Thursday, November 21, 2024

పోడు భూములపై హక్కులు అందేదెన్నడు?

  • పట్టాల కోసం అధికారుల చుట్టు తీరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం
  • హక్కులకై నిరంతరం ఉద్యమాలు
  • పోడు భూముల సాగుదారులపై జంగ్లతోళ్ల జూలం

తరతరాలుగా అడవిని ఆధారం చేసి బ్రతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమై అనేక బాధలు భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివాసికి అడవి జన్మ హక్కు. అడవిపైన కానీ ఆదివాసీలపైన కానీ ఎవరి ఆధిపత్యం ఉండకూడదని గత బ్రిటిష్ స్థానిక పాలకులు అర్థం చేసుకున్నారు. ఆదివాసీ జీవన పరిణామాలు స్థితిగతులను అర్థం చేసి అడవి పర్యావరణాన్ని జీవరాశులను కాపాడాలనే వాటి రక్షణకు ప్రత్యేక చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ నేటి రాష్ట్ర, కేంద్ర పాలకులు, నాయకులు, యంత్రాంగం అవినీతికి పాల్పడుతూ ఆదివాసీలపై దాడులు, దౌర్జాన్యలు చేస్తున్నారు. అడవికి రక్షణ కరువైన పరిస్థితులు నేడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. హక్కులను చట్టాలను రక్షించవలసిన పాలకులు, యంత్రాంగం వారే ఆదివాసులపై దాడులు చేస్తూ నివాస గృహాలను ధ్వంసం చేసి, దహనం చేస్తే ఆదివాసి ఎవరి చంకన చేరాలి? ఎవరికి చెప్పుకోవాలి?

ఆది నుంచీ పోడు సాగుదారులపై వేధింపులే..

స్వాతంత్ర భారతదేశం పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాంగ నిర్మాణంలో ఆదివాసులకూ, అడవికీ  ప్రత్యేక రక్షణ చట్టాలను పొందుపరిచారు. రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి ఏడు దశాబ్దాలు పూర్తి అయినా ఆదివాసులకి బ్రిటిష్, నైజాం హయాంల నుంచి నేటి వరకూ వేధింపులలో మార్పులు రాలేదు. నేటికీ రక్షణ కరువై ఆదివాసీ పౌరసత్వం లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వేతర దోపిడికి గురి అవుతూనే ఉన్నారు. ఆదివాసీకీ, అడవికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం, అనుబంధం విడదీయరానిది. దేవుడిగా వంశ వృక్ష సంపదను జీవనాధారం భూమి, నీరు, ఆకలి తీర్చే తల్లిగా నమ్ముతారు. అడవిని రక్షిస్తూ తమ ముందు తరానికి ఉండాలని కోరుతారు. వారి మనుగడకు నష్టం కాకుండా అడవిలో దొరికే ఆహార ఉత్పత్తులతో పాటు పల్లపు నేలల్లో సాగు చేస్తూ జీవిస్తారు. ఈ క్రమంలో బయటి నాగరికతతో అభివృద్ధి చెందిన మైదాన గ్రామ ప్రజలందరూ పట్టణీకరణతో దోపిడీ నేర్చిన వారు ఆదివాసీలు నివాసం ఉన్న అడవి ప్రాంతానికి చొరబడి దోపిడీ మోసాలు చేయడం ప్రారంభించారు. అడవితో పాటు మానవ విలువలు కాలరాయడం, పాశ్చాత్య సంస్కృతిని ప్రవేశపెట్టి, దోపిడి, వలసలు పెరిగిపోవడంతో ఆదివాసి ప్రాంతం గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సంపదలతో అడవి వ్యాపారం పెరిగింది. ప్రభుత్వ అండదండలతో ఆదివాసి అభివృద్ధి పేరుతో, దేశ అభివృద్ధి పేరుతో ఆదివాసులను అడవుల నుంచి తరుముతున్నారు. నక్సల్స్ పేరుతో చంపుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కులన్ని దోపిడీల చేతిలో బందీలై ఆదివాసికి ప్రాణ సంకటంగా మారినాయి. అవే ఉరితాడులై వేధిస్తున్నాయి. ‘‘కంచే చేను మేసిన’’ చందంగా ఆదివాసి పరిస్థితి మారింది.

ఆదివాసీ ప్రాంత రక్షణకు అటవీ రక్షణ చట్టాలతోపాటు ఆదివాసి నివాస ప్రాంతాలైన పోడు వ్యవసాయానికి సంస్కృతి సాంప్రదాయాలు, రక్షణ చట్టాలు, హక్కులు కల్పిస్తూ జాయింట్ గా అడవి అభివృద్ధికి హక్కులు కల్పించబడ్డాయి. అటవీ హక్కులు రాజ్యాంగ హక్కులు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసి అభిప్రాయాలను గౌరవిస్తూ వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని 5వ, 6వ షెడ్యూల్ లను అమలు పరచాలని చట్టాలు ఆదేశిస్తున్నాయి. గ్రామసభల ద్వారా తీర్మానాలను అటవీ రక్షణ, హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవిని ఆదివాసులను పరిరక్షించాలని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ నేడు రాష్ట్రంలో దేశంలో అటవీశాఖ, పోలీసులు అధికారాలను తమ చేతిలోకి తీసుకుని ఆదివాసి గూడాలపై చొరబడి నివాస గుడిసెలను ఆధునిక పరికరాలతో జెసిబి/ట్రాక్టర్లలతో కూల్చడం, తగలబెట్టడం, మానవత్వం మరిచి క్రూరంగా వేధించడం జరుగుతోంది. ఆదివాసులపై నిరంతరం దాడులూ, ఘర్షణలూ జరుగుతూనే ఉన్నాయి. చట్టపరంగా 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు లేకుండా దర్జాగా అటవీశాఖ అధికారులతో చేతులు కలిపి అటవీ ప్రాంత భూములను, అడవిని సర్వనాశనం చేస్తున్నారు. ఆదివాసి గుడాలను వారి పేరున రిజిస్ట్రేషన్ చేసి స్వాధీనపరిచన వారికి మాత్రం ‘బారకూన్​ మాఫ్.’​ సకల మర్యాదలతో వారిని పెంచిపోషిస్తున్నారు. వలస వచ్చిన గిరిజనేతరులు నయానా భయానా అవసరాలను సృష్టించి మోసాలు దోపిడీ చేస్తుంటే వారి వైపు కన్నెత్తి కూడా చూడరు అధికారులు.

నేరవేరని సీఎం హామీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం గారు స్వయంగా ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని చాలా సందర్భాలలో చెప్పినారు. కానీ దానికి విరుద్ధంగా ఆదివాసి గూడాలపై వారి సాగు భూములపై అటవీశాఖకు, పోలీసు సపోర్టుతో ఉసిగొల్పి ఆదివాసి ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారు.అడవి నుంచి వెల్లిపోవాలని బలవంతంగా లారీల్లో, ట్రాక్టర్లలో, ఆడ, మగ, గర్భిణీలు, బాలింతలు, ముసలి, ముతక, పసిపిల్లలు, రోగులను ఎలాంటి తేడాలు లేకుండా, మినహాయింపు లేకుండా లారీలలో కట్టెలను వేసినట్టు పడవేసి కట్టెల డిపోలలో బంధించిన సంఘటన కొలాంగొందిలో జరిగింది. ఈ సంఘటనపై హైకోర్టు జోక్యం చేసుకొని వెంటనే వసతులు కల్పించి 91 ఎకరాలు ఇచ్చి ఆరు నెలలో ఇండ్లు కట్టి ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ అధికారులు హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు.

అటవీశాఖ అధికారుల పెత్తనం

ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసి అటవీశాఖ, చౌకీదార్లు, సారేదార్లు, రేంజర్లు ఆదివాసులపై పెత్తనం చేస్తూ ‘‘మీరు అడవికిపోయి ఏవైనా వస్తువులు తీసుకుని వస్తే సంవత్సరానికి ఒకసారి ‘‘మంచంపట్టి’’ కట్టాలి. గ్రామంలోని ప్రతి కుటుంబం ఏ పంట పండించినా రెండు కేజీలు, ఒక కోడిపుంజు లాంటివి ప్రతి ఇంటి వారూ ఇవ్వాలి. ఎవరు ఇవ్వకపోయినా కేసులో జైలుకు పోవాల్సి వస్తుంది. లేదా జరిమానా కట్టాలి,’’ అంటూ బెదిరించారు. ఇంకా ఎన్నో చెప్పరాని తిప్పలు పెట్టారు. అడవికి పోకుండా చుట్టూ కందకాలు తవ్వడం, పంటలు వేస్తే మొలకలు పీకేయడం, ఘర్షణలు సృష్టించడం, ఆదివాసులను రెచ్చగొట్టి గొడవలు చేయించడం మామూలే. అబద్ధాలను సృష్టిస్తారు.చౌకిదార్లు, సారేదార్లు సాగు భూముల పైకి పోయి గోడ్డల్లు, కొడవళ్ళు, కర్రలు చేతికి ఇచ్చి మీ పంటలో ఉన్న చిన్న పొరకలు కొట్టమని, కొడవలితో గడ్డి తీయమని, పట్టి నిలబడమని ఎన్ని రకాల ఫోటోలు కావాలో అన్ని రకాల వారికి అవసరమున్న పద్ధతిలో తీసుకొని ఆదివాసులు మాపై మారుణాయుధాలతో దాడికి ప్రయత్నం చేసినారని, కట్టుకథలు అల్లి కేసులు పెట్టి జైలుకు పంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏనోలి గ్రామం వాంకిడికోలాం పీవీటీజీ ఆత్రం మారు ఒకరోజు అవసరాలరీత్యా అడవికి పోయి కంక బొంగులు(తడుకలు/బుట్టలు) కొట్టినందుకు చౌకీదార్లు, సారేదార్లు ఆయనను బంధించి రూ. 30వేలు జరిమానా కట్టాలని, రెండు ఎడ్లు, మేకలు అమ్మాలని, లేదా తమకు ఇవ్వాలని, అమ్మి వచ్చిన డబ్బులు జరిమాన కట్టాలని బాదిస్తుంటే గ్రామ పెద్దల వద్దకు పోయి పంచాయతీకి కూర్చోబెట్టి తప్పయిందని కాళ్లువేళ్లు పట్టించి రూ.500లు ఒక కోడిపుంజు ఇచ్చి పంపినారు. దినికి తోడు విద్యుత్​ శాఖ వారు కూడా మీరు మీటర్లు లేకుండా కరెంట్​ వాడుతున్నారు కాబట్టి సంవత్సరానికి ప్రతి ఇంటికి రూ.1000 నుంచి రూ.1500ల వరకు జమ చేసి ఇవ్వాలి లేని ఎడల కరెంటు దొంగలు అని కేసు పెడతాం అని భయపెట్టుచున్నారు. ఇన్ని బాధలలో భయంభయంగా బతుకు వెల్లదీస్తున్నారు. ఇట్టి బాధలు పోవాలని ఐటీడీఏ/కలెక్టర్​ ఆపీసు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ధర్మాజీపేట కన్నీటి గాథ

ఇదే విధంగా మరో గ్రామం ధర్మాజీపేట కన్నీటి గాధ.. పీవీజీటీ కొలాం వారు వసతులు లేక బయటి ప్రపంచానికి చాలా దూరంలో జీవిస్తున్న మానవ జీవులు వారు నివాసాలు ఏర్పర్చి రోజుల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అవసరాలు తీర్చడం కోరకు ఒర్రే, చెలిమెలే వారికి జీవనాదారం. ఒక రోజు మహిళలు ఒర్రెలో స్నానాలు చేస్తు బట్టలు ఊతుకుతున్న స్ర్తీలను కూంబింగ్​కు వచ్చిన పోలీసులు కంటపడినారు. వెంటనే వారు పైరింగ్​ చేసినారు. భయంతో స్ర్తీలంత గ్రామానికి పరుగులు తీస్తు వచ్చినారు. పోలీసులు వెంబడే గెదుముతూ వచ్చి గూడెన్ని చుట్టుముట్టి ఆడమగ అందరిని ఒక దగ్గర చేర్చి పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పించారు. ఇంత సేపు నక్సల్స్​ టీం గుడిసెలు అనుకున్నాం మీరు కోలాంలా అని తెలుసుకోని పోయినారు.

చౌకీదార్ల జులుం, ఆగడం

రెండవ రోజు తెల్లారే సరికి గుంపు గుంపులుగా చౌకిదార్లు వచ్చి గుడిసేలను కూల్చి, కాల్చారు. కోలాం ప్రజలను జీపులలో ఎక్కించి ఒకరికి ఒకరు కలువకుండ ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క దిక్కు 40 నుండి 50 కీ.మీ. దూరంలో, మరికొన్ని కుటుంబాలను రోడ్డు మీద, ఐటీడీఏ గోదాంలలో, రైస్​ మీల్​లలో జంతువులను దించినట్లు దించి చెట్టుకు ఒక్కరిని, గుట్టకు ఒక్కరిని చెల్లా చెదరు చేశారు. తిరిగి కాలినడకన అడవుల పోంట ఇరువై, ముప్పై రోజులుకు అదే ధర్మాజీపేట గ్రామానికి చేరి మల్లి గుడిసేలు వేసినారు. కేసులు పెట్టి జైలుకు పంపినారు. ఇన్ని నరకయాతనాలు పడినా ఇప్పటికి బాధలు పోలేదు. ఇప్పటికి ఎలాంటి వసతులు లేక చీకటి బతుకులు బతుకుతున్నాం. కాలం మారిన మా బతుకులు మారే మార్గం లేదు. ఆదివాసీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకోని అడవుల రక్షణ పేరుతో మీ సాగు భూములు మీకే ఇస్తామని నమ్మించి వీఎస్​ఎస్​ల పేరుతో చెట్ల మొలకలు పెంచడం, పంటలతో అంతర్భాగం అని పోడు భూములలో పంటలు వేయనీయకుండా అడ్డుపడుతున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని ఆదివాసీ గూడాలల్లో నిరంతరం ఎక్కడో ఒక చోట పోడు భూమి కోసం అలజడి ఆందోళన జరుగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వాలకు పట్టదు. ఆదివాసికి గోస తీరదు. ఆదివాసీ రక్తం రుచిమరిగిన జంగలత్​.. చౌకిదార్లు, సారెదార్లు, పోలీసులు గోర్రె మందలల్లో తోడెల్లు పడ్డట్లు గూడాలపై పడుతున్నారు. మాన ప్రాణాలకు రక్షణ లేకుండపోతోంది. మాకు జీవించే హక్కులు లేవా? మాకు(ఆదివాసీకి) రాజ్యంగం కల్పించిన హక్కులు వర్తించవా? అవి ఎందుకు అమలుకావడం లేదు? మేము అంతరించి పోవల్సిందేనా? మా పక్షాన మాట్లాడే గొంతుకలు లేవా? కాపాడండి… అంటూ పోడు సాగు ఆదివాసీల ఆవేదన ఇది!

ఆత్రం భుజంగరావు
ఆత్రం భుజంగరావు
ఆత్రం భుజంగరావు సామాజిక కార్యకర్త ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా మొబైల్ : 9440585605

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles