- నాలుగో ర్యాంక్ కు పడిన విరాట్ కొహ్లీ
- టాప్ – 10లో పూజారా, రూట్
భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ తన టెస్ట్ కెరియర్ లో అత్యుత్తమ ర్యాంక్ లో నిలిచాడు. ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అత్యుత్తమంగా రాణించడం ద్వారా రిషభ్ పంత్ …వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో నిలిచాడు. బ్రిస్బేన్ టెస్టు ఆఖరిరోజు ఆటలో రిషభ్ పంత్ 89 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. దీంతో ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఓవరాల్ గా రిషభ్ పంత్ 13వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 691 పాయింట్లతో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ను అధిగమించాడు. డికాక్ 677 పాయింట్లతో రిషభ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇది చదవండి: గెలుపంటే ఇదేరా!
ఓ ర్యాంక్ తగ్గిన విరాట్ కొహ్లీ:
బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓ ర్యాంక్ దిగువకు పడిపోయాడు. పితృత్వపు సెలవుతో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లోని ఆఖరి మూడుటెస్టులకూ దూరమైన కొహ్లీ ఇప్పటి వరకూ ఉన్న 3వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్ కు పడిపోయాడు. కంగారూ వన్ డౌన్ ఆటగాడు మార్నుస్ లబుషేన్ 3వ ర్యాంక్ లో నిలిచాడు. కొహ్లీ 862 పాయింట్లతో నాలుగు,లబుషేన్ 878 పాయింట్లతో ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ శ్రీలంకపై డబుల్ సెంచరీ సాధించడం ద్వారా 5వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 738 పాయింట్లతో కొహ్లీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 68వ ర్యాంక్ నుంచి 47వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శుభ్ మన్ 91 పరుగుల స్కోరు సాధించడంతో ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. ఇప్పటి వరకూ 8వ ర్యాంక్ లో ఉంటూ వచ్చిన చతేశ్వర్ పూజారా ఓ స్థానం మెరుగుపరచుకొని 7వ ర్యాంక్ సాధించాడు. యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరచుకొని 45వ ర్యాంక్ లో నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 97 నుంచి 82, శార్దూల్ ఠాకూర్ 113 నుంచి 65వ ర్యాంక్ కు చేరుకొన్నారు.
ఇది చదవండి: భారత క్రికెటర్లకు బీసీసీఐ బోనస్