Sunday, December 22, 2024

నదీజలాల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి

  • కృష్ణా, గోదావరీ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు సర్వాధికారాలు
  • రెండు రాష్ట్రాల మధ్య వివాదంపైన కేంద్రం నిర్ణయం అనుల్లంఘనీయం
  • కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు

పిట్టపోరూ, పిట్టపోరూ పిల్లి తీర్చిందని సామెత. కృష్ణానది జలాలలో ఎవరి వాటా ఎంత? ఫలానా ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? అక్రమంగా మీరు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు అంటే మీరు నిర్మిస్తున్నారు అని వాదులాడుకుంటున్న తెలుగు రాష్ట్రాల నాయకులకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ తీర్పు చెప్పింది. మీరిక కొట్టువలసిన పని లేదు మేము ఎట్లా చెబితే అట్లా నడుచుకోండంటూ సుద్దులు చెప్పింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. కృష్ణా జలాలకూ, కృష్ణానదిపైన నిర్మించిన ఆనకట్టలకూ, జలాశయాలకూ, విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి బోర్డుకు సకల అధికారాలు ఉంటాయని ఒక నోటిఫికేషన్ లోనూ, అదే విధంగా గోదావరి నదీ జలాలకూ, ప్రాజెక్టులకూ, ఆనకట్టలకూ సంబంధించి ఆ బోర్డుకు సకల అధికారాలూ ఉంటాయని రెండో నోటిఫికేషన్ లోనూ స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య రెండు మాసాలుగా చెలరేగిన వివాదాలకు తెర దించుతూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నదీ జలాల వాటాలు తేల్చకుండా పాత వాటాల ప్రకారం పంపిణీ చేస్తానంటూ నోటిఫికేషన్ జారీ చేస్తే ఎట్లా కుదురుతుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రశ్నించారు. కృష్ణా ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేయాలనీ, దానిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ట్రిబ్యూనల్ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదనీ, దానికి సమయం పడుతుందనీ జల్ శక్తీ మంత్రివర్గానికి చెందిన అధికారులు చెప్పారు.

అనుమతులు లేని ప్రాజెక్టుల పనుల నిలిపివేత

అనుమతులు లేకుండా పనులు జరుగుతున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని రెండు నదలు బోర్డులూ ఆదేశాలు జారీ చేశాయి. జలవిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం కూడా నిలిపివేయాలని ఆదేశించాయి. ఇవి జైలై 15 నుంచీ, అంటే గురువారం నుంచే అమలులోకి వస్తాయని చెప్పాయి. అన్ని ప్రాజెక్టులపైన సమగ్ర నివేదికలను (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ – డీపీఆర్) సమర్పించి, జలవనరుల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించుకోవాలని చెప్పింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు రావలసి ఉంది. ఆంధ్రలో రాజోలిబండ డైవర్షన్ ప్రాజెక్టుకు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను సమర్పించలేదని బోర్డు సభ్యుడే చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నీటి కేటాయింపులు జరిగేవి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు నీటి పంపిణీ జరిగేది. 1976లో బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలవారీగా నీటిని కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల కృష్ణానది నీరు ప్రత్యేకించింది. బచావత్ ట్రిబ్యూనల్ గడువు 2001తో ముగియడంతో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ ను 2004లో నియమించారు. ఆ ట్రిబ్యూనల్ 2013లో అవార్డు ప్రకటించబోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ కారణంగా  రేపు ఈ బోర్డులు కూడా బచావత్ అవార్డునే అమలు చేయబోతున్నాయి. పూర్తిగా కృష్ణానది బేసిన్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీల నీరు వినియోగించుకునే  హక్కు ఉంటే బేసిన్ వెలుపల ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీరు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణలోని ప్రాజెక్టులను సర్వేల పేరుతో పెండింగ్ లో పెట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాల్వ, కుడి కాల్వల వంటి పథకాలను శరవేగంగా అమలు జరిపారని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి విమర్శించారు. బచావత్ అవార్డ ప్రాజెక్టుల ప్రాతిపదికగా నీటిని కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తే ప్రాజెక్టుల ప్రాతిపదికన కాదనీ, రాష్ట్రాల ప్రాతిపదికనే కేటాయింపులు జరిగాయనీ బచావత్ అవార్డు పూర్తి పాఠంలో ఇందుకు సంబంధించిన అంశాలను ఉటంకిస్తూ తెలంగాణ ఇంజనీర్లు వాదిస్తున్నారు.

బచావత్ ట్రిబ్యూనల్ లెక్క ప్రకారం అయితే తెలంగాణ, సీమాంధ్రలకు 37:63 నిష్పత్తిలో కృష్ణానది నీరు పంపిణీ జరగాలి.  కానీ వాస్తవంగా జరిగింది 34:66 నిష్పత్తిలో.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల ఫలితంగా రెండు ప్రధాన నదుల కిందా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మొత్తం 107 ప్రాజెక్టులు ప్రత్యక్షంగా రెండు నదుల బోర్డుల పరిధిలోకీ, పరోక్షంగా కేంద్రం అజమాయిషీలోకీ పోతాయి. కృష్ణానది బోర్డు పరిధిలో 36 ప్రాజెక్టులూ, గోదావరి నది బోర్డు పరిధిలో 71 ప్రాజెక్టులూ ఉంటాయి. మొత్తం ప్రాజెక్టులలో 79 తెలంగాణలోనూ, 15 ఏపీలోనూ, 13 ఉమ్మడిగానూ ఉన్నాయి. కాళేశ్వరం వంటి భారీ బహుళార్థసాధక ప్రాజెక్టులు కూడా కేంద్రం చేతుల్లోకి పోతాయి.

పునర్విభజన చట్టం ప్రకారమే చేశాం

పునర్విభజన చట్టానికి లోబడే ఈ గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేశామంటూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారమే 2 జూన్ 2014న కృష్ణ, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశామనీ, ఆ చట్టాన్ని అనుసరించే ఇప్పుడు నోటిఫికేషన్లు కూడా జారీ చేశామనీ అంటున్నారు. ఉభయ రాష్ట్రాల వాదనలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నోటిఫికేషన్ తయారు చేశామని చెబుతున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బాద్యతా ఇకమీదట బోర్డులదే. కృష్ణ, గోదావరి నదులపైన నిర్మించిన బరాజ్ లూ, డ్యామ్ లూ, జలాశయాలూ, నియంత్రణ వ్యవస్థలూ, కాల్వల నెట్ వర్క్ వంటి అన్ని వ్యవస్థలూ బోర్డుల పరిధిలోకి వస్తాయని గెజిట్ నోటిఫికేషన్లు స్పష్టం చేశాయి.  2014 విభజన చట్టంలోని 85వ సెక్షన్ కింద లభించిన అధికారాలు ఉపయోగించే ఈ నోటిఫికేషన్లు జారీ చేశామని కూడా అధికారులు చెప్పారు. ఆ చట్టం మేరకే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి  రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రెండు బోర్డుల పరిధిని ప్రకటించే విషయంలో రెండు రాష్ట్రాలమధ్య విభేదాలు రావడంతో వాయిదా వేశామనీ, నిరుడు అక్టోబర్ లో జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ అధ్యక్షతన జరిగిన రెండవ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తున్నది.

నదీజలాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. వాటిని ఉమ్మడి జాబితాలోకి తీసుకువెళ్ళాలనే వాదన చాలా కాలంగా ఉంది. భూమి, విద్య, వ్యవసాయం వంటి మౌలికమైన అంశాలతో పాటు నీరు కూడా రాష్ట్రాల జాబితాలో ఉండాలని రాజ్యాంగనిర్మాతలు భావించారు. కానీ కావేరి, కృష్ణ,గోదావరి వంటి నదుల నీటి వాడకంపైన రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినాయి. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో చేశారు. దాని కిందే ట్రిబ్యూనళ్ళను నియమించడం, అపెక్స్ కౌన్సిల్ ను నియమించడం వంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారు. కానీ వివాదాలు పరిష్కరించడానికి వీలుగా కేంద్రం జోక్యం చేసుకోవడానికి అనువుగా ఉమ్మడి జాబితాలో జలవనరులను చేర్చాలని 2011 లో అశోక్ చావ్లా కమిటీ సిఫార్సు చేసింది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అటువంటి సిఫార్సు చేసింది. కానీ పరోక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయనీ, న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే అధికారాలు ఎలాగూ ఉన్నాయి. అందుకని కేంద్రం నీటి వనరులను ఉమ్మడి జాబితాలో చేర్చే ఉద్దేశం లేదని పార్లమెంటులో ఫిబ్రవరి 2020లో ప్రకటించింది.

సమాఖ్యస్ఫూర్తికి భంగం

ఇప్పుడు కృష్ణ జలాల బోర్డులో కానీ, గోదావరి జలాల బోర్డులో కానీ తెలుగువారు ఎవ్వరూ నిర్ణాయక స్థానంలో ఉండరు. తెలుగేతర అధికారులు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలి. తెలుగేతర అధికారులను ‘పట్టుకోవడానికి’ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి. రాజకీయ నాయకులకైతే జవాబుదారీతనం ఉంటుంది. అధికారులకు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శించి ఉంటే బోర్డులు చెప్పినట్టు వినవలసిన అగత్యం ఉండేది కాదు. ముఖ్యమంత్రులు సయోధ్యకోసం ప్రయత్నించలేదు కనుకనే హస్తిన చెప్పినట్టు విని ‘జోహుకమ్’ అనవలసి వస్తున్నది. రాజ్యాంగ నిర్మాతలు అపేక్షించిన సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నది.

విధులనూ, అధికారాలనూ కేంద్రీకృతం చేయడానికి కేంద్రం విముఖంగా ఏమీ లేదు. వాస్తవానికి అవకాశం ఉన్న ప్రతి చోటా కేంద్రీకృతం చేయడానికీ, సమాఖ్య స్ఫూర్తిని పాతర వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నది. తాజాగా రాష్ట్ర జాబితాలో ఉన్న సహకారంపైన కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానిని అమిత్ షాకి అప్పగించారు. ఈ విషయం ప్రశ్నించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శరద్ పవార్ ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. సహకార రంగంలో కేంద్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పవార్ ప్రధానిని హెచ్చరించారు. అవసరం లేని చోట చట్టాలు చేయకుండానే అధికారాలను గుప్పెటలో తీసుకోవడానికి కేంద్రం వెనుకంజ వేయడం లేదు.

కేంద్రం చేతుల్లోకి అధికారం

కేంద్రం చేతుల్లోకి జలవనరులు పోతే రాష్ట్రాలకు నష్టం ఏమిటి? రాష్ట్రాల ఇష్టాయిష్టాలకు నీటివనరులను వదిలివేస్తే అనుమతులు కూడా పొందకుండా చిత్తం వచ్చినట్టు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. పొరుగురాష్ట్రాలతో పేచీలు పెట్టుకుంటున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉమ్మడి ప్రాజెక్టుల దగ్గర పోలీసు నిఘాను ఏర్పాటు చేస్తున్నాయి. మొన్న జగ్గయ్యపేట శాసనసభ్యుడు ఉదయభాను పులిచింతల ప్రాజెక్టు పవర్ హౌస్ ను చూడటానికి వెడితే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పడవలో ప్రయాణం చేసి దొడ్డిదారి గుండా ప్రాజెక్టును చేరుకున్నారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా ముదిరితే అంతర్యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. అందుకని కేంద్రం అజమాయిషీలో ఉండటమే క్షేమదాయకం అని వాదించేవారు ఉన్నారు. ఇది నాణేనికి ఒక వైపు.

నాణేనికి రెండో వైపు కూడా అంత సంతోషకరంగా ఏమీ ఉండదు. కేంద్రం చెప్పుచేతలలో జలవనరులు ఉంటే రాష్ట్రాలు కూడా కేంద్రం అదుపులోనే ఉండవలసి వస్తుంది. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించే రాష్ట్రాలకే కేంద్రం సుముఖంగా ఉంటుంది. ఈ విషయం టీకాల పంపిణీ వంటి చిన్న విషయంలో సైతం కేంద్రం వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తున్నది. ఉదాహరణకు కృష్ణాజలాలలో తెలంగాణకి తగిన వాటా రావాలంటే టీఆర్ఎస్ ఎన్ డీ ఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి. లేకపోతే నీటివాటాలో అన్యాయం జరిగే అవకాశం ఉంది. సమాఖ్య వ్యవస్థను కోరుకోవడంలో ఉద్దేశం వివిధ పార్టీలు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలలో సమతౌల్యం దెబ్బతినకుండా ఉండాలని కొన్ని అంశాలను రాష్ట్ర జాబితాలోనూ, కొన్నింటిని ఉమ్మడి జాబితాలోనూ,  మరికొన్నింటిని కేంద్ర జాబితాలోనూ పేర్కొన్నారు. గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం రెండురాష్ట్రాల మధ్య తగాదా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయం అనుల్లంఘనీయమనీ, కోర్టులు సైతం అందులో జోక్యం చేసుకోవడానికి లేదనీ ఉన్నది. కేంద్రానికి అవధులు మీరిన అధికారం ఇస్తున్నది. ఇది సమాఖ్య వ్యవస్థకు ఏ మాత్రం ఆరోగ్యప్రదం కాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles