వోలేటి దివాకర్
- రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతు బీజేపీకేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ ఢిల్లీ స్థాయిలో అధికార బీజేపీతో దోస్తీ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, వైసీపీ పార్టీలు తీవ్రంగా ప్రత్నిస్తున్నాయి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా వైసీపీ, పరోక్షంగా టీడీపీ సహకారాన్ని అందిస్తాయి. తాజాగా దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రపతి ఎన్నికలపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు ఈమేరకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.
Also read: ఆత్మస్తుతి … పరనింద … ఇదే మహానాడు!
విజయానికి అడుగు దూరంలో బీజేపీ
రాష్ట్రపతి ఎన్నికలు జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈమేరకు ఈనెల 2వ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి తన అభ్యర్థికి కావాల్సిన ఓట్లకు బీజేపీ కనీసం 1.2 శాతం ఓట్ల దూరంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2017 రాష్ట్ర ఎన్నికల తర్వాత వచ్చిన దానితో పోలిస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలలో బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినందున ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీ, బిజేడీ ఓట్లు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే టీఎంసీ, ఆప్, టీఆరెస్ పార్టీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
Also read: సరిగ్గా వినిపించని సామాజిక న్యాయభేరి! ఎందుకంటే ….
ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీలో 4 శాతం ఓట్లు ఉన్న వైసీపీ, 3 శాతం ఓట్లు ఉన్న బీజేడీ కీలకంగా మారనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఐదింటిలో నాలుగు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకున్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికలు ఆపార్టీ కి అంత ఈజీగా లేవు.
ఇదే విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, దేశవ్యాప్తంగా మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా లేనందున రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం బిజెపికి అంత సులభం కాదని అన్నారు.
2017లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి కోవింద్, అప్పటి బీహార్ గవర్నర్, ప్రతిపక్ష అభ్యర్థి మరియు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌పై దాదాపు మూడింట రెండు వంతుల ఓట్లతో విజయం సాధించారు.
Also read: పవన్ పల్లకీని బాబు మోస్తారా?
ఒక్కో ఎమ్మెల్యే కు ఒక్కో విలువ… ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా భారతదేశ రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 లోక్‌సభ ఎంపీలు, 233 రాజ్యసభ ఎంపీ, 4,120 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉన్నాయి. పార్లమెంటులోని ప్రతి సభ్యునికి (MP), ఓటు విలువ 708గా నిర్ణయించబడింది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన ఎమ్మెల్యేల విలువ 208. ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 403 ఎమ్మెల్యేల మొత్తం విలువ 83,824. రాష్ట్రానికి చెందిన 80 మంది ఎంపీల మొత్తం ఓట్ల విలువ 56,640 కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీలు ,ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ 1.4 లక్షలకు చేరుకుంది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 12.7 శాతం.
నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత, వారి సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు వేయడానికి బ్యాలెట్ పత్రాలు (ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ) ఇస్తారు.
ఎక్కువ ఓట్లు వచ్చినా గెలిచినట్టు కాదు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినా గెలిచినట్టు కాదు. నిర్దిష్ట కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ప్రతి అభ్యర్థికి పోలైన, చెల్లుబాటు అయ్యే ఓట్ల మొత్తం విలువను లెక్కించిన తర్వాత, వాటిని 2తో భాగించి, ఆ భాగానికి ఒక దానిని జోడించడం ద్వారా నిర్ధిష్ట కోటా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు, అభ్యర్థులందరూ పోల్ చేసిన చెల్లుబాటు అయ్యే ఓట్ల మొత్తం విలువ 1,00,001 అయితే. ఎన్నిక కావడానికి అవసరమైన కోటా 1,00,001ని 2తో భాగించి, 1ని = 50,000.50+1కి జోడించడం ద్వారా చేరుతుంది (.50 అని పిలువబడే మిగిలినవి విస్మరించబడతాయి). ఆ విధంగా కోటా 50,000+1 = 50,001 అవుతుంది. కోటా కంటే ఎక్కువ ఓట్లు ఎవరికీ రాని పక్షంలో, అత్యల్ప ఓట్లు వచ్చిన అభ్యర్థి తొలగించబడతారు.
Also read: ప్రతిపక్ష పార్టీ కన్నా ఘోరమా? …. గడపదాటని వైసిపి శ్రేణులు!
వెంకయ్య నాయుడా…మరోసారి రామ్ నాథా?
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేరు రాష్ట్రపతి రేసులో బాగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌కు రెండవసారి అవకాశం ఇవ్వాలా వద్దా అనే దానిపై బిజెపి నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ఇప్పటి వరకు మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండుసార్లు ఎన్నికయ్యారు.
Also read: పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!