- తుది దశలో టీపీసీసీ ఎంపిక ప్రక్రియ
- రాహుల్ తో భేటీ కానున్న రేవంత్
- ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పార్టీ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. అధ్యక్షుడి ఎంపికపై దాదాపు 200 మంది నేతలతో సమావేశమై చేపట్టిన అభిప్రాయ సేకరణ పూర్తయింది. దీనిపై అభిప్రాయాలను సీల్డ్ కవర్ లో పెట్టి సోనియాగాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదీ చదవండి: రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ?
సమన్వయ కర్తకే సారధ్యం
తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎంపిక ఆ పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో అన్ని వర్గాలను సమన్వయం చేసే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా?