Sunday, December 22, 2024

జగమెరిగిన ఆర్ కె లక్మణ్

(ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వేపు చూస్తుంది.  అక్టోబర్ 24 రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ గారి పుట్టినరోజు)

నాకు శ్రీ లక్ష్మణ్ కు అసలు వ్యక్తిగత పరిచయం లేదు. ఒకటీ రెండు సార్లు ఆయనని ప్రత్యక్షంగా చూసినా , చేతులు కట్టుకోడం, వంగి వంగి దణ్ణాలు పెట్టడం అంత సజావుగా చేతకాకపోవడం వలన ఆయనను దగ్గరగా చేరి అటువంటి దుస్సాహసానికి పూనుకున్నది లేదు. నాకు ఆయన పని పట్ల అంతులేని భక్తి ఉన్నది. ఆ కుంచె చెక్కిన బొమ్మల పట్ల కళ్ళు ఇంతింత పెద్దవిగా చేసుకుని చూసుకునే దిగ్భ్రమ ఉన్నది. అట్టి మహనీయుల జీవితం పట్ల వారు వేసిన దారి పట్ల, వారు నడిపిన పని పట్ల ఒక బాద్యత ఫీలయ్యే గుణం ఉన్నది. ఆ బాద్యతని హృదయానికి హత్తుకుని  ఆయన  జయంతి  సందర్భంగా ఆయన కథ చెబుతూ, ఆయన మాట్లాడిన కబుర్లు బోలెడును పంచుకునే పనే చేస్తాను.

Also read: రామభక్త బైబుల్

ఆరు సంవత్సరాల క్రితం తన తొంబై నాలుగేళ్ళ వయసులో లక్ష్మణ్ ఇక ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు, ఆ సమయంలో ఆయన గురించి వచ్చిన సమాచారం ఎంత చిన్నదయినా చదువుతూ ఉండేవాణ్ణి. ఆ చదువులో భాగంగా ఒక లెబనాన్ తో ఆయన సంభాషణ నాకు ఎంతగానో ఆసక్తి కలిగించింది, దానిని  ఒక జ్ణాపకంగా భద్రంగా గుండె పొరల కింద దాచుకున్నా. అది ఇదిగో ఇక్కడ .)

1975 జూన్ రోజులు. అనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో  ప్రధాని ఇందిరాగాంధీ దేశం లో అత్యవసర పరిస్తితి విధించారు . ఎమర్జెన్సీ లో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ మొదలైంది. వాటితో పాటే  నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్కమీద కాలు వేసి జారిపోయే ముతకహాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలిహాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధానిని కలిశా. ఈ సెన్సార్ షిప్ నుంచి నాకు మినహాయింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీలించి నా కార్టూన్లు బొత్తిగా  నిరపకారమని, నేను కార్టూన్లను  పత్రికలో నిరభ్యంతరంగా  ప్రచురించుకోవచ్చని అభయం ఇచ్చారు.  డిల్లి నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి  ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా  మూడవ రోజునుండి నా అసలు రంగు చూపించడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రేస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీ ని తూర్పార పట్టే కార్టూన్లు…. ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ  సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్  బరూవా- ఎమర్జెన్సి లని  కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్  సెగ బాగా  తగిలింది.  వి సి శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా  శుక్లాని తనదగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి  నానా చీవాట్లు పెట్టారు.  శుక్లా సరాసరి ఢిల్లి నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి.

Also read: మనిషి-పని

కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్ లో నేను ఉన్నాను . హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు, కనీసం నన్ను కూచోమని అన్నది కూడా లేదు, ఒకే మాట “ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు  గీస్తే  నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో, గెటవుట్”  చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా. నా కాళ్ళు గజ గజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలి పోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను ” ఈ  పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే  చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను. మా ఆవిడ తెగ సంతోషపడింది. ఎందుకు లెద్దు వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!.

సాయంకాలం ఆఫీస్ కు వెళ్ళి  దీర్ఘకాలిక సెలవుకు  దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట  మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము, మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్ గా జీవితాన్ని అస్వాదించాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీరకట్టు గురించి, నుదుటన దాల్చిన సింధూరం గురించి ప్రశ్నలు అడగడమే తరువాయి “మా  దేశం, మా  ప్రాచీన సంస్కృతి, మా  సంప్రదాయం’’ అంటూ రొమ్ము విరిచుకుని  వాళ్ళకు జవాబు ఇవ్వడంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు  మా సాయంకాలపు వ్యాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్ లో విశ్రాంతిగా కూర్చున్నాము . మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు ,  మాకు మాటా మాటా కలిసింది.  అతనికి లెబనాన్ లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది, ఆయన నన్ను అడిగాడు “ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?”

Also read: చివరి సంతకం

“నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికేయుణ్ణి.”

“ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?”

“రాస్తాను”

“మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు?  అది చాలా ముఖ్యమైన పని కదా?”

“మహాశయా, నేను వ్రాయను.  నేను కార్టూన్లు గీస్తాను”

“కార్టూన్లా! అంటే వ్యంగ చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ. ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?

“టైమ్స్ ఆఫ్ ఇండియా”

“టైమ్స్ ఆఫ్ ఇండియా నా! నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?”

“లక్ష్మణ్”

“వావ్! యూ సెడ్ ఇటా?”  నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరం లోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికి , ఇటు ఈ దేశానికి చెందని ఒక వ్యక్తి నోటినుండి నేను రోజూ వేసే కార్టూన్  శీర్షిక అతని నోటవెంట, అతని యాసలో…!

“మీకు ఎలా తెలుసు?”

“లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్‌ కె సింగ్ ఉంటారు. అతనికి నాకు పరిచయం. నేను  అతని వద్దకు వెళ్లినప్పుడల్లా  మీ కార్టూన్లు నాకు చూపిస్తారు.  చూపిస్తూ ఇలా అంటాడు  “ చూశావా మా ప్రజాస్వామ్యం గొప్పతనం? మా దేశంలో  అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు, అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్ కే లక్ష్మణ్  ఎమర్జెన్సీ లో కూడా అక్కడి రాజకీయనాయకుల డొక్కలు చింపుతున్నాడు. ఆ  నాయకులు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించడానికి తల ఒగ్గి ఉన్నారు., అదీ మా దేశమంటే! సారే జహాసే అచ్చ్చా….

దేవుడా! బహుశా  ఆ  కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్చని, మా కార్టూనిస్ట్ ల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్చని నిరూపించడానికి దేశం కానీ  ఒక దేశంలో వాటిని భద్రంగా ఉపయోగిస్తున్నారు, ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధారంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను, ఒక చూపుడు వేలు బెదరింపుకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకున్నాను.

కమల అడిగింది “ఎక్కడికి , హోటల్ రూం కా?”

“కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి”

Also read: అజిత్ భాయ్ సాబ్ అమర్ హై!

అన్వర్

Anwar
Anwar
బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles