కడప జిల్లాలో మానవ హక్కుల కోసం అహరహం పోరాడిన ధీరవనిత కాకుమాను జయశ్రీ మృతి పట్ల సమాజంలోని అన్ని వర్గాలవారూ సంతాపం ప్రకటించడానికి కారణం ఆమె దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు చేసిన సేవలే. జిల్లాలో యురేనియం తవ్వుతున్నారన్నా, దళితులపైనా, ఇతర అణగారిన వర్గాలపైనా దాడులు జరుగుతున్నాయన్నా, అనవసరంగా చెట్లు కొట్టివేస్తున్నారని కబురు అందినా ఆమె ఏ మాత్రం సంకోచించకుండా రంగంలోకి దిగేవారు. తన సమస్యలలాగానే ప్రజాసమస్యలను భావించి వాటిని పరిష్కరించేందుకు పోరాడేవారు. మైనింగ్ శాఖలో 176 మంది ఆదివాసీలను ఉద్యోగాల నుంచి తీసివేసిన ఉదంతంపైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన యుద్ధం ప్రకటించారు. ‘పెద్దిరెడ్డిగారి ఘనకార్యం’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రొద్దటూరులో ఇళ్ళు కూల్చివేస్తుంటే దానికి ‘జగనన్న డిమాలిషన్ స్కీమ్’ అని వ్యంగ్యమైన పేరు పెట్టి కూల్చివేతలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించారు.
భయంకరమైన ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)కింద ఆమెపైన పోలీసులు 2020లో కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్లు ఎనిమిదింటిని జోడించారు. అయినా ఆమె బెదరలేదు. ఆమె పట్ల పోలీసు అధికారులకు సైతం గౌరవం ఉండేది. చులకనగా చూసేవారు కాదు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ల మధ్య పోరాటాలను ఆమె నిరసించారు. ఫ్యాక్షనిస్టులంటే భయపడకుండా వారిని ఎదిరించి నిలిచారు. ఫ్యాక్షన్లు నడుపుతూ రాజకీయాలు చేస్తున్న నాయకులను ప్రశ్నించారు. జయశ్రీ ఫేస్ బుక్ ఆమె ఆదర్శాలకీ, ఆగ్రహానికీ, ఆవేశానికీ, ఆవేదనకీ అద్దం పడుతుంది. తలోజా జైలులో బందీగా ఉంటూ కస్టడీలో స్టాన్ స్వామి మరణించడం పట్ల ఆగ్రహం, ఆవేదన వెలిబుచ్చారు. దిల్లీలో రైతుల ఉద్యమాన్ని బేషరతుగా సమర్థించారు. ఒక్క కడప జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ అమానవీయ సంఘటన జరిగినా ఆమె స్పందించేవారు.
ప్రొద్దటూరులో కాకుమాని బంగారయ్య, వెంకటమ్మ దంపతులకు 15 ఏప్రిల్ 1960న జన్మించిన జయశ్రీ అక్కడే చదువుకున్నారు. 1986లో ఎల్ఎల్ బీలో ఉత్తీర్ణురాలైన తర్వాత ప్రొద్దటూరులోనే ప్రాక్టీసు పెట్టారు. ఒక వైపు న్యాయవాద వృత్తి చేస్తూ మరో వైపు పౌరహక్కుల కోసం పోరాడేవారు. 1988లో పౌరహక్కుల సంఘంలో చేరి పోలీసులు చట్టాలను ఉల్లంఘించినప్పుడల్లా ప్రశ్నించేవారు. సాయుధ ముఠాల (ఫ్యాక్షనిస్టుల) వ్యతిరేక కమిటీలో జయశ్రీ చురుకైన పాత్ర పోషించారు. కడప జిల్లాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పెన్నా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. పెద్దపసుపులలో మద్య వ్యతిరేక ఉద్యమంలోనూ, గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. గిరిజనులను ఉద్యోగాల నుంచి తొలగించిన సమస్యపైన నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోమవారంనాడు దిల్లీ వెళ్ళాల్సి ఉంది. అందుకని హైదరాబాద్ వచ్చి తన సోదరుడి ఇంట్లో దిగారు. అక్కడ శనివారంనాడు ఫోన్ మాట్లాడుతూ గుండె నొప్పి వచ్చి కుప్పకూలారు. జయశ్రీ మతాంతర వివాహం చేసుకున్నారు. భర్త అత్తాఫ్, కుమారుడు అనుష్ ఉన్నారు.
ప్రసిద్ధ హక్కుల నాయకుడు బాలగోపాల్ నాయకత్వంలో మానవ హక్కుల వేదికను ఆరంభించిన 36 మంది వ్యక్తులలో జయశ్రీ ఒకరు. బాలగోపాల్ అంటే అమితమైన గౌరవం, అభిమానం కలిగిన జయశ్రీ కడప జిల్లాకూ, హైదరాబాద్ లో ఉన్న మీడియాకూ మధ్య వారధిగా ఉండేవారు. ఎక్కడ చట్ట ఉల్లంఘన జరిగినా సంపాదకులతో ఫోన్ లో మాట్లాడేవారు. స్థానిక రిపోర్టర్లతో సమన్వయం చేసుకునేవారు. వార్త ప్రముఖంగా పత్రికలలో వచ్చే విధంగా చూసుకునేవారు. ఎక్కడైనా ఎన్ కౌంటర్ జరిగితే బాలగోపాల్ నాయకత్వంలో నిజనిర్ధారణ కమిటీ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో ఆమె కూడా వెళ్ళేవారు. బాలగోపాల్ భార్య, సీనియర్ జర్నలిస్టు వేమన వసంతలక్ష్మి జయశ్రీ భౌతిక కాయాన్ని ప్రొద్దటూరులోని రాజరాజేశ్వరి కాలనీ లో ఆమె స్వగృహానికి తీసుకొని వచ్చారు. స్థానిక ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంఎల్ సీ రమేష్ యాదవ్, విరసం నాయకులు, హక్కుల కార్యకర్తలు అనేకమంది జయశ్రీ భౌతిక కాయానికి నమస్కరించి నివాళులు అర్పించారు. ఆదివారంనాడు ప్రొద్దటూరు ఆర్యవైశ్య హిందూ స్మశాన వాటికలో ఆమెకు దహన సంస్కారాలు జరిగాయి.
ప్రజల కోసం, ప్రజల మధ్య జీవించి, ఆదివాసీ హక్కులకోసం పోరాడేందుకు దిల్లీ వెడుతూ మార్గమధ్యంలో హైదరాబాద్ లో తనువు చాలించిన జయశ్రీ తాను అనుకున్న విధంగా జీవించిన ధన్యురాలు. తుది శ్వాసవరకూ ప్రజలకు అంకితమైన పని చేసిన జననేత.