చత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు గ్రామాలు పామేడు-కొండపల్లి ప్రాంతంలో మావోయిస్టు నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగాయి. మావోయిస్టులు ఎక్కువమంది హాజరైనారు. ఆర్ కె భౌతిక కాయంపైన ఎర్రజెండా కప్పారు. అనంతరం దహన సంస్కారం చేశారు. ఆర్కే మృతిని ప్రకటించిన మావోయిస్టులు అంత్యక్రియలను కూడా వారే చేశారు. సదరు ఫొటోలను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ లాంఛనాలతో అంత్యక్రయలు ముగిశాయి.
ఆర్కే కొంతకాలంగా అనారోగ్యం ఉన్నారని తెలిసిందే. 60 ఏళ్ళ ఆర్కే మూడు సంవత్సరాల నుంచి ఎముక కాన్సర్ తో బాధపడుతున్నారు. అంతకు ముందు నుంచే మూత్రపిండం వ్యాధి ఉంది. మధుమేహం వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. కేంద్ర కమిటీ సభ్యుడుగా నియుక్తుడైన తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించింది. పార్టీ కార్యకర్తలే ఆయనను మంచం మీద పడుకోపెట్టి ఒక చోటి నుంచి మరో చోటికి తరలిస్తుండే వారు. ఆర్కే భార్య శిరీష్ అలియాస్ పద్మ అలియాస్ నిర్మల ప్రకాశం జిల్లాలో నివసిస్తున్నారు. ఆర్కే సోదరులలో ఇద్దరు కెనాడాలోనూ, ఇద్దరు హైదరాబాద్ లోనూ ఉంటున్నారు. సోదరి ఎల్ బి నగర్ లో నివసిస్తున్నారు.
ఆర్కే, శిరీష కుమారుడు శివాజీ అలియాస్ మున్నా 2016లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అప్పుడు అతడి వయస్సు పాతికేళ్ళు. అప్పటికి ఆరేళ్ళ కిందటే మావోయిస్టు పార్టీలో చేరాడు.