- గాల్లో తేలిపోతున్న యంగ్ గన్
- అయ్యర్ కు గాయంతో పంత్ కు లైన్ క్లియర్
భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పట్టిందల్లా బంగారంలా మారిపోతోంది. ఆస్ట్ర్రేలియాపర్యటన నుంచి క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అంచనాలకు మించి రాణిస్తూ భారత జట్టుకు కీలకంగా మారిన పంత్ కేవలం 21 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు.
అయ్యర్ గాయం,పంత్ కు వరం…
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడుతూ స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడడంతో టీమ్ మేనేజ్ మెంట్ జట్టు పగ్గాలను రిషభ్ పంత్ చేతికి ఇస్తున్నట్లు ప్రకటించింది.భుజం గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారమంతా సూపర్ ఫామ్ లో ఉన్న రిషభ్ పంత్ పైన పడింది.ఏప్రిల్ 9 నుంచి జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ టోర్నీలో తమజట్టుకు రిషభ్ పంత్ నాయకత్వం వహిస్తాడంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: కరోనాకి క్రికెట్ మాస్క్ బయోబబుల్
రిషభ్ పంత్ హ్యాపీ….
ఆరేళ్ల క్రితమే తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ఢిల్లీ నుంచే ప్రారంభించానని, అదే ఢిల్లీ జట్టుకు తాను నాయకత్వం వహించడం నిజంగా అదృష్టమని, తనకల ఇంత తర్వగా నిజమవుతుందని అనుకోలేదని రిషభ్ పొంగిపోతున్నాడు.గత సీజన్ పైనల్లో ముంబైతో జరిగిన పోరులో రిషభ్ పంత్ అర్థశతకం బాదినా తనజట్టును విజేతగా నిలుపలేకపోయాడు.
ఐపీఎల్ లో ధూమ్ ధామ్ బ్రాండ్ క్రికెట్ ఆడే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ నాయకత్వం వహించబోతున్నాడని, అతని కెప్టెన్సీలో ఢిల్లీ అంచనాలకు మించి రాణించాలని కోరుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సహయజమాని పార్థా జిందాల్ ఓ సందేశం పంపారు.అంతేకాదు తాను భుజం గాయంతో జట్టుకు దూరమయ్యానని, తన స్థానంలో కెప్టెన్ గా రిషభ్ పంతే తగిన ఆటగాడంటూ శ్రేయస్ అయ్యర్ సైతం ఓ సందేశం పంపాడు.
Also Read: మహిళా టీ-20లో భారత బుల్లెట్
పంత్ పై పాంటింగ్ భరోసా…
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గత రెండు సీజన్లుగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన నాయకత్వం అందించాడని, జట్టు సాధించిన ఫలితాలే దానికి నిదర్శనమని, 13వ సీజన్ రన్నరప్ గా తమజట్టు నిలిచిందని చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ గుర్తు చేశారు. తన కెరియర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్న రిషభ్ పంత్ కు జట్టు పగ్గాలు అందించడం సముచితమైన నిర్ణయమని పాంటింగ్ ప్రకటించాడు.
చిన్నవయసులోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రిషభ్ పంత్ ను వెతుక్కొంటూ వచ్చిందని, ఈ అవకాశాన్ని రిషభ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలడన్న నమ్మకం తనకు ఉందని పాంటింగ్ తెలిపాడు.బాధ్యతలు అప్పజెపితే అత్యుత్తమంగా రాణించడంలో రిషభ్ పంత్ తర్వాతే ఎవరైనా అంటూ ఢిల్లీ ప్రధానశిక్షకుడు కితాబిచ్చాడు.గత ఏడాది ఫైనలిస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత సీజన్లో తన ప్రారంభమ్యాచ్ ను ముంబై వేదికగా ఏప్రిల్ 10న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.
Also Read: విజయం మాది…అవార్డులు వారికా?