- రాజు చార్లెస్ నియామకం
- దేశాన్ని, పార్టీనీ ఐక్యంగా ఉంచుతానంటూ ప్రకటన
- బ్రిటన్ 200ఏళ్ళ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని
- తొలి హిందువు, తొలి భారత మూలాలు కలిగిన వ్యక్తి
బ్రిటన్ ప్రధానిగా రిషీ సనాక్ నియుక్తులైనారు. ఆయన మంగళవారంనాడు కింగ్ చార్లెస్ – 3ను కలుసుకున్నారు. రిషీని ప్రధానిగా నియమిస్తూ రాజు ఉత్తర్వులు జారీ చేసినట్టు రాజప్రాసాదం వెల్లడించింది. 42 ఏళ్ళ రిషి బ్రిటన్ రెండు వందల సంవత్సరాల చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కింది విధంగా అన్నారు.
‘‘ప్రస్తుతం మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. కోవిద్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభించిన యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు చితికిపోయాయి. నా కంటే ముందు ప్రధానిగా పని చేసిన లిజ్ ట్రస్ కు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమె చేసింది తప్పుకాదు. దేశ ఆర్థిక పరిస్థితిని పెంపొందించేందుకు తనదైన తీరులో ఆమె ప్రయత్నించారు. అది గొప్ప లక్ష్యమే. ఆమె లక్ష్యసాధనకు నిర్విరామంగా పని చేయడాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ కొన్ని పొరబాట్లు దొర్లాయి. బుద్ధిపూర్వకంగా, కావాలని చేసిన పొరపాట్లు కావు అవి. పూర్తిగా భిన్నమైనవి. అయినప్పటికీ జరిగినవి పొరపాట్లే. వాటిని సరిదిద్దడానికే నన్ను మీ ప్రధానిగా, మా పార్టీ నాయకుడుగా నియమించారు. ఆ పని వెంటనే మొదలయింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా, బాధ్యతాయుతంగా, నైపుణ్యంతో,జవాబుదారీతనంతో పని చేస్తుంది. విశ్వాసం ఒకరు ఇచ్చేది కాదు. ఎవరికి వారు సంపాదించుకోవాలి. నేనూ సంపాదించుకుంటాను. ప్రధానిగా అద్భుతంగా పని చేసిన బోరిస్ జాన్సన్ కు నేను ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను.’’
లిజ్ ట్రస్ 49 రోజుల ప్రధానిమంత్రిత్వం నేటితో ముగిసింది. సునాక్ విజయుడు కావాలని ట్రస్ అభిలషించారు. బ్రిటన్ మెత్తగా ఉండకుండా గట్టిగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైనదని ఆమె తన పదవికీ, టెన్, డౌనింగ్ స్ట్రీట్ లోని అధికార నివాసానికి వీడ్కోలు చెబుతూ అన్నారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన రాజకీయ నాయకురాలిగా ఆమె చరిత్రలో మిగిలిపోతారు.
మీడియా మద్దతు సునాక్ కు దండిగా ఉన్నది. కన్సర్వేటివ్ లను ప్రోత్సహించే సన్, డెయిలీ మిర్రర్ లు బ్రిటన్ కు మంచిరోజులు వచ్చినట్టు బ్యానర్లు పెట్టాయి. వామపక్షాలనూ, లేబర్ పార్టీనీ ప్రొత్సహించే గార్డియన్ సునాక్ ను అభినందిస్తూనే పార్టీ ఐక్యం కాకపోతే నాశనం అవుతుందంటూ కన్సర్వేటివ్ పార్టీ నాయకులకు సనాక్ చేసిన హెచ్చరికను ప్రధాన వార్తగా ప్రచురించింది.
సునాక్ ఎదుట రెండు బృహత్తరమైన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, దేశాన్నిఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవేయడం. రెండోది ముఠాబందీతో బలహీనమైన కన్సర్వేటివ్ పార్టీని ఐకమత్యంతో బలోపేతం చేయడం. రెండూ పెద్ద సమస్యలే. సునాక్ తన క్యాబినెట్ సభ్యులను ఎంపిక చేసుకోవాలి. బుధవారంనాడు ‘పార్లమెంటులో ప్రధానికి కొన్ని ప్రశ్నలు’ అనే కార్యక్రమంలో పాల్గొనాలి.
సనాక్ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తి విలువ 700మిలియన్ పౌండ్లు. ఆయన భార్య అక్షత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తిల కుమార్తె. అమెకు బోలెడంత సంపద వచ్చి పడింది. బ్రిటిష్ రాణి ఎలిజెబెత్ కంటే అక్షత సంపన్నురాలంటూ పత్రికలు ఘోషించాయి. ఇన్ఫోసిస్ షేర్ల ద్వారా డివిడెండ్ల రూపంలో వచ్చిన సంపదకు భారత పౌరురాలుగా ఉన్నఅక్షత పన్ను కట్టనక్కరలేదు. కానీ దీనిని ఒక వివాదంగా మీడియా, రాజకీయవర్గాలు పెంచిపోషించడంతో మిలియన్ల పౌండ్ల పన్ను కట్టడానికి అక్షత సంసిద్ధత వెలిబుచ్చింది. పన్ను చెల్లిస్తూనే ఉన్నది. పన్ను ఎగగొట్టడానికి ప్రయత్నించినట్టు మీడియా భాష్యం చెప్పింది కానీ నిబంధనల ప్రకారం అక్షత పన్నులు కట్టనవసరం లేదు. కానీ భావి ప్రధాని భార్యగా పన్నులు కట్టడమే మేలని ఆమె భావించారు. సునాక్ ను చూసి తాము గర్విస్తున్నామనీ, అతడు విజయాలు సాధించాలని కోరుతున్నామనీ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. సనాక్, అక్షతలకు ఇద్దరు కుమార్తెలు. పంజాబీ మూలాలు కలిగిన సునాక్ హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. సోమవారం దీపావళి సందర్భంగా ఇంట్లో ప్రమిదలు వెలిగించారు. కృష్ణాష్టమి సైతం సందడిగా జరుపుకుంటారు. గోవులను పూజిస్తారు. పార్లమెంటు సభ్యుడుగా భగవద్గీతపైన ప్రమాణం చేశారు.
జాత్యహంకారానికి పెట్టింది పేరుగా ఉండే బ్రిటిషర్లు ఆ చెడ్డపేరును రూపుమాపుకొని మైనారిటీ మతస్తుడైన హిందువుని దేశ ప్రధానిగా ఎన్నుకోవడం విశేషం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తిరువనంతపురం
లోక్ సభ సభ్యుడు శశిథరూర్ బ్రిటన్ పౌరులు తమ జాతివివక్ష విధానాలను అధిగమించారనీ, ఆ పని భారత్ లో చేయగలమా అనీ ప్రశ్నించారు. 1998లో, 2004లో సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవీబాధ్యతలు స్వీకరించే ప్రయత్నం చేసినప్పడు బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చేసిన హడావుడి,బెదిరింపులు, ధర్నా చేస్తానని హెచ్చరించడం తదితర ఘటనలను శశిథరూర్ గుర్తు చేశారు.