భారత సంతతికి చెందిన యువకుడు రిషీ సునాక్ బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇది రిషీ సునాక్ జీవితంలో గొప్ప మలుపు. అతడి ముందు ఒక అరుదైన అవకాశం, ఒక బ్రహ్మాండమైన సవాలు ఉన్నాయి. అరుదైన అవకాశం బ్రిటన్ కు ప్రధానమంత్రి కావడం. సవాలు అర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం. అతి పిన్న వయస్సులో బ్రిటన్ వంటి ప్రవృద్ధ ప్రజాస్వామ్య దశానికి సారథ్యం వహించే అత్యంత అరుదైన అవకాశం ఒక భారత సంతతి యువకుడికి వచ్చింది. భారత దేశానికి స్వాంతంత్ర్యం ఇవ్వాలని నాటి ప్రధాని అట్లీ తలపోసినప్పుడు మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఏమన్నారు? భారతీయులకు స్వపరిపాలన చేతకాదనీ, వారిలో అంత ఐకమత్యం, సామర్థ్యం లేవనీ వ్యాఖ్యానించారు. అటువంటి భారత దేశంలో స్వపరిపాలన డెబ్బయ్ అయిదు సంవత్సరాలుగా నిరవధికంగా సాగుతుండగా, ఇప్పుడ అదే భారత దేశంలో మూలాలు ఉన్న వ్యక్తి బ్రిటన్ ను పాలించబోతున్నాడు. ఇది ఎంతకాలం సాగుతుందన్నది అతని ప్రతిభాపాటవాలపైనా, ఆర్థిక పరిస్థితులపైనా, దేశ ప్రజల మనోభావాలపైనా ఆధారపడి ఉంటుంది. దానిపైనే మరో సంవత్సరన్నర తర్వాత రాబోయే ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధామూర్తుల కుమార్తె అక్షతకు రిషీ భర్త. బోరిస్ జాన్ సన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. 42 సంవత్సరాల యువకుడు రిషీ తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ కు వలసవచ్చిన భారతీయులకు పుట్టిన బిడ్డ. తండ్రి వైద్యుడిగానూ, తల్లి మెడకల్ షాప్ నిర్వాహకురాలుగానూ పని చేసేవారు.
కన్సర్వేటివ్ పార్టీ ప్రాథమిక సభ్యుల ఓటింగ్ లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం చెందిన రిషీ సునాక్ కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. బ్రిటన్ ఎదుర్కొంటున్నఆర్థక సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలన్న విషయంలో సునాక్ కూ, ట్రస్ కూ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. తన అభిప్రాయాలు పొరబాటువని తెలుసుకున్న ట్రస్ ఆరువారాల ప్రధానిమంత్రిత్వం తర్వాత పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత జరుగుతుందనుకున్న పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, మాజీ మంత్రి పెనీ మోర్డాంట్ తప్పుకున్న తర్వాత రంగంలో రిషీ సునాక్ ఒక్కరే మిగిలారు. ఆయన రెండు వందల ఏళ బ్రిటన్ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని అవుతారు.
ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరిస్తాననీ, పార్టీలో ఐకమత్యం పెంపొందిస్తాననీ, బ్రిటన్ కు మంచి పేరు తెస్తాననీ ఆదివారంనాడు రిషీ సునాక్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ వాగ్దానం చేశారు.