులతోబరిలోకి దిగింది. ఓపెనింగ్ బౌలర్ బుమ్రా, స్పిన్నర్లు సుందర్, షాబాజ్ నదీమ్ లకు విశ్రాంతి నిచ్చి తుదిజట్టులో అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, హైదరాబాద్ పేసర్ కు చోటు కల్పించారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకోడంతో ప్రారంభమైన ఈ మ్యాచ్ కు 15వేల మందికి పైగా అభిమానులు తరలి వచ్చారు.
గిల్, విరాట్ డకౌట్లు:
గిల్- రోహిత్ లతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఒక్క పరుగు చేయకుండానే శుభ్ మన్ గిల్ వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం డకౌట్ గా వెనుదిరగడంతో భారత్ కు కష్టాలు తప్పలేదు. అయితే వన్ డౌన్ పూజారా, ఓపెనర్ రోహిత్ శర్మ మూడో వికెట్ కు 86 పరుగుల కీలక భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దారు. పూజారా సైతం భారీస్కోరు లేకుండానే వెనుదిరగడంతో రహానే వచ్చి చేరడంతో రికార్డు భాగస్వామ్యానికి తెరలేచింది. ఈ ఇద్దరూ 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 18 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 161 పరుగుల స్కోరు సాధించి అవుటయ్యాడు. మరోవైపు వైస్ కెప్టెన్ రహానే 149 బంతుల్లో 9 బౌండ్రీలతో 67 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. 7వ వికెట్ కు పంత్- పటేల్ అజేయంగా నిలవడంతో 88 ఓవర్లలో 300 పరుగుల స్కోరుకు తొలిరోజు ఆట ముగిసింది. పంత్ 56 బాల్స్ లో 5బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోన్, వోలీ, రూట్ తలో వికెట్ మోయిన్ అలీ 3 వికెట్లు పడగొట్టారు. రెండోరోజుఆటలో భారత్ మరో 50 పరుగులు సాధించినా ఇంగ్లండ్ కు కష్టాలు తప్పవు.
ఇదీ చదవండి:భారత్ కు డూ ఆర్ డై టెస్ట్