ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అంతర్జాతీయ లోన్ యాప్ ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన తీరును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఆసక్తికరంగా వెల్లడించారు. లోన్ యాప్ కేసుల్లో అంతర్జాతీయ నిందితులను అరెస్టు చేయడం ఇదే తొలిసారి అని ఎస్పీ చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లా కడియం భాస్కరనగర్ కు చెందిన సురకాసుల హరికృష్ణ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. సొమ్ము చెల్లించనా.. నిర్వాహకులు హరికృష్ణ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆయన ఫోన్ కాంటాక్ట్ నెంబర్లు వారికి పంపగా అది చూసి హరికృష్ణ ఈనెల ఆరో తేదీన సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు ఆయన తండ్రి కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఢిల్లీకి చెందిన హరిఓం, బెంగుళూరుకి చెందిన మంజునాధన్ అని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో అంతర్జాతీయ ముద్దాయిలు మలేషియా చెందిన వారుగా గుర్తించి వారితో పోలీసులు ఆన్ లైన్ లో వారి సహచరులు లాగా నటిస్తూ 20 రోజులు చాట్ చేసి వారిని నమ్మించి భారత దేశానికీ రప్పించారు. రాజమహేంద్రవరం అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ ఎం రజని సౌత్ జోన్ డీఎస్పీ కె. శ్రీనివాసులు పర్యవేక్షణ లో పోలీసు అధికారులు, వారి సిబ్బంది ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా వచ్చిన మలేషియా దేశానికి చెందిన యాంగ్ లుయి క్సింగ్, చూ కాయ్ లున్, త్యాగరాజన్ కాశి అలియాస్ వినోద్ లను చెన్నై శివారు లో చాకచక్యం గా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, మద్యం బాటిల్, మలేషియా కరెన్సీ ,ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇంకనూ ఈ కేసు లో మలేషియా దేశస్తుడు రిచ్ మండ్ పరారీలో ఉన్నాడు.
ఈ ముఠా దక్షిణ ఆసియా దేశాలైన ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, తైవాన్, దుబాయ్, వియత్నాం దేశాలలో ఏజెంట్ లను నియమించుకుని వారి ద్వారా లోన్ యాప్ లు నిర్వహిస్తూ…రుణ గ్రహీతల ఫోటో లను న్యూడ్ ఫోటో లు గా మార్ఫింగ్ చేసి వారి వద్ద నుండి అధికం గా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ముఠా వేధింపులకు పదుల సంఖ్యలో వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.