ఇండియన్ ఇంగ్లీషు సాహిత్యానికి మూల స్తంభాలైన ముగ్గురు మహారచయితల్లో ఆర్ కె నారాయణ్ ఒకరు. మిగతా ఇద్దరు ముల్క్ రాజ్ ఆనంద్, రాజారావు. అర్కే నారాయణ్ పేరు వినగానే ‘మాల్గుడి’ గుర్తుకొస్తుంది. మాల్గుడి అనేది ప్రపంచ దేశ పటం మీద ఎక్కడా కనిపించదు. అది ఆర్.కె. నారాయణ్ ఊహల్లోంచి రూపుదిద్దుకున్న దక్షిణభారత పట్టణం. 1930 సెప్టెంబర్ లో ఆయన దానికి రూపకల్పన చేశారు. అప్పుడాయన వయసు ఇరవై నాలుగు. ఏదైనా మంచి పని విజయదశమినాడు ప్రారంభించాలని ఆయన అమ్మమ్మ పార్వతి చెప్పిన విధంగా ముందు ఆయన ఒక రైల్వే స్టేషన్ వాతావరణం ఊహించి అక్కడి మనుషులు, మనస్తత్వాలు, స్థలాలు వాటి ప్రాముఖ్యతలకు రూపకల్పన చేస్తూ పోయారు. చివరికి అదే మాల్గుడి పట్టణం అయ్యింది. ఆయన అక్కడక్కడ మాల్గుడి స్థల ప్రాశస్త్యాన్ని గురించి కూడా చెప్పారు. ‘వెయిటింగ్ ఫర్ మహాత్మా’ నవలలొ మాల్గుడిని మహాత్మాగాంధీ దర్శిస్తారని ‘భారతి’ అనే మహిళ ఎదురు చూస్తూ ఉంటుంది. స్వాతంత్ర్యోద్యమం సాగుతున్న దశలో మహాత్ముడికోసం ఎదురు చూసే ‘భారతి’ ఎవరో మనం సులభంగానే ఊహించుకోవచ్చు. బుద్ధుడు తన పర్యటనలో భాగంగా మాల్లుడికి వచ్చాడని, శ్రీరామచంద్రుడు కూడా అరణ్యమార్గాన లంకవైపు సాగిపోతూ మాల్గుడి మిదిగానే వెళ్ళాడని కూడా రాశారు. ఇటు పురాణాలు, అటు చారిత్రకాంశాలు చర్చించడం వల్ల పాఠకులు మాల్గుడి అనే పట్టణం నిజంగానే ఎక్కడో ఉందని భ్రమించారు. ఆర్.కె. నారాయణ్ రచనలపై పరిశోధనలు చేసిన డా. జేమ్స్ యం. ఫిన్నెల్లీ ఆయన రచనల్లోని అనేక అంశాలు క్రోడీకరించి మాల్గుడి పట్టణానికి ఒక ‘‘ఊహాచిత్రం’’ కూడా తయారు చేశాడు.
స్వాతంత్ర్యానంతరం దేశంలో మారిన పరిస్థితుల్ని ఆర్.కె. నారాయణ్ తన మాల్గుడి పట్టణంలో కూడా ప్రతిఫలింపజేశారు. ఆ రోజుల్లో బ్రిటీష్ వారి విగ్రహాలు తొలగించడం, రహదారుల పేర్లు మార్చడం జరిగాయి. మాల్గుడిలో ఎప్పటి నుంచో ఉన్న ఫెడరిక్ లాలే విగ్రహాన్ని తొలగించడం…తర్వాత హిస్టారికల్ సొసయిటీలు కొన్ని ముందుకొచ్చి, ఆయన స్వాతంత్ర్యానికి దోహదం చేసిన ఆంగ్లేయుడని, భారతీయుల మిత్రుడని, ఆయన విగ్రహం తొలగించడం సరి కాదని వాదిస్తాయి. ఆర్.కె. నారాయణ్ సృజనాత్మక రచనల్లో ఇలాంటి అంశాలన్నీ పరిశీలించి గ్రహంగ్రీన్ ‘‘మాల్గుడివంటి ఊహాజనితమైన పట్టణం ప్రపంచ సాహిత్యంలో మరొకటి లేదని’’ కితాబిచ్చాడు. విలియం ఫాక్ నర్ కూడా తన రచనల్లో యోక్నాపటవ్ ఫా దేశాన్ని, అందులో బట్టర్ సీ, ఈస్టన్ రోడ్ వంటి వాటిని కల్పించి రాశారు. అయితే, వాటికన్నా ఆర్.కె. నారాయణ్ సృష్టి మాల్గుడియే అన్ని రకాలుగా క్షుణ్ణంగా చిత్రితమైందని ప్రపంచ సమీక్షకులు అభిప్రాయపడ్డారు.
Also read: శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు
సాహిత్యం: ఆర్.కె. నారాయణ్ తన ఇరవైతొమ్మిదో ఏట 1935లో తొలి నవల ‘స్వామినాథన్ అండ్ తాటె’ రాశారు. స్క్రిప్టు ఆక్స్ ఫర్డ్ లో ఉన్న ఒక మిత్రుడికి పంపారు. ఆ మిత్రుడు దాన్ని అక్కడున్న నవలారచయిత గ్రహంగ్రీన్ కిచ్చాడు. అది చదివి గ్రీన్ దక్షిణ భారతంలో మాల్గుడిలోని జనజీవితం, మనస్తత్వాలు అద్భుతంగా చిత్రితమైనాయని ప్రశంసించాడు. అంతేకాదు. అది అక్కడ ప్రచురణ కావడానికి సిఫారస్ చేశాడు. నవల పేరు ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ గా మార్చాడు. పైగా రచయితకు ఒక సూచన చేశాడు. ‘‘రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి’’ పేరుతో ప్రచురిస్తే జనంలోకి పోవడం కష్టమని, రచయిత పేరు బాగా సంక్షిప్తం చేయాలనీ చెప్పాడు. ఆ విధంగా ఆర్.కె. నారాయణ్ పేరు స్థిరపడింది. భారత దేశం తలెతి చెప్పుకోతగ్గ గొప్ప సృజనకారుడి పేరుగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది.
‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ తర్వాత వెలువడ్డ ‘ద బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’ 1937- ‘ద ఇంగ్లీష్ టీచర్’ 1945 అనే రెండు నవలలతో కలిపి ఆయన ఆత్మకథ ఆదారంగా వెలువడ్డ ట్రైయోలజీ అయ్యాయి. ‘ద డార్క్ రూం’ 1938-‘మిస్టర్ సంపత్’ 1948- ‘ద ఫైనాన్సియల్ ఎక్స్ పర్ట్’ 1952- ‘ద టైగర్ ఆఫ్ మాల్గుడి’ 1983 వంటివి కొన్ని ముఖ్యమైన నవలలు పదిహేను దాకా ప్రకటించారు ఆర్.కె! మాల్గుడి డేస్ 1942- ‘లాలిరోడ్ అండ్ అదర్ స్టోరీస్’ 1956- ‘ద హార్స్ అండ్ టూ గోట్స్’ – – 1970- ‘ద బ్యానియన్ ట్రీ అండ్ అదర్ స్టోరీస్’ 1885 – వంటి కథా సంపుటాలు ఆరు ప్రకటించారు. రామాయణ, మహాభారత గ్రంథాల నుంచి తీసుకున్న కథలు మూడు సంకలనాలు వెలువడ్డాయి. ‘ద డేట్ లెస్ డైరీ’ 1960 – ‘మై డేస్’ 1974 – ‘ఎ రైటర్స్ నైట్ మేర్’ 1988 వంటి ఇతర గ్రంథాలు మరో ఆరు వెలువడ్డాయి. సాహత్య అకాడెమీ అవార్డు పొందిన ‘ద గైడ్’ నవల హిందీ చలన చిత్రంగా విజయవంతమైంది. కథకు ఫిలింఫేర్ అవార్డు అందింది. ‘ ద గైడ్’ చిత్రం ఇంగ్లీషులో కూడా వెలువడింది. స్క్రిప్టు రాయడానికి పెరల్స్ బక్ భారతదేశం వచ్చి దేవానంద్ కు సహాయపడ్డారు.
Also read: మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్
విదేశీ విమర్శకుల శ్రద్ధాసక్తులు
దేశ విదేశాల్లోని సమీక్షకులు, విమర్శకులు ఆర్.కె. నారాయణ్ ను ఎంతో సీరియస్ గా చదివారు. యూరోపియన్ దేశాల రచయితల కిచ్చిన స్థాయిని, గౌరవాన్ని ఇచ్చారు. ఊహాజనితమైన పట్టణాన్ని సృష్టించినందుకు విలియం ఫాక్నర్తో పొల్చినట్టుగానే, కథానికా శిల్పంలో ఈయనను గైడి మపాసా తో పోల్చారు. గ్రహంగ్రీన్ ఈయనను ఇండియన్ చెహోవ్ అన్నారు. ‘ద న్యూయార్కర్’ పత్రిక ఈయన రచనల్లోని వాస్తవికత నొకోలయ్ గొగోల్ వాస్తవికతను తలపిస్తోందని రాసింది. పులిట్జర్ ప్రైజ్ స్వీకరించిన జంపా లహరి నారాయణ్ కథల్ని ఓ హెన్రీ కథలతోనూ, ఫ్రాంక్ ఒ కొన్నర్, ఫ్లాన్నరీ ఓ కొన్నర్ కథలతోనూ పోల్చారు. 1938లో సోమర్ సెట్ మామ్ మైసూరు వచ్చినప్పుడు ఆర్.కె. నారాయణ్ ను కలవాలనుకున్నారు. అప్పటికి ఆయన దేశంలో ప్రసిద్ధుడు కాలేదు. ఎవరూ సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆయన కలవలేకపోయారు. తర్వాత ఆర్.కె. నవల ‘ ద డార్క్ రూం’ చదివి అమోఘంగా ప్రతిస్పందిస్తూ వివరంగా ఉత్తరం రాశారు. అలాగే సమకాలీనుడైన ఇ.యం. ఫాస్టర్, ఆర్కే నారాయణ్ సున్నిత హాస్యంతో కథ నడిపించే తీరును ఇష్టపడ్డాడు. కొందరు విమర్శకులు అందుకే ఈయనను ‘‘దక్షిణభారత ఇ.యం. ఫాస్టర్’’ అని అన్నారు.
ఇవన్నీ అవుతూ ఉండగానే అమెరికాలో నారాయణ్ పేరు క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఫెలోషిప్ తో మొదటిసారి అమెరికా వెళ్ళిన నారాయణ్ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ బర్క్ లీలలో తన సాహిత్య ప్రసంగ పరంపరను కొనసాగించారు. ఆ సమయంలోనే జాన్ ఉప్ డైక్ నారాయణ్ ను చార్లెస్ డికెన్స్ తో పోల్చాడు. ఇవి ఇలా నడుస్తూ ఉండగా ఇండియన్ ఇంగ్లీషు రచయితలు శశిథరూర్, శశి దేశ్ పాండేలు ఆయన స్థాయి తగ్గిస్తూ విమర్శలు చేశారు. కాని, వాటిని ఎవరూ పట్టించుకోలేదు. దేశంలోని రాజకీయాలను, సమస్యలను ఆర్కే స్పృశించలేదని అన్నారు వి. యస్. నైపాల్. ‘మాడ్రన్ సౌత్ ఏసియన్ లిటరేచర్’ పుస్తకంలో పాల్ బ్రెయిన్స్ నారాయణ్ పూర్తిగా బ్రిటిష్ పాలనలో ఉన్న భారత దేశాన్ని, ఆ నాటి సమస్యల్ని విస్మరించిన విషయం లేవనెత్తారు.
Also read: జీవ-జీవన రహస్యాలు
హిందూ కుటుంబాల సంక్లిష్టతల్ని వర్ణించిన రచయిత
ఆర్.కె. నారాయణ్ జీవితకథ రాసిన విలియంవాల్ష్ గాని, వైట్ మాసన్ గాని, ఎడ్మండ్ విల్సన్ గాని చెప్పింది ఒకటే. తమకు దక్షిణ భారత దేశపు హిందూ కుటుంబాలలోని సంక్లిష్టతల్ని సరళంగా తొలిసారి చెప్పినవాడు ఆర్కే నారాయణ్ అని, ఆయన బ్రిటీష్ ఇండియా గూర్చి న్యూస్ రిపోర్టులు, సంపాదకీయాలు రాయలేదని…ఆ ప్రభావం జనసామాన్యంపై ఎలా పడిందో దాన్ని మాత్రమే రాశారని, నేరుగా రాజకీయాలు చర్చించడం రచయితలకు తప్పనిసరి కాదని అన్నారు. వ్యక్తుల మనస్తత్వాలు, మూఢనమ్మకాలు, చాదస్తాలు వివరిస్తూ జీవన సరళిని ప్రతిభావంతంగా చిత్రించారని అన్నారు. అర్కే నారాయణ్ తన అనుభవాల్ని, అనుభూతులను మాత్రమే తన పాత్రల ద్వారా వ్యక్తీకరించారని, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ప్రశంసించారు.
వ్యక్తిత్వం: ఆర్.కె. నారాయణ్ 10 అక్టోబర్ 1906న మదరాసులో జన్మించారు. తండ్రి ప్రధానోపాధ్యాయుడు కావడం వల్ల కొంతకాలం తండ్రి పాఠశాలలోనే చదువుకున్నాడు. కాని, మాటిమాటికి తండ్రికి బదిలీ అవుతూ ఉండడం వల్ల పెల్లవాణ్ణి వాళ్ళ అమ్మమ్మ పార్వతి దగ్గర ఉంచారు. ఆమె ఇతణ్ణి ‘కుంజప్పా’ అని పిలుచుకునేది. లెక్కలు, పురాణాలు, శాస్త్రీయ సంగీతం, సంస్కృతం వంటివి నేర్పేది. ఆ తరువాత మద్రాసు పురసవాకంలోని లూధ్రన్ మిషన్ స్కూల్, సిఆర్సి హైస్కూల్, క్రిస్టియన్ కాలేజీ హైస్కూల్ లలో చదువుకున్నాడు. తర్వాతి కాలంలో వారి కుటుంబం మద్రాసు నుండి మైసూరుకు మారడం వల్ల ఆర్.కె. నారాయణ్ మహారాజా కాలేజియేట్ హైస్కూల్ లో చేరాడు. తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ మైసూర్ లో చదివి డిగ్రీ పూర్తి చేశాడు.
Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి
స్కూలు దశలోనే సృజనాత్మక రచనల చదువు
హైస్కూల్ నుండే సృజనాత్మక రచనలు చదవడం అలవాటైన కారణంగా చదువుమీద ధ్యాస ఉండేది కాదు. ప్రియూనివర్సిటీలో ఒక సారి, డిగ్రీలో ఒకసారి పరీక్ష తప్పడం వల్ల రెండేళ్ళ చదువు పోయింది. మధ్యలో దొరికిన కాలాన్ని ఆయన వృధా చేయలేదు. డికెన్స్, ఉడ్ హౌస్, థామస్ హార్డీ, ఆర్థర్ కోనన్ డైల్ వంటి రచయితల్ని క్షుణ్ణంగా చదివాడు. తను కూడా రచయితగా స్థిరపడాలని కలలు కన్నాడు. ఎం.ఎ. చదువుతూ కాలం వృధా చేయడం ఇష్టం లేక, స్కూలు టీచరై తీరిక వేళల్లో రచనలు చేయాలనుకున్నాడు. అలాగే స్కూలు టీచర్ గా ఉద్యోగంలో చేరాడు కూడా. కాని ఓ సారి ఆ స్కూలు హెడ్మాస్టరు తనని డ్రిల్ మాస్టర్ స్థానంలో విధులు నిర్వహించడమనడంతో కోపం వచ్చి ఉద్యోగం మానేశాడు. రాసుకోవడం తప్ప తను మరో మని చేయలేనన్న నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే తొలిసారి ఒక చిన్న పుస్తక సమీక్ష ప్రచురించాడు. ఇంగ్లీషు పత్రికలకు అప్పుడో కథ, అప్పుడో వ్యాసం రాస్తుండేవాడు. దానివల్ల డబ్బు లేవీ పెద్దగా రావని గ్రహించాడు. నవల రాయడం బావుంటుదని ఇరవై నాలుగవ యేట తొలి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ రాశాడు. అప్పుడే మాల్గుడి సృష్టి జరిగింది.
ఇరవై యేడవ ఏట పదిహేనేండ్ల రాజం ను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. కాని, ఆమె ఆరేళ్ళకే టైఫాయిడ్ తో చనిపోయింది. జీవితం అస్తవ్యస్తమైపోయింది. అప్పటికే పుట్టిన కూతురు హేమను పెంచడం ఎంతో కష్టమైంది. తర్వాత కాలంలో ఆమె కూడా కాన్సర్ తో చనిపోయింది. అయితే ఆయన చివరి దశలో హేమ కూతురు (మనుమరాలు) ఆయనకు అండగా నిలబడింది.
పత్రికా నిర్వహణ
ఆర్.కె. నారాయణ్ తన ముప్పయ్ నాలుగవ యేట ‘‘ఇండియన్ థాట్’’ అనే పత్రిక ప్రారంభించాడు. అది సంవత్సరం కన్నా నడవలేదు. కాని మనుమరాలు భువనేశ్వరి (మిన్నీ) ఇండియన్ థాట్ పబ్లికేషన్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో పని చేసిన ఆర్.కె. లక్ష్మణ్ వీరి సోదరులే!
తన యాభై అయిదవ ఏట 1961ల ‘‘ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి’’ నవల వెలువడే నాటికి ఆర్.కె. నారాయణ్ ధనిక రచయిత కాగలిగారు. మైసూర్ లో పెద్ద బంగళా, మెర్సిడిస్ బెంజ్ కారు స్వంతం చేసుకోగలిగారు. బహుశా రచయితగా అంత డబ్బు గడించడం ఏ భారతీయుడికీ సాధ్యం కాలేదు. అర్కే నారాయణ్ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయలేదు. ఇతరత్రా వ్యపారాలు చేయలేదు. కేవలం రచయితగానే శ్వాసించారు, జీవించారు. రచయితగానే ప్రపంచ దేశాలు పర్యటించారు. దేశంలో అత్యన్నత పౌరపురస్కారాలు పద్మభూషణ్, పద్మవిభూషణ్ స్వీకరించారు. ఎ.సి. బెన్సన్ మెడల్ వంటి అంతర్జాతీయ గుర్తింపులు సాధించారు. పలుమార్లు నోబెల్ కు నామినేట్ అయ్యి కూడా… నోబెల్ స్వీకరించని మహారచయితలలో ఒకరయ్యారు.
Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?
చివరి దశ చెన్నైలో
చివరి దశలో నారాయణ్ ఒంటరిగా మైసూరులో జీవించారు. ఒక ఎకరం పొలం కొని అందులో వ్యసాయం చేయించారు. కొనేది లేకపోయినా రోజూ పగలు మార్కెట్ కి వెళ్ళి అక్కడి జనంతో కలిసి, తిరిగి మాట్లాడుతూ ఉండేవారు. దేశకాల సమస్యల గూర్చి విషయ సేకరణే ఆయన ధ్యేయం! డెబ్బయ్ మూడవ యేట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పార్లమెంట్ మెంబర్ గా పూర్తికాలం ఉన్నారు. వయసు బాగా పైబడిన తర్వాత ఆయన మైసూర్ నుండి మకాం మార్చి చెన్నైలో కూతురు ఇంటికి దగ్గరగా ఉండేవారు. చివరి నవల ‘గ్రాండ్ మదర్స్ టేల్’ ఎనభై ఏడేళ్ళ వయసులో రాశారు. అది తన చిన్నతనంలో తన అమ్మమ్మ తనకు చెప్పిన కథ. ‘ద హిందూ’ దినపత్రిక సంపాదకుడు ఎన్. రామ్ దాదాపు రోజూ వచ్చి సాయంత్రాలు మాట్లాడి పోయేవారు. తొంభయ్ నాలుగవ యేట 13 మే 2001న చెన్నైలో కన్ను మూసిన ఆర్.కె. నారాయణ్, అంతిమ క్షణంలో వెంటిలేటర్ మీద వైద్యం స్వీకరిస్తూ కూడా… తను బాగుపడి త్వరలో మరో నవల ప్రారంభించాలని ఉత్సుకత ప్రదర్శించారు. ఇలాంటి వారి జీవితాల గురించి ఈ తరం రచయితలు, రాబోయే తరాల వారూ తప్పక తెలుసుకోవాలి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అనేక అంశాలు గ్రహించడానికి, అవలోకించుకోవడానికి తప్పక ఉపయోగపడతాయి.
Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్