- బొడ్డపాడులో పతాకవిష్కరణ చేసిన పాణిగ్రహి జీవిత సహచరి సురేఖ పాణిగ్రహి
- అభివృద్ధి పేరుతో ముంచుకొస్తున్న మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించండి
- రంగో మేటియా కొండల్లో ప్రతిధ్వనిస్తున్న పాణిగ్రహి పాట
- విప్లవ కవి పాణిగ్రాహి 53వ వర్ధంతి సభలో సురేఖ పాణిగ్రహి ప్రకటన
బొడ్డపాడు లో శుక్రవారం ఉదయం 10 గంటలకు అమరవీరుల స్మారక మందిరం వద్ద సుబ్బారావు పాణిగ్రహి 53వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మహత్తర శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఆ ఉద్యమంలో పాణిగ్రహి కత్తి నీ కలాన్ని ఏకం చేసి కదనరంగంలో నిలబడ్డారని కొనియాడారు.
సనాతన సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పాణిగ్రహి విప్లవం కొరకు సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి ఒక చేత పెన్ను మరో చేత గన్ను పట్టుకొని రంగోమేటియా కొండల్లో కార్య క్షేత్రం చేసుకొని సాయుధ పోరాటం నడిపించారు. భారత విప్లవోద్యమంలో ఒక గొప్ప శాయుధ సాంస్కృతిక యోధుడిని కోల్పోయాము. సాంస్కృతిక ఉద్యమ ధ్రువతార పాణిగ్రహీ అని వక్తలు కొనియాడారు. అభివృద్ధి పేరుతో హిందూ మతోన్మాద ఫాసిస్టు పాలకులు దేశంలో మహిళలపై, మైనార్టీలపై, ముస్లింలపై, ఆదివాసీలపై అనేక దాడులు చేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు కులాల మధ్యా, మతాల మధ్యా వైరుధ్యాలను సృష్టిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అయిన మోడీ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు రాజకీయ సాంస్కృతిక సంక్షోభాలు ముందుకు వస్తాయి. వాటిని పరిష్కరించలేని పాలకులు నగ్నంగా ఫాసిజాన్ని ముందుకు తెస్తారు. నేడు సామ్రాజ్యవాద విషసంస్కృతి మన నట్టింట నాట్యం చేస్తోంది. సాంకేతికంగా సాహిత్య పరంగా మనుషులను యంత్రాలుగా మార్చుతున్న నేపథ్యంలో దిక్కు ముక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం అని నినదించిన పాణిగ్రహి చూపిన బాట మనకెంతో ఆదర్శం. ఆచరణీయం. ఆయన అడుగుజాడల్లో మేధావులు, రచయితలు, కళాకారులు ముందుకు పోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
సభ అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో వీరాస్వామి ఐఎఫ్టియు, గురకల బాలకృష్ణ ఏకేఎంఎస్ జిల్లా నాయకులు, పోతనపల్లి కుసుమ పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి, మద్దిల వినోద్ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు, సొర రామారావు అరుణోదయ జిల్లా అధ్యక్షులు, కోసింటి సోమేశ్వరరావు అరుణోదయ జిల్లా కార్యదర్శి, సవర బంగ్లా కుమార్ ఆదివాసి సంఘం నాయకులు,మామిడి భీమారావు, తామడ సన్యాసిరావు లిబరేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.