Thursday, December 26, 2024

భారత ఎన్నికల వ్యవస్థ నిర్మాణంలో అంబేడ్కర్ అసాధారణ పాత్ర

  •  ‘అంబేడ్కర్, గాంధీ, నెహ్రూ’ గ్రంథ సమీక్ష
  • ముగ్గురి అసాధారణ వ్యక్తిత్వాల సమ్యక్ వీక్షణం
  • రాజశేఖర్ వుండ్రు రాసిన విలువైన గ్రంథం

72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా (26 నవంబర్ 2021) రాజశేఖర్ వుండ్రు గారు రాసిన పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు పుస్తక ప్రియులు నిర్వహిస్తున్న ‘మంచి పుస్తకం’ సంస్థ నిర్వాహకులకు ధన్యవాదాలు.

అంబేడ్కర్, గాంధీ, పటేల్ అన్నది పుస్తకం శీర్షిక. గ్రంథరచయిత వుండ్రు రాజశేఖర్ సీనియర్ ఐఏఎస్ అధికారి. అంబేడ్కరైట్. అంబేడ్కర్ మీద పరిశోధన చేసి పీహెచ్ డీ పట్టా పుచ్చుకున్న మేధావి. హైదరాబాద్ లో జన్మించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో, దిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదువుకున్న విద్యాధికులు. అంబేడ్కర్ పైన బెంగళూరు నల్సార్ విశ్వవిద్యాయలంలో పరిశోధన చేసి పీహెచ్ డీ పట్టా పుచ్చుకున్న అధ్యయనశీలి. అంబేడ్కర్ స్కాలర్ గా లోకం గుర్తించిన వ్యక్తి. అంబేడ్కర్ ఆలోచననూ, నడవడికనూ, ఎన్నికల వ్యవస్థ రూపకల్పనలో, రాజ్యాంగ నిర్మాణంలో నిజమైన ‘దళితబంధు’ చేసిన సేవలనూ ఈ తరంవారికీ, భావితరాలవారికీ శక్తిమంతంగా గుర్తుచేయాలన్న సంకల్పంతో శ్రమించి రచించిన గ్రంథం.

అంబేడ్కర్, గాంధీ, గాడ్సే

ఇదే ఇతివృత్తం తీసుకొని గాంధీని హైలైట్ చేస్తూ రామచంద్రగుహ వంటి చరిత్రకారులు పుస్తకం రాయగలరు. దాని శీర్షిక బహుశా గాంధీ, అంబేడ్కర్, పటేల్ అని ఉండేది. వల్లభ్ భాయ్ పటేల్ వాదనను సమర్థిస్తూ నరేంద్రమోదీనో, అమిత్ షానో పుస్తకం రాస్తేగీస్తే దానికి పటేట్, గాంధీ, అంబేడ్కర్ అని పేరు పెట్టేవారు. రాసింది అంబేడ్కర్ అభిమాని కనుక పుస్తకం పేరులో ముందు అంబేడ్కర్, తర్వాత గాంధీ, అనంతరం పటేల్ వచ్చారు. నాకు ముగ్గురు నాయకుల పట్లా గౌరవం ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశ స్వాతంత్ర్యానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ, అసమానతల నిర్మూలనకూ, దేశసమగ్రతాసాధనకూ విశేష కృషి చేశారు. లోపాలు అందరిలోనూ ఉంటాయి. చూడవలసింది సకారాత్మకమైన వారి సేవలనే.

గాంధీజీ స్వతంత్ర్య పోరాటంతో పాటు అనేకానేక విషయాలు పట్టించుకుంటూ, ప్రయోగాలు చేసుకుంటూ జీవితాన్ని సత్యాన్వేషణలో, లక్ష్య సాధనలో గడిపారు. ఆయన లక్ష్యాలలో దేశ స్వాతంత్ర్య సముపార్జనతో పాటు హిందూ మతోద్ధరణ, దళిత జనోద్ధరణ,  సర్వధర్మ సమాదరణ కూడా ఉన్నాయి. పటేల్ 365 సంస్థానాలను యూనియన్ లో విలీనం చేసి మనం చూస్తున్న నవభారతాన్ని నిర్మించడం ద్వారా భారత తొలి ఉపప్రధానిగా, దేశీయాంగ వ్యవహారాల మంత్రిగా తన పాత్ర అత్యంత సమర్థంగా నిర్వహించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఎరవాడ జైలు

అంబేడ్కర్ 1919లో సౌత్ బరో కమిషన్ ఎదుట హాజరై అంటరానివారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలనీ, పౌరహక్కులు ఉండాలనీ కోరుతూ విన్నపం చేయడం ద్వారా రాజకీయాలలో అడుగుపెట్టారు. అందరికీ ఓటు హక్కు ఉండాలా, అక్కరలేదా అని యూరప్ సతమతం అవుతున్న రోజుల్లోనే అందరికీ – చదువుకున్నవారికీ, నిరక్షరాస్యులకీ, సంపన్నులకూ, కటిక పేదవారికీ, మహిళలకూ, పురుషులకూ- ఓటు హక్కు ఉండాలని నిర్ద్వంద్వంగా వాదించారు. ఆ వాదనకే చివరివరకూ కట్టుబడి ఉన్నారు. దాన్ని రాజ్యాంగంలో జయప్రదంగా పొందుపరిచారు. గాంధీకీ, పటేల్ కీ లేని ప్రాసంగికత అంబేడ్కర్ కి ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటుంది. రాజ్యాంగం ఉన్నంత కాలం, దళితులు, ఆదివాసీలు ఉన్నంత కాలం, వారికి రిజర్వేషన్లు ఉన్నంత కాలం, ఎన్నికలు జరిగినంత కాలం, అంటే ప్రజాస్వామ్య దేశంగా ఇండియా మనగలిగినంత కాలం అంబేడ్కర్ ని స్మరించుకోవడం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రియులకు అంబేడ్కర్ ప్రాతఃస్మరణీయుడు.   

వుండ్రు రాజశేఖర్ గారు పకడ్బందీ ప్రణాళికతో ఈ ముఖ్యమైన గ్రంథం రాశారు. ఇంతవరకూ ఎవ్వరూ విపులంగా రాయని కీలకమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. ఎన్నికల వ్యవస్థ నిర్మాణం గురించీ,  అందులో అంబేడ్కర్ పాత్ర గురించీ ఇంత వివరంగా, ఇంత సాధికారికంగా మరెవ్వరూ రాయలేదు.

సర్దార్ పటేల్, అంబేడ్కర్

ముందుమాట కాక ఇందులో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి.

మొదటి అధ్యాయం:  ప్రస్తావన

ఎన్నికల విధానాల గురించీ, ప్రపంచంలోని వివిధ దేశాలలో అమలులో ఉన్న ఎన్నికల పద్ధతుల గురించి విహంగవీక్షణం ఇందులో ఉంది. ఇండియాలో అమలులో ఉన్న ‘ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టం (ఎవరు ముందు గీత దాటితే వారు గెలిచినట్టు పరిగణించే పద్ధతి)’ బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నదే. బ్రిటిష్ వారు వలస ప్రభువులుగా  మన దేశంలో 1937లోనూ, 1946లోనూ నిర్వహించిన ఎన్నికలలో అమలు చేసిన పద్ధతే. కాకపోతే అప్పుడు పన్నులు కట్టేవారికీ, చదువుకున్నవారికీ, ఆస్తులు ఉన్నవారికీ, సైన్యంలో పని చేసినవారికీ, రిటైరైనవారికీ మాత్రమే ఓటు హక్కు ఉండేది. అందరికీ ఓటు హక్కు అన్నది అంబేడ్కర్ వరమే. మనది బ్రిటీష్ నమూనా. పార్లమెంటరీ వ్యవస్థ. అమెరికాది అధ్యక్ష వ్యవస్థ. ఫ్రాన్స్ లోనూ అధ్యక్ష వ్యవస్థ ఉన్నప్పటికీ అమెరికాలో జరిగే ఎన్నికలకూ, ఫ్రాన్స్ లోనూ, దాని వలస దేశాలైనసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, గబాన్, మరీషియస్ వంటి దేశాలలోనూ జరిగే ఎన్నికలకూ తేడా ఉంది. అమెరికాలో ఓటర్లకూ, అభ్యర్థులకూ మధ్య ఎలక్టొరల్ కోలేజీ ఉంటుంది. ఓట్లు తక్కువ పడి ఎలక్టొరల్ కొలేజీలో అధిక్యం సంపాదించి అద్యక్షులుగా ఎన్నికైనవారు అమెరికాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో పోలైన ఓట్లలో అధ్యక్ష ఎన్నికలలో చివరికి ఓడిపోయిన అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కి 48.1 శాతం ఓట్లు వస్తే గెలిచిన ట్రంప్ కి 46. 4 శాతం మాత్రమే వచ్చాయి. ఫ్రాన్స్ లో మొత్తం పోలైన ఓట్లలో 51 శాతం వచ్చిన అభ్యర్థినే విజేతగా పరిగణిస్తారు. ఒక సారి పోలింగ్ లో ఎవ్వరికీ 51శాతం రాకపోతే మళ్ళో పోలింగ్ నిర్వహిస్తారు. ఎవరికో ఒకరికి 51 శాతం వచ్చే వరకూ పోలింగ్ జరుగుతుంది.  జర్మనీ, ఇటలీ, ఇజ్రేల్ లో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో దామాషా పద్ధతి అమలులో ఉంది. ఏయే దేశాలలో ఏ పద్ధతి అమలులో ఉన్నదో, దాని మంచిచెడులు ఏమిటో క్లుప్తంగా చర్చించారు మొదటి అధ్యాయంలో.

రెండో అధ్యాయం: ‘భారత సామాజిక వ్యవస్థ, ఎన్నికలు.’ ఈ అధ్యాయంలోనే అంబేడ్కర్ ని ప్రవేశపెట్టారు. 1919 నాటి సౌత్ బరో కమిషన్ ఎదుట అంబేడ్కర్ వాదన ఏమిటో వివరిస్తారు. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ విధానాన్ని ప్రతిపాదిస్తారు. ఇండియాలో అంటరానివారూ, నిమ్నకులాలవారూ, పేదవారూ, మహిళలూ…సమాజంలో వివిధ వర్గాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈ అధ్యాయంలో వివరిస్తారు. అందరికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండాలనీ, అందరికీ ఓటు హక్కు ఉండాలనీ వాదిస్తారు అంబేడ్కర్. శతాబ్దాలుగా అస్తవ్యస్తమైన సామాజిక వ్యవస్థను నిర్మించుకున్న ఇండియా పరిస్థితి ఇతర ప్రపంచదేశాల పరిస్థితి కంటే భిన్నమైనది. అది ఎట్లాగో వివరించారు. ఇతర సమస్యలతో పాటు ఇండియాకు అదనంగా కులవ్యవస్థ పెద్ద గుదిబండగా, శాపంగా తయారైన విషయాన్నీ ప్రస్తావించారు. ఇరవయ్యో శతాబ్దపు తొలి అయిదు దశాబ్దాలలో హిందువులూ, ముస్లింలూ పరస్పరం దాడులు చేసుకొని, చంపుకొని దేశాన్ని ఎట్లా ముక్కలు చెక్కలు చేశారో చెప్పారు. ‘కుల వ్యవస్థ కేవలం పని విభజన కాదు. అది పనిచేసేవారిని విభజించే వ్యవస్థ’ అని అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యానాన్ని గుర్తు చేశారు.

1600 సంవత్సరాల అణచివేత, వివక్ష అనంతరం అంబేడ్కర్ ధర్మమా అని అంటరానివారికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం 1935లో ఎట్లా వచ్చిందో వివరించారు. క్రీస్తు తర్వాత 400 సంవత్సరాలకు అంటరానితనం పుట్టి ఒక ఆచారంగా సమాజం ఆమోదం పొంది కరకు తేలిందని అంబేడ్కర్ అన్న మాటను ఉటంకించారు.  కోరెగాం యుద్ధాన్నీ, అందులో మహర్ల శౌర్యాన్నీ ప్రస్తావించారు. ఆ యుద్ధంలో దళిత వీరుల శౌర్యం గురించి మాట్లాడుకోవడానికి జరిగిన సదస్సులోనే కుట్ర జరిగిందనే ఆరోపణలో వరవరావునూ, సుధాభరద్వాజ్ నూ, మరో 13 మంది హక్కుల నాయకులనూ, మేధావులనూ దేశద్రోహం చట్టం కింద మోదీ ప్రభుత్వం  అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టింది.

Ambedkar, Gandhi and Patel (Telugu): The Making of India’s Electoral System

Buy now

మూడో అధ్యాయం: ‘అంబేడ్కర్, గాంధీ: రాజకీయ సోపానం

అంబేడ్కర్ పూర్వాపరాలు వివరంగా తెలియజేశారు. సైనిక కుటుంబంలో అంబేడ్కర్ జన్మించడం గురించి తెలిపారు. దళితుడిగా పుట్టడం వల్ల చిన్నతనంలో ఆయనకు జరిగిన అవమానాలను ప్రస్తావించారు. బొంబాయి వెళ్ళి చదువుకోవడం, ఉపకార వేతనం పొందిన తొలి దళిత విద్యార్థిగా న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకొని, పీహెచ్ డీ చేయడం, తిరిగి ఇండియాకు వచ్చి బరోడా సంస్థానంలో సైనిక వ్యవహారాల సెక్రటరీగా పని చేయడం, అక్కడా బాడుగకు ఇల్లు దొరకడం కష్టమై అవమానాల పాలు కావడం, బొంబాయికి తిరిగి వెళ్ళడం, అక్కడ ఛత్రపతి శివాజీ వారసుడు కొల్హాపూర్ మహారాజు ఛత్రపతి సాహూమహారాజు సహాయం చేయడంతో లండన్ వెళ్ళడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవడం, తర్వాత కోర్టులో లాయర్ గా పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం, ఇండియా తిరిగి వచ్చి స్టాక్ బ్రోకింగ్ సంస్థ ను ప్రారంభించినా ఆయన దళిత మూలాలు తెలిసినవారు ఎవ్వరూ ఆ సంస్థను ఆదరించకపోవడంతో అంబేడ్కర్ కుంగిపోయాడు. అదే సమయంలో సౌత్ బరో కమిషన్ ఎదుట హాజరై దళితుల తరఫున వాదించడంతో దళితులకు నాయకుడిగా మారిన వైనం వివరించారు. ఇదే అధ్యాయంలో గాంధీజీని కూడా పరిచయం చేశారు. గాంధీజీ పెక్కు సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ప్రవాసభారతీయుల హక్కులకోసం పోరాడి ఇండియా వచ్చేనాటికి ఇక్కడ సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వివరించారు. లక్నోప్యాక్ట్ గురించి తెలియజేశారు. హిందువులు బాలగంగాధర్  తిలిక్ నాయకత్వంలోనూ, ముస్లింలు మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోనూ కలిసి లక్నో ఒప్పందం కుదుర్చుకున్న వైనం వివరించారు. చట్ట సభలలో సీట్ల పంపిణీ లక్నో ఒప్పందం ప్రధాన ఉద్దేశం. దళితుల తరఫున ఎవ్వరికీ సమాలోచనలలో పాల్గొనడానికి ఆహ్వానించకపోవడం విశేషం.

ఎన్నికల సంస్కరణల నిర్ణయంలో సైమన్ కమిషన్ ది గణనీయమైన పాత్ర. కాంగ్రెస్ సైమన్ కమిషన్ ను బహిష్కరించింది. అంబేడ్కర్ దళితులకూ, జిన్నా ముస్లింలకూ ప్రాతినిధ్యం వహిస్తూ సైమన్ కమిషన్ ఎదుట తమ వాదనలు వినిపించారు. మహద్ లో చెరువు నీటిని అంబేడ్కర్, తదితరులు తమ హక్కుగా చేతులలోకి తీసుకొని తాగి అంటరానితనాన్ని ధిక్కరించడం కూడా ఈ అధ్యాయంలో రాశారు. మద్రాసు ప్రావిన్స్ లో బ్రాహ్మణేతర ఉద్యమం ప్రస్తావన కూడా ఆ అధ్యాయంలో చేశారు.

అంబేడ్కర్, గాంధీ

నాలుగో అధ్యాయం: లండన్ లో అంబేడ్కర్-గాంధీ ఘర్షణ.

లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల వివరాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేడ్కర్ హాజరైనారు కానీ గాంధీ కాలేదు. మొదటి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ సివిల్ డిజొబీడియన్స్ ఉద్యమంలో తలమునకలై ఉన్నందున గాంధీ లండన్ వెళ్ళలేదు. అంటరానివారు ప్రభుత్వ పీడనకూ, హిందువుల అణచివేతకూ, ముస్లింల నిర్లక్ష్యానికి గురైనారని అంబేడ్కర్ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉద్ఘాటించారు. ఆ ఉపన్యాసం బరోదా మహారాజు కు బాగా నచ్చింది. రాత్రి విందుకు అంబేడ్కర్ ని బరోదా మహారాజు ఆహ్వానించారు.  ‘ప్రాచీన సంకెళ్ళ నుంచి భారతదేశంలో 43 లక్షల మందికి విముక్తి కలిగించేందుకు అంబేడ్కర్ పోరాటం’ అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ఒక వివరమైన వార్తాకథనం ప్రచురించింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత ఇండియాకు వచ్చిన అంబేడ్కర్ ను ఒక హీరోలాగా స్వాగతించారు.  దళితులను ఒక ప్రత్యేకమైన రాజకీయ వర్గంగా భావించాలనీ, వారికి చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలనీ అంబేడ్కర్ చేసిన వాదన బ్రిటీష్ ప్రజలకు కూడా నచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం కుదిరిన తర్వాత రెండో రౌండ్ టేబిల్ సమావేశానికి గాంధీ హాజరు కావడం గురించి ఈ అధ్యాయంలోనే రాశారు. అంబేడ్కర్ ని తొలుత దళితుల పక్షాన వకాల్తా పుచ్చుకున్న బ్రాహ్మణుడని గాంధీ భావించారట.

నెహ్రూ, గాంధీ, పటేల్

బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులూ, సంస్థానాధీశులూ, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులూ మొత్తం 112 మంది ప్రతినిధులు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏకైక ప్రతినిధి గాంధీ. ఆయనకూ, అంబేడ్కర్ కూ మధ్య వాగ్వాదం జరిగింది. ముస్లింలకూ, సిక్కులకూ వర్తించే ప్రత్యేక హక్కులు దళితులకు వర్తించడం సాధ్యం కాదని గాంధీ అన్నాడు. అంటరానివారి విషయంలో అంబేడ్కర్ చెబుతున్నదని తనకు అర్థం కావడం లేదనీ, వారి విషయంలో అంబేడ్కర్ తో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందనీ గాంధీ చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కాకుండా బయట విడిగా మైనారిటీ నాయకులతో గాంధీ చర్చలు జరపడాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించారు. రిట్జ్ హోటల్ లో అగాఖాన్ తో గాంధీ చర్చలు జరపిన విషయం ఈ పుస్తకంలో రాజశేఖర్ వివరించారు. మైనారిటీ సమావేశంలో గాంధీని అంబేడ్కర్ పూర్తిగా వ్యతిరేకించారు. ఒక వర్గం చేతిలో అధికారం ఉండరాదనీ, దామాషా ప్రకారం అధికార పంపిణీ జరగాలనీ అంబేడ్కర్ వాదించారు. గాంధీకి ఆగ్రహం కలిగింది. ముస్లింలకూ, సిక్కులకు మినహా తక్కిన మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండాలనే ప్రతిపాదనను గాంధీ గట్టిగా వ్యతిరేకించారు.

‘నాకు అంబేడ్కర్ పట్ల వ్యతిరేకత లేదు. ప్రతి అస్పృశ్యుడిలాగే అంబేడ్కర్ కి కూడా నా మొహంమీద ఉమ్మివేసే అధికారం ఉంది. వారు  ఆ పని చేసినా నేను చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను,’ అని గాంధీ అన్నారు. అంబేడ్కర్ పట్ల కంటే కాంగ్రెస్ పట్లనే అస్పృశ్యులకు నమ్మకం ఉన్నదని గాంధీ వాదించారు. పత్రికా విలేఖరులు అంబేడ్కర్ వైఖరి గురించి గాంధీని వదిలిపెట్టకుండా ప్రశ్నించారు. దళితులకు ప్రాతినిథ్యం వహించే అర్హత గాంధీకి లేదనీ, దళితులకు దళితులే ప్రాతినిథ్యం వహించాలనీ అంబేడ్కర్ వాదించారు. 1919లో సౌత్ బరో కమిషన్ ఎదుటా, 1928లో సైమన్ కమిషన్ ఎదుట కూడా ఇదే వాదన వినిపించారు. ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అంబేడ్కర్ పైన గాంధీ దాడి చేశారు. మరో వైపు అంబేడ్కర్ మనసు మార్చడానికి ప్రయత్నించారు. బ్రిటీష్ ప్రధాని మెక్  డొనాల్డ్ ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధీ అంబేడ్కర్ పైన ఆగ్రహంతో మాట్లాడారు. ‘‘చాలా వినమ్రుడిగా గాంధీ కనిపిస్తారు. కానీ విజయం కోసం ఎంత అల్పంగానైనా వ్యవహరిస్తారని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రవర్తన రుజువు చేసింది’’ అని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు.

అయిదో అధ్యాయం: గాంధీ ఆమరణ దీక్ష, ఆరు రోజుల సమాలోచనలు.

20 సెప్టెంబర్ 1932న ఆమరణ నిరాహారదీక్ష చేపడతానంటూ గాంధీ సెప్టెంబర్ 18న ప్రకటించారు. ‘ఈ రాజకీయ నాటకాలు నేను ఖాతరు చేయను’ అంటూ అంబేడ్కర్ ఖండితంగా చెప్పారు. ప్రత్యామ్నాయ పథకం ఏమైనా ఉంటే ప్రవేశపెట్టాలని గాంధీకి అంబేడ్కర్ సూచించారు. ‘కమ్యూనల్ అవార్డు’ చాలా స్వల్పమైన విషయం అంటూ రౌండ్ టేబుల్ సమావేశంలో అభివర్ణించిన గాంధీ ఇప్పుడు నిరాహారదీక్ష ఎందుకు చేపట్టారో తనకు అర్థం కావడం లేదంటూ అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. గాంధీజీ అమరుడేమీ కాదు అంటూ అంబేడ్కర్ అన్నారు. ‘మహాత్ములు వచ్చారు. మహాత్ములు పోయారు. అస్పృశ్యులు మాత్రం అస్పృశ్యులుగానే మిగిలిపోయారు’ అని కూడా అన్నారు. కమ్యూనల్ అవార్డును గాంధీ వ్యతిరేకించే పక్షంలో అంతకంటే ఎక్కువగా దళితులకు మేలు చేసే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను గాంధీజీ చెప్పాలని డిమాండ్ చేశారు.

మద్రాసుకు చెందిన దళిత నాయకుడు దివాన్ బహద్దూర్ ఎం.సి. రాజా, హిందూ మహాసభ నేత డాక్టర్ మూంజేలు దళితులకూ, హిందువులకూ మధ్య ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అంబేడ్కర్ ముందరికాళ్ళకు బంధం వేయడానికి ఉద్దేశించిన ఒప్పందం ఇది. వారిద్దరూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవడంతో వారి మధ్య జరిగిన ఒప్పందానికి అంత విలువ లేదు. ఆ తర్వాత ఆరు రోజులపాటు సంభవించిన పరిణామాలు భారత రాజకీయాలలో దళితుల భవితవ్యాన్ని ప్రభావితం చేశాయి. సవర్ణ హిందువులకూ, దళితులకూ మధ్య ఎప్పటికీ వర్తించే రాజకీయ ఒప్పందం అంబేడ్కర్ కీ, గాంధీకి మధ్య కుదిరింది. గాంధీ వ్యక్తిగత కార్యదర్శ ప్యారేలాల్ అప్పటి రోజువారీ వివరాలను నమోదు చేసి ‘ద ఎపిక్ ఫాస్ట్’ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఈ ఒప్పందం గురించి అంబేడ్కర్ ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హేవ్ డన్ టు ద అన్ టచబుల్స్’ అనే గ్రంథంలో వివరించారు.

ముంబయ్ లోని ఇండియన్ మర్చంట్స్ చాంబర్ హాల్ లో హిందూ నాయకుల సమావేశంలో అంబేడ్కర్ నిష్కర్షగా తన అభిప్రాయాలు వెల్లడించారు. ముందుగా చేసిన ప్రకటన ప్రకారం గాంధీ పుణెలోని ఎరవాడ జైలులో సెప్టెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు నిరాహారదీక్ష ఆరంభించారు. అంబేడ్కర్ తో చర్చలు జరిపేందుకు హిందూ నాయకుల సమావేశం సర్ తేజ్ బహదూర్ సప్రూ, బారిస్టర్ జయశంకర్, పండిత్ మదన్ మోహన్ మాలవీయ తదితరులతో ఒక కమిటీని నియమించింది. గాంధీ తరఫున చున్నీలాల్ మెహతా మాట్లాడారు.

అస్పృశ్యులకు ప్రత్యేక ఓట్లు మంజూరు చేయడాన్ని గాంధీ వ్యతిరేకిస్తున్నారనీ, ఉమ్మడి ఓటర్ల జాబితా విషయంలోనూ, కొన్ని సీట్లు అస్పృశ్యులకు కేటాయించే విషయంలోనూ గాంధీకి అంగీకారం లేదని ఆయన చెప్పారు. రాజగోపాలాచారి వంటి హిందూ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో గాంధీ వాదనను సమర్థించే దళిత నాయకుడు ఎంసి రాజా, క్రికెటర్ బాలూ కూడా పాల్గొన్నారు.  సీట్ల రిజర్వేషన్ల విషయమై నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునేందుకు హిందూ నేతలకు వెసులుబాటు ఇచ్చారు.

తనను వీధిలోని సమీప దీపస్తంభానికి వేలాడదీసి ఉరి తీసినప్పటికీ తన ప్రజలు తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయననీ, వారి న్యాయమైన డిమాండ్ల విషయంలో రాజీపడి వారికి ద్రోహం చేయబోననీ స్పష్టం చేశారు. గాంధీ ప్రతిపాదనల స్వభావాన్నిదృష్టిలో ఉంచుకొని నిరాహార  దీక్షను పది, పదిహేను రోజులు వాయిదా వేసుకోవలసిందిగా గాంధీని హిందూ నాయకులు కోరాలని అంబేడ్కర్ సలహా ఇచ్చారు.

మదన్ మోహన్ మాలవీయ నాయకత్వంలో హిందూ కమిటీ నాయకులూ, అంబేడ్కర్ ఈ విషయమై చర్చలు బొంబాయిలోని బిర్లా హౌస్ లో కొనసాగించారు. చిట్టచివరికి అంబేడ్కర్ కొత్త డిమాండ్ల జాబితాను తయారు చేసి కమిటీకి సమర్పించారు. సర్ తేజ్ బహద్దూర్ సప్రూ గాంధీకి అంబేడ్కర్ ప్రతిపాదనలు వివరించారు. తాను అంబేడ్కర్ నీ, ఎంసి రాజాను కలిసి చర్చలు జరిపిన మీదటనే ఒక నిర్ణయం తీసుకోగలనని గాంధీ చెప్పారు. సప్రూ ఫోన్ చేస్తే బొంబాయి నుంచి అంబేడ్కర్ పుణె బయలుదేరారు. హిందూ నాయకులనీ, దళిత నాయకులనూ గాంధీజీ కలుసుకొని చర్చలు జరిపిన తర్వాత గాంధీని అంబేడ్కర్, డాక్టర్ సోలంకీ కలుసుకున్నారు.  సప్రూ కూడా ఉన్నారు. కమ్యూనల్ అవార్డునూ, ప్రత్యేక ఓటింగ్ హక్కునూ కోల్పోతున్నందుకు పీడిత వర్గాలకు తగిన పరిహారం దక్కితీరాలని అంబేడ్కర్ నొక్కి చెప్పారు.

నాకు మీతో ఒకే ఒక విషయంలో తగాదా ఉంది. మా ప్రయోజనాల కోసమే కాకుండా మీరు జాతీయ సంక్షేమం అనేదానికోసం కూడా పని చేస్తారు. మీరు పూర్తిగా పీడిత వర్గాల అభ్యున్నతికి అంకితమై పని చేస్తే మీరు మాకు హీరో అవుతారు అన్నారు గాంధీతో అంబేడ్కర్. మా సమాజానికి రాజకీయ అధికారం కావాలని నేను కోరుకుంటున్నాను అని అంబేడ్కర్ అన్నారు. ప్రత్యేక ప్రాథమిక ఎన్నికలకు తాను వ్యతిరేకం కాదని గాంధీ అంగీకరించారు. ప్యానల్ లో ముగ్గురు మాత్రమే అభ్యర్థులు ఉండాలనే వాదన గాంధీకి నచ్చలేదు.

‘మీరు విషాన్ని దిగమింగారని తెలుసు. మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెబుతాను. మీరు పుట్టుకతో అస్పృశ్యులు, నేను దత్తత ద్వారా అస్పృశ్యుడిని. కొత్తగా అస్పృశ్యుడిగా మారిన వ్యక్తిగా ఆ సామాజికవర్గం సంక్షేమం గురించి అందులో ఉన్నవారికంటే ఎక్కువగా ఆలోచిస్తాను. ఈ క్షణాన నేను కలుసుకోలేని, చూడలేని దక్షిణ భారతానికి చెందిన మూగ అస్పృశ్యులు నా కళ్ళముందు కనిపిస్తున్నారు’ అని కూడా గాంధీ అన్నారు. ‘నేను నేలకొరిగిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు,’ అనీ అన్నారు.

మర్నాడు, అంటే సెప్టెంబర్ 23న, పండిట్ మాలవీయ నివాసంలో జరిగిన సమావేశంలో అందరూ మాట్లాడారు. అందరికంటే అంబేడ్కర్ ఎక్కువగా మాట్లాడారు. 1. ప్రాథమిక ఎన్నికల ప్యానల్ లో ఉండవలసిన అభ్యర్థుల సంఖ్య. 2. మొత్తం రిజర్వుడు సీట్ల సంఖ్య, 3. సెంట్రల్ లెజిస్లేచర్ లో, ప్రావిన్సియల్ అసెంబ్లీలలో ప్రాతినిధ్యం, 4. రిజర్వుడు సీట్లు ఎంతకాలం ఉండాలనే సంగతి, 5. ఇతరులకు పదవుల పంపిణీ – ఈ అయిదు విషయాలపైనా చర్చ జరిగింది. ప్రాథమిక, ద్వితీయ స్థాయి ఎన్నికలను అన్ని రిజర్వుడు సీట్లకూ వర్తించాలన్న గాంధీ సూచనను అందరూ అంగీకరించారు. ఒక్కొక్క ప్రావిన్స్ లో పీడిత జనాభా ఎంత ఉంటుందో అందుకు తగినట్టు దామాషాలో లెజిస్లేచర్లలో సీట్లు రిజర్వు చేయాలని అంబేడ్కర్ వాదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనిల్ అవార్డు ప్రకారం రిజర్వేషన్లు ఇరవై సంవత్సరాలే ఉంటాయి.

23 సాయంత్రం గాంధీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘దీనిని రాజకీయపుటెత్తుగడగా అపార్థం చేసుకోరాదని బ్రిటిష్, అమెరికా ప్రజలకు నా సందేశం. ఇది లోతైన ఆధ్యాత్మికకృషి. ఒకానొక ఆదర్శాన్ని 50 ఏళ్ళపాటు నిరవధికంగా పాటించిన ఫలితం. ఇది ప్రాయశ్చిత్తం. భయంకరమైన మతబానిసత్వం నుంచి కోట్ల మందికి విముక్తి కలిగించాలన్నది ఆ ఆదర్శమైనప్పుడు అది జయప్రదమైతే దాని తాలూకు ప్రభావం మొత్తం మానవాళిపైన ఉంటుంది. ఎందుకంటే తప్పోఒప్పో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక ఓటింగ్ పద్ధతిని ఆమోదించాలనే నిర్ణయాన్ని రుద్దింది. ఇది సంస్కరణ బాటలో పెద్ద అవరోధం కాబోతోంది. ఈ సంస్కరణ సజావుగా, వేగంగా ముందుకు సాగుతున్నది. ప్రత్యేక ఓటు హక్కును ప్రతిఘటించేందుకు నేను నా ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నాను. నిరశన దీక్ష ప్రారంభించిన తర్వాత మూడు రోజులకు నా విశ్వాసం బలపడింది,’ అంటూ గాంధీ తన సందేశంలో అన్నారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం నాటి నుంచి గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీకీ, అంబేడ్కర్ కీ పరిచయం ఉంది. దేవదాస్  మాలవీయ నివాసానికి వెళ్ళి అంబేడ్కర్ తో కన్నీటి ప్రార్థన చేశారు తన తండ్రి ప్రాణాలు కాపాడాలని. అంబేడ్కర్ ఇద్దరు సహచరులతో కలిసి జైలుకి వెళ్లి గాంధీని కలుసుకున్నారు. జైలు డాక్టర్లు అంబేడ్కర్ ని రాత్రి పొద్దుపోయిన తర్వాత గాంధీని కలుసుకోవడానికి అనుమతించారు. క్లుప్తంగా మాట్లాడాలని సూచించారు. 15 నిమిషాలు చర్చించిన తర్వాత మర్నాడు కలుసుకొని చర్చ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మర్నాడు చర్చలలో హిందూ నాయకుల కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది.

రిజర్వేషన్లు కొనసాగించడమా లేదా అనే అంశంపైన రెఫరండం (జనవాక్య సేకరణ) పదేళ్ళ తర్వాత నిర్వహించడానికి ఒప్పుకోవలసిందిగా గాంధీని అంబేడ్కర్ కోరారు. అయిదేళ్ళ చివరలో రెఫరెండం పెట్టాలని గాంధీ అన్నారు. ‘అంటరానివారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తుతానికి అరికట్టవచ్చు. కానీ హిందూ మతంపైన కళంకం మిగిలిపోతుంది. నాటుకుపోయిన మచ్చ తాలూకు లక్షణమే అంటరానితనం. ఈ మచ్చను హిందూమతం నుంచి తొలగించకపోతే అది పదేపదే వివిధ రూపాలలోతిరిగి వచ్చి మన సామాజిక, రాజకీయ వ్యవస్థలను విషపూరితం చేస్తూ ఉంటుంది,’అంటూ గాంధీ వాదించారు. ‘అందుకే పాపభూయిష్టమైన గతానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చివరి అవకాశం హిందూమతానికి లేకుండా చేయవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా. సవర్ణ హిందువులతో కలసి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి. కానీ మీరు పది, పదిహేను సంవత్సరాలు అడిగితే అప్పుడు ఆ అవకాశమే లేదు. హిందువులు అయిదేళ్ళలో బుద్ధిగా వ్యవహరించాలి, లేకపోతే ఎన్నటికీ బుద్ధిగా ప్రవర్తించరనే అర్థం. నా మటుకు నాకు అయిదేళ్ళ తర్వాత జరిగే రెఫరెండం పూర్తిగా అంతరాత్మ ప్రబోధానికి సంబంధించింది,’ అని కూడా అంబేడ్కర్ తో గాంధీ అన్నారు. అంబేడ్కర్ అంగీకరించలేదు. పదేళ్ళ కంటే తక్కువ వ్యవధిలో రెఫరెండం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ‘నా వైఖరి ఇది. ఐదేళ్ళ తర్వాతనే రెఫరెండం జరగాలనే ప్రతిపాదనకు అంగీకరించండి. లేదా నన్ను చావనివ్వండి. నా షరతు సరైనది కాదనీ, హానికరమైనదనీ భావించినవారు షరతును ఆమోదించవద్దు,‘‘ అని మహదేవ్ దేశాయ్ తో గాంధీ చెప్పి ఇతరులకు కబురు పెట్టారు.

అస్పృశ్యులకు తాను ఏకైక ప్రతినిధిననీ, గాంధీ ఏకైక ప్రతినిధి ఎన్నటికీ కాజాలరనీ అంబేడ్కర్ నమ్మకం. తనతో పోటీ పడి అస్పృశ్యులకు తానే నాయకుడని ఊహించుకునే హక్కు గాంధీకి లేదు అని అంబేడ్కర్ భావన. ‘నిరాహారదీక్ష చేయడానికి గాంధీ ఎవరు? వచ్చి రాత్రి నాతో కలసి భోజనం చేయమనండి’ అంటూ అంబేడ్కర్ కాస్త దురుసుగా మాట్లాడటంతో ఆయనకు ఈ మొత్తం వ్యవహారంపైన విసుగు కలిగిందని హిందూ నాయకులకు అర్థమైంది. ఈ దశలో ఎంసి రాజా అంబేడ్కర్ తో ఇలా అన్నారు: ‘‘వేలసంవత్సరాలుగా మనలను అంటరానివారుగా చూశారు. అణగారినవర్గాలుగా పరిగణించారు. అవమానించారు. అసహ్యించుకున్నారు. మనకోసం మహాత్ముడు తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆయన కనుక మరణిస్తే వచ్చే వేయి సంవత్సరాలలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. ఇంకా దిగజారకపోతే నయం. మనమే ఆయన మరణానికి కారకులమనే అభిప్రాయం విస్తరిస్తుంది. హిందూ సామాజిక వర్గం, నాగరికత కలిగిన ఇతర వర్గాలూ మనలను ఇంకా కిందికి నెడతాయి. నేను ఇక ఏ మాత్రం మీ వెంట ఉండలేను. నును హిందూ నాయకుల సమావేశానికి హాజరై పరిష్కారం కనుక్కొంటాను. మీ జట్టు వీడతాను,’’ అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు అంబేడ్కర్ మనసు మార్చివేశాయి. ‘రాజీపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను,’ అని ప్రకటించారు. అయినా పదేళ్ళ తర్వాత రెఫరెండం అనే విషయంలో అంబేడ్కర్ పట్టువీడలేదు. చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ దశలో రాజగోపాలాచారి చొవర తీసుకున్నారు. అంబేడ్కర్ తో సమాలోచన జరిపారు.  రెఫరెండం షరతు లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్దపడ్డారు. కాలపరిమితి లేకుండా భవిష్యత్తుపైన భారం వేయాలని హిందువులూ, అస్పృశ్యులూ అంగీకరించారు. రాజగోపాలాచారి చేసిన ప్రతిపాదనకు గాంధీజీ అంగీకరించారు. పుణె ప్యాక్ట్ తయారైంది. గాంధీ సంతకం చేయలేదు కానీ పుణెలో అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ సంతకాలు చేశారు. సర్దార్ పటేల్ మాత్రం మౌన ప్రేక్షక పాత్ర పోషించారు. డెహ్రాడూన్ జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పుణె ఒప్పందంపైన హర్షం ప్రకటించారు. 26 సెప్టెంబర్ 1932న బ్రిటిష్ ప్రభుత్వం పుణె ప్యాక్ట్ ను ఆమోదించిన తర్వాతనే గాంధీ తన నిరాహారదీక్షను విరమించారు.

పుణె ప్యాక్ట్ ఫలితంగా అంబేడ్కర్ ప్రతిష్ఠ బాగా పెరిగింది. చాలా సంవత్సరాల తర్వాత 1955లో దిల్లీలో బీబీసీకి ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో అంబేడ్కర్ ఏమన్నారో కూడా రాజశేఖర్ ఈ గ్రంథంలో తెలియజేశారు. ‘ఆయన (గాంధీ) పూర్తిగా రాజకీయవాదిగా వ్యవహరించారు,’ అని బీబీసీ ప్రతినిధి వ్యాఖ్యానిస్తే అంబేడ్కర్, ‘‘అవును. రాజకీయవాదిగానే. ఆయన ఎన్నడూ మహాత్ముడు కాదు. ఆయనను మహాత్ముడని పిలవడానికి నేను నిరాకరిస్తాను. ఆ గౌరవానికి ఆయన అర్హుడు కాదు. ఆయన నైతికదృష్టి నుంచి చూసినా ఆయనకు ఆ అర్హత లేదు’’ అని స్పష్టం చేశారు. ముఖ్యమైన ఈ బీబీసీ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని రచయిత ఈ అధ్యాయంలో పొందుపరిచారు.

ఆరవ అధ్యాయం: అంబేడ్కర్, గాంధీ, ఎన్నికల పద్ధతులు

పుణె ప్యాక్ట్ పైన  24 సెప్టెంబర్ 1932న సంతకాలు జరిగాయి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో దాన్ని పొందుపరిచారు. 4 ఆగస్టు 1935న రాజముద్ర పడింది. అంతకు ముందే ఈ ఒప్పందంలో కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించిన అంబేడ్కర్ గాంధీని ఎరవాడ జైలులో కలుసుకొని ఒక ప్రతిపాదన చేశారు. దాన్ని గాంధీ తిరస్కరించారు. కర్నూలుకు చెందిన కాంగ్రెస్ సభ్యుడ సర్దార్ నాగప్ప ద్వారా అంబేడ్కర్ అదే ప్రతిపాదనను 1947 ఆగస్టులో రాజ్యాంగపరిషత్తులో చేయించారు. ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనది అయినప్పటికీ ఆ మనిషి ప్రాణం కాపాడేందుకు విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించే బాటనుంచి తప్పుకోకూడదంటూ అంబేడ్కర్ కి గాంధీ సలహా ఇచ్చారు. తాను అంబేడ్కర్ స్థానంలో ఉంటే తన కర్తవ్యపాలన నిర్దేశించిన మార్గం నుంచి వైదొలిగి గాంధీ ప్రాణాలు కాపాడేవాడిని కానని గాంధీ స్వయంగా 1933లో అన్న సంగతిని ఈ అధ్యాయంలో చెప్పారు. 6 జూన్ 1934న గాంధీని అంబేడ్కర్ ఆ సందర్భంలో చివరిసారిగా కలుసుకున్నారు. పుణె ప్యాక్ట్ పైన సంతకం చేసిన తర్వాత మూడేళ్ళకు 13 అక్టోబర్ 1935న జరిగిన చారిత్రక ఇయోలా కాన్ఫరెన్స్ లో అంబేడ్కర్ ఇలా ప్రకటించారు: ‘‘ అంటరానివాడు అనే మచ్చతో పుట్టడం నా దౌర్భాగ్యం. అయితే, అది నా తప్పుకాదు. కానీ నేను హిందువుగా మరణించను. ఎందుకంటే అది నా చేతుల్లో, నా అధీనంలో ఉంది.’’ 1937 ఎన్నికల స్వభావాన్నీ, ఎన్నికల ఫలితాల విశ్లేషణనీ ఈ అధ్యాయంలో రాజశేఖర్ రాశారు. అంబేడ్కర్ అస్తమించడానికి కొన్ని మాసాల ముదు నాగపూర్ వెళ్ళి వేలాది అనుచరులతో సహాబౌద్ధం స్వీకరించిన విషయం విదితమే.  

ఏడో అధ్యాయం: ప్రత్యేక ఓటు హక్కుపై అంబేడ్కర్ ప్రేమానుబంధం

భారత రాజ్యాంగ నిర్మాణదశలో ఎన్నికల ప్రక్రియపైన డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ది అత్యంత సాధికారమైన గళం. 1909లో మోర్లే-మింటోసంస్కరణలలో భాగంగా ముస్లింలకు ప్రత్యేక ఓటు హక్కు కల్పించాలనే ప్రతిపాదనపైన ముస్లింలకూ, కాంగ్రెస్ పార్టీకీ  మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దక్షిణాఫ్రికా నుంచి గాంధీ 1915లో వచ్చారు. సౌత్ బరో కమిషన్ ఎదుట అంబేడ్కర్ 1919లో వాదించడం ద్వరా రాజకీయాలలోకి వచ్చారు. వీరిద్దరి మధ్య 1932లో పుణె ఒప్పందం కుదిరింది. 1919 నుంచీ అంటరానివారికి ప్రత్యేక ఓటు హక్కు ఉండాలని అంబేడ్కర్ బలంగా వాదిస్తూ వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో అదే వాదనను వినిపించారు. 1931లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అదే విషయం గట్టిగా వాదించి గాంధీతో తపబడ్డారు.  1932లో పుణె ప్యాక్ట్ సందర్భంగా గాంధీ ప్రాణాలు రక్షించేందుకు ఆ విషయంలో రాజీపడ్డారు కానీ ఆ అంశాన్ని మరచిపోలేదు. ప్రత్యేక ఓటు హక్కు కోసం మరోసారి పోరాడేందుకు షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ ను అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. వైస్రాయ్ కేబినెట్ లో కార్మిక వ్యవహారాల మంత్రిగా అంబేడ్కర్ చేరారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను షెడ్యూల్డ్ కులాలవారితోనే నింపాలని ‘ఎఫర్మేటివ్ యాక్షన్’ ను ప్రతిపాదించారు. 1937, 1946 ఎన్నికలు పుణెప్యాక్ట్ పద్దతిలో జరగడం వల్ల కలిగిన దుష్ఫలితాలను అంబేడ్కర్ వివరించారు. షెడ్యూల్డ్  కులాల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇప్పించాలని ప్రతిపాదించారు. పుణ్ ప్యాక్ట్ లో పేర్కొన్న పద్ధతిని రద్దు చేసి ప్రత్యేక ఓటు పద్ధతిని ప్రవేశపెట్టాలని అంబేడ్కర్ సుదీర్ఘమైన వినతిపత్రాన్ని ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ తరఫున తయారు చేశారు. ‘మిస్టర్ గాంధీ అండ్ ఇమానిసిపేషన్ ఆఫ్ అన్ టచబుల్స్’ అనే చిరుగ్రంథంలో ఈ విషయాలన్నీ అంబేడ్కర్ కూలంకషంగా చర్చించారు.

ఎనిమిదో అధ్యాయం: ప్రపంచయుద్ధం, అధికారం బదిలీ, అంబేడ్కర్

భారత రాజ్యాంగాన్ని 1935లో చట్టం చేసిన తర్వాత అంతవరకూ అంటరానివారుగా పిలిచేవారిని షెడ్యూల్డ్ కులాలవారని పిలవడం ప్రారంభించారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ఐఎల్ పీ) పేరుతో 15 ఆగస్టు 1936న అంబేడ్కర్ సొంత పార్టీని నెలకొల్పారు. 1937 ఎన్నికలలో ఈ పార్టీ బొంబాయి ప్రావిన్స్ లో ప్రభావం చూపింది. ఆ ప్రావిన్స్ లో షెడ్యూల్డ్ కులాలకోసం రిజర్వ్ చేసిన 15 స్థానాలలో 11 స్థానాలను ఐఎల్ పీ గెలుచుకున్నది.

1939 నుంచి 1945 వరకూ బ్రిటన్ రెండో ప్రపంచ యుద్దంలో తలమునకలై ఉండిపోయింది. అదే సమయంలో అంటరానివారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందంటూ గాంధీ రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన విషయానికి కాంగ్రెస్ పార్టీ విస్తృతం ప్రచారం ఇచ్చింది. జగ్జీవన్ రామ్ నాయకత్వంలోని బిహార్ పీడితవర్గాల లీగ్ కాంగ్రెస్ వాదనను సమర్థించింది. కాంగ్రెస్, గాంధీ వాదనలను పూర్వపక్షం చేసేందుకే అంబేడ్కర్ 1945లో ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ  హేవ్ డన్ ఫర్ ద అన్ టచబుల్స్ (కాంగ్రెస్, గాంధీ అస్పృశ్యులకు ఏమి చేశారు?)’ అనే గ్రంథం రాశారు. ముస్లింల వలెనే అంటరానివారు కూడా ఒక ప్రత్యేక సామాజిక వర్గమా? హిందూసమాజంలో వారూ భాగమేనా? అనే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టత లేదు. అంటరానివారు హిందూసమాజంలో భాగమేనంటూ గాంధీ చేస్తున్నవాదాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గమనించింది. కొంతమేరకు విశ్వసించింది.

1941లో కాంగ్రెస్ నాయకులను జైళ్ళ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ను సమర్థించడానికి కాంగ్రెస్ పార్టీని ఒప్పించేందుకు ప్రయత్నించింది. విన్ స్టన్ చర్చిల్ ఇండియాకు డొమీనియన్ హోదా ఇస్తానంటూ స్టాఫర్డ్ క్రిస్ప్ తో కబురు పెట్టారు. క్రిప్స్ ప్రతిపాదనను ఎవ్వరూ అంగీకరించలేదు. 1939లోనే అంబేడ్కర్ నాజీ జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ కు మద్దతు ప్రకటించారు. బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అంబేడ్కర్ ప్రసంగం సంచలనాత్మకమైంది. ‘‘దేశ ప్రయోజనాలకూ, అంటరానివారి ప్రయోజనాలకూ మధ్య ఎప్పుడైనా సంఘర్షణ సంభవించినట్లయితే నా మటుకు నాకు దేశ ప్రయోజనాల కంటే అంటరానివారి ప్రయోజనాలే ముఖ్యం అవుతాయి,’’ అంటూ అంబేడ్కర్ స్పష్టం చేశారు.

1942లో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. క్రిస్ప్ ప్రతిపాదన, వేవల్ ప్రణాళిక, సిమ్లా చర్చలు విఫలమైన తర్వాత భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు కేబినెట్ మిషన్ ను బ్రిటిష్ ప్రభుత్వం పంపింది. ఈ మిషన్ ప్రతిపాదనల్లో దళితులకు సంబంధించిన ప్రస్తావనే లేదు. ప్రత్యేక ఓటు హక్కు ఉండాలనీ, షెడ్యూల్డ్ కులాలవారి నివాసం కోసం ప్రత్యేకమైన నివేశన ప్రాంతాలను (సపరేట్ సెటిల్ మెంట్లు) ఏర్పాటు చేయాలనీ అంబేడ్కర్ వాదించారు. కేటినెట్ మిషన్ ఎదుట వాదించి ప్రయోజనం లేదని భావించి 1946 అక్టోబర్ లో అంబేడ్కర్ లండన్ వెళ్ళారు. నెల రోజులు అక్కడే ఉన్నారు. బ్రిటిష్ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రంజెంటేటివ్స్  – బ్రటిష్ పార్లమెంటు దిగువ సభ) కు చెందిన ‘కన్సర్వేటివ్ ఇండియా కమిటీ’ సమావేశంలో ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ముందు రోజంతా అంబేడ్కర్ యుద్ధనాయకుడైన విన్ స్టన్ చర్చిల్ తోనే గడిపారు. తన వాదనతో చర్చిల్ ఏకీభవించారనే అభిప్రాయం అంబేడ్కర్ కు కలిగింది.

తొమ్మిదో అధ్యాయం: ఎన్నికల వ్యవస్థపై అంబేడ్కర్, గాంధీ, సర్దార్ పటేల్

‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హేవ్ డన్ టు ద అన్ టచబుల్’ అనే పుస్తకానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. గాంధీకి మనస్తాపం కలిగించింది. అంబేడ్కర్ పుస్తకానికి సమాధానంగా గాంధీ పనపున రెండు పుస్తకాలు వెలుగు చూశాయి. ఆ రెండు పుస్తకాల రచయితలనూ ‘గాంధీ ఏజెంట్లు’గా అంబేడ్కర్ అభివర్ణించారు. సర్దార్ పటేల్ కు అంబేడ్కర్ రాసిన లేఖలో ‘నా పుస్తకంలో చేసిన ఆరోపణలు ఖండించేందుకు చాలామంది ఏజెంట్లను పురమాయించారు. గాంధీ దురదృష్టంకొద్దీ అందరూ విఫలమైనారు,’ అని వ్యాఖ్యానించారు. రెండు గ్రంథాలలో ఒకటి రాజగోపాలాచారి రాసింది. సీఆర్ పుణె చర్చలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు. గాంధీని కాదనలేక ఆయన అంబేడ్కర్ రెఫ్యూటెడ్ అనే శీర్షికతో పుస్తకం ప్రచురించారు.

షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన స్థానాలలో దళితులకు ప్రత్యేక ఓటు హక్కు ఉండాలనీ, ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో మునిసిపాలిటీ ఎన్నికలలో అమలు జరుగుతున్న విధానమేననీ అంబేడ్కర్ బాంబే క్రానికల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. షెడ్యూల్డ్ కులాలకు తగిన ఎన్నికల వ్యవస్థ గురించి అంబేడ్కర్ ఆలోచించారు.

ప్రత్యేక హక్కు విషయంలో అంబేడ్కర్ కూ, ఆయన సహచరులకూ మధ్య విభేదాలు తలెత్తినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. షరతులతో కూడిన 20 శాతం ప్రత్యేక ఓటర్లకు సప్రూ కమిటీ సిఫార్సు చేసింది. అంటే రిజర్వుడ్ నియోజకవర్గాలలో దళితులు వేసిన ఓట్లలొ కనీసం 20 శాతం మంది దళితుల ఓట్లు పొందిన దళిత అభ్యర్థినే విజేతగా ప్రకటించాలి అనే అంశం. జగ్జీవన్ రామ్ 25 శాతానికి సిఫార్సు చేశారు. అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేసిన ఎలీనార్ జెల్లియట్ మహదేవ్ దేశాయ్ డైరీని ఉటంకిస్తూ, ‘‘హరిజనులకు ప్రత్యేక ఓటు హక్కు ఇవ్వడం వల్ల సంభవించగల పరిణామాలను తలచుకుంటే  నాకు భయం కలుగుతోంది. ఇతర మతాలవారికి ప్రత్యేక ఓటు హక్కు మంజూరు చేసినా వారితో వ్యవహారం చేయడానికి నాకు కొంత అవకాశం ఉంటుంది. కానీ అంటరానివారితో అటువంటి అవకాశం ఉండదు….ప్రత్యేక ఓటు హిందువులలో విభేదాలు తెచ్చి రక్తపాతం సృష్టిస్తుందని వారు గ్రహించలేకపోతున్నారు. అంటరాని గూండాలూ, ముస్లిం గూండాలూ కలసి సవర్ణ హిందువులను చంపేస్తారు. ఇదంతా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియదా?తెలియదని నేను అనుకోను,’’ అని గాంధీ అన్నట్టు రాశారు.

నెహ్రూ అంటరానివారి సంక్షేమం గురించి మాట్లాడకపోవడం పట్ల అంబేడ్కర్ ధ్వజమెత్తారు. ఇరవై సంవత్సరాలుగా రాజకీయ శ్రేణుల అగ్రభాగాన ఉంటూ ఇరవై వేల సమావేశాలలో మాట్లాడిన నెహ్రూ ఎన్నడూ అంటరానివారి ప్రస్తావన తేలేదు అంటూ దుయ్యపట్టారు. పుణెప్యాక్ట్ జరిగినప్పుడు నెహ్రూ డెహరాడూన్ జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సర్దార్ పటేల్ అన్ని అధికారాలు తన హస్తగతం చేసుకున్నారనీ, అన్ని విషయాలలో ఆయనే ఖరారు నిర్ణయం తీసుకునేవారనీ రచయిత ఈ అధ్యాయంలో రాశారు. అంటరానితనం నిర్మూలన జరిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తాను కోరుకుంటున్నాననీ, ఈ ప్రతిపాదనను పటేల్ పార్లమెంటులోనూ, వెలుపలా నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారనీ అంబేడ్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంటరానివారి ప్రతినిధుల నుంచీ తీవ్రమైన వ్యతిరేకతను అంబేడ్కర్ ఎదుర్కొన్నారు. ఒంటరితనం అనుభవించారు. షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఏ ప్రక్రియ అనుసరించాలనే విషయంలో కాంగ్రెస్ తో అంగీకారం కుదుర్చుకోవడానికి అంబేడ్కర్ చేసిన ప్రయత్నాలకు పటేల్ ఎప్పటికప్పుడు గండి కొట్టారు. పటేల్ నాయకత్వంలోని సలహాసంఘం మొత్తం రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని సంకల్పించింది. అప్పుడు రాజ్యాంగరచనా సంఘం అధ్యక్షుడు, భారత న్యాయశాఖ మంత్రి అంబేడ్కర్ రాజ్యాంగనిర్మాణ సభ నుంచి వాకౌట్ చేశారు. నాలుగు రోజులు సభకు దూరంగా ఉన్నారు. అప్పుడు అంటరానివారి సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన సూచనలను కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. అంబేడ్కర్ వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. షెడ్యూల్డ్ కులాలకు మినహా తక్కిన అన్ని మతపరమైన రిజర్వేషన్లనూ రద్దు చేయాలనే తీర్మానాన్ని రాజ్యాంగపరిషత్తు ఆమోదించింది. దీని పైన నెహ్రూ, పటేల్ హర్షం ప్రకటించారు. అంటరానివారు తాము అంటరానివారమని భవిష్యత్తు లో మరచిపోవాలని పటేల్ అన్నారు.

పదో అధ్యాయం: అంబేడ్కర్ తలరాతను నిర్ణయించిన సర్దార్ పటేల్, గాంధీ

గాంధీకి దేశంలో పరిణామాలు ఆందోళన కలిగించాయి. పటేల్ తో ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతూ ఉండేవి. ‘బీంరావ్ ను కలుసుకొని మంచిపని చేశారు‘ అంటూ ఒకసారి గాంధీ పటేల్ కు ఉత్తరం రాశారు. ముస్లింలనూ, సిక్కులనూ సంతోషపెట్టడానికీ, షెడ్యూల్డ్ కులాలవారిని సంతృప్తి పరచడానికి ఎట్లా వ్యవహరించాలనే అంశంపైన వారిద్దరి మధ్యా ఉత్తరాల ద్వారా చర్చ జరిగేది. ‘‘మనం భీంరావ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆయన నన్ను మళ్ళీ శుక్రవారంనాడు కలుస్తున్నారు. 20 శాతం దళిత ఓట్లు పొందని అభ్యర్థిని ఎన్నికైనట్టు ప్రకటించరాదనే అంశాన్ని మనం అంగీకరించవచ్చు. మీ అంతిమ నిర్ణయం వచ్చిన తర్వాత ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు,’’ అని వల్లభ్ భాయ్ పటేల్ గాంధీకి రాశారు.  అంబేడ్కర్ అడిగిన దానికి అంగీకరించి ఆయనను గెలుచుకోవడమే ఉత్తమమని పటేల్ అభిప్రాయం. అంబేడ్కర్ కి పటేల్ లేఖ రాశారు. 14 అక్టోబర్ 1946న పటేల్ కు అంబేడ్కర్ రాసిన ఉత్తరంలో ‘‘ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనప్పటికీ అతడి కంటే దేశం గొప్పది,’’ అని అన్నారు. గాంధీని అంబేడ్కర్ దుర్భాషలాడినందుకు నిరసనగా పటేల్ అంబేడ్కర్ ను కలుసుకోవడానికి నిరాకరించారు. అది అసంగతమనీ, గాంధీపైన తనకు ఆగ్రహం ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయనీ అంబేడ్కర్ పటేల్ కు లేఖ రాశారు.

పదకొండో అధ్యాయం: రాజ్యాంగ నిర్మాణం, ఎన్నికలపై ప్రతిపాదనలు

రాజ్యాంగ పరిషత్తు సమావేశాలూ, మైనారిటీ ఉపసంఘం సమావేశాలూ , మైనారిటీ ఉపసంఘం నివేదిక వంటి అంశాలపైన ఈ అధ్యాయంలో వివరంగా రాశారు. సర్దార్ పటేల్ అధ్యక్షతన సలహాసంఘం సమావేశాలు జరిగేవి. వాటి వివరాలు ఈ అధ్యాయంలో ఇచ్చారు. ఇది చాలా చిన్న అధ్యాయం.

పన్నెండో అధ్యాయం: సర్దార్ నాగప్ప – సర్దార్ పటేల్                                   

సర్దార్ నాగప్ప కాంగ్రెస్ వాది. రాజ్యాంగనిర్మాణసభలో షెడ్యూల్డ్ కులాల ప్రతినిధి. కర్నూలు జిల్లాకు చెందిన మాల. కర్నూలు నుంచి ఆయన 1937లోనూ, 1946లోనూ ఎన్నికైనారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యాంగసభకు నామినేట్ చేసింది. ఆయన పూర్వీకులు యోధులు. అందుకని ఆయన పేరులో సర్దార్ అని ఉండేది. రాజ్యాంగసభలో షెడ్యూల్డ్ కులాల సభ్యులకు కన్వీనర్ గా ఉండేవారు. అంబేడ్కరంటే గొప్ప గౌరవం.

సలహా సంఘం నివేదికను పరిశీలిస్తూ సర్దార్ పటేల్ చేసిన వ్యాఖ్యతో సర్దార్ నాగప్ప ఏకీభవించలేదు. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు షెడ్యూల్డ్ కులాల ఓట్లలో కొంతశాతం ఓట్లు వచ్చినవారినే విజేతలుగా ప్రకటిచాలని కోరుతున్నాను అన్నారు. సర్దార్ నాగప్ప సలహా ఇస్తున్నారా, ఉపన్యాసం చేస్తున్నారా అంటూ కాంగ్రెస్ సభ్యుడు ఖండేకర్ ఎద్దేవా చేశారు. అదే ప్రశ్న రాజ్యాంగపరిషత్తు అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సూటిగా అడిగినప్పుడు ఆరవ క్లాజుకు సవరణ ప్రతిపాదిస్తున్నానంటూ సర్దార్ నాగప్ప చెప్పారు. ‘‘మీరు ఉపన్యాసం చెప్పడానికే సవరణ ప్రతిపాదిస్తున్నారు. తర్వాత దానిని మీరే ఉపసంహరించుకుంటారు,’’ అంటూ సర్దార్ పటేల్ చమత్కరించారు. కానీ నాగప్ప సోదాహరణంగా తన ఉద్దేశాన్ని వివరించారు. సవరణను ఉపసంహరించుకోవలసిందిగా సర్దార్ నాగప్పపైన సర్దార్ పటేల్ ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు సభలో అంబేడ్కర్ లేరు. కాంగ్రెస్ నాయకుడై ఉండీ స్వతంత్రంగా వ్యవహరించినందుకు నాగప్ప మూల్యం చెల్లించవలసి వచ్చింది. రాజ్యాంగసభలో ఆయన వైఖరిపట్ల పార్టీ ఆగ్రహించింది. 1952లో కర్నూలు నుంచి పోటీ చేయడానికి పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ టిక్కెట్టు పైన పోటీ చేసి ఓడిపోయారు.

ఫ్రత్యేక ఓటు హక్కు కోసం 1919లో సౌత్ బరో కమిషన్, 1928లో సైమన్ కమిషన్, 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1932లో కమ్యూనల్ అవార్డు, 1932లో పుణెప్యాక్ట్, 1937, 1946 ఎన్నికలు, రాజ్యాంగపరిషత్తులో సవరణ తీర్మానం వంటి ఘట్టాల ద్వారా అంబేడ్కర్ సాగించిన సుదీర్ఘమైన పోరాటం అసంపూర్ణంగా ముగిసింది.

పదమూడో అధ్యాయం: సర్దార్ పటేల్, మైనారిటీల రిజర్వుడు స్థానాల రద్దు

దేశవిభజన దరిమిలా అనిర్వచనీయమైన హింసాకాండ జరిగింది. ఇండియా నుంచి ముస్లింలు పాకిస్తాన్ కూ, పాక్ నుంచి హిందువులూ, సిక్కులూ ఇండియాకు వలస సందర్భంగా దాడులూ, హత్యలూ లెక్కలేనన్ని జరిగాయి. వేలాది మంది మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. నిరాశ్రయులైనారు. 1948 జనవరి 30న నాథూరాంగాడ్సే గాంధీని హత్య చేశారు. సిక్కులూ, ఇతర మైనారిటీలకు సంబంధించిన హక్కుల అంశాన్ని వాయిదా వేయాలని రాజ్యాంగసభ నిర్ణయించింది. గాంధీ మరణం తర్వాత షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల గురించి మాట్లాడే నాయకులు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీలోలేరు. గాంధీ పరమపదించిన తర్వాత నెలరోజుల లోపే మైనారిటీ సలహాసంఘం సమావేశాన్నిపటేల్ ఏర్పాటు చేశారు. అప్పటికే ఆయన నెహ్రూతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తారనే మాట ప్రచారంలో ఉంది. అంబేడ్కర్ సలహా మేరకు ఎజెండాను కూలంకషంగా చర్చించేందుకు ఒక చిన్న కమిటీని నియమించారు.సర్దార్ పటేల్ అధ్యక్షతలోని ఈ కమిటీలో అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, కెఎం మున్షీ సభ్యులు.

ఇక్కడ పటేల్ చాకచక్యంగా వ్యవహరించారు. ఏ మతానికి సంబంధించిన హక్కుల గురించైనా ఆ మతానికి చెందినవారే మాట్లాడాలనీ, వారి మాట ఇతర మతస్థులు మన్నించాలని పటేల్ ప్రతిపాదించారు. ఉదాహరణకు ముస్లింలు అందరూ  కలసి మాట్లాడుకొని తమకురిజర్వేషన్లు అక్కరలేదని నిర్ణయించుకుంటే, ఆనిర్ణయాన్ని ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి నుంచే ప్రతిపాదన రూపంలో తీసుకురావాలనీ, దానికి ఇతర మతస్థులు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకూడదనీ అర్థం. అంబేడ్కర్ లేవనెత్తిన పాయంట్ ఆఫ్ ఆర్డర్ ను అధ్యక్షుడి హోదాలో పటేల్ కొట్టివేశారు. ప్రధానమైన అంశం ఓటు హక్కు. ఇది ప్రాథమిక హక్కు అని అంబేడ్కర్ వాదించారు. జగ్జీవన్ రామ అంబేడ్కర్ వాదనను సమర్థించారు. అది ప్రాథమిక హక్కు కాజాలదని పటేల్ కరాఖండిగా చెప్పారు. ఈ విషయం రాజ్యాంగనిర్మాణ పరిషత్తులో చర్చకు పెడతామనీ, పరిషత్తు అంతిమ నిర్ణయం తీసుకుంటుందనీ అంబేడ్కర్ అన్నారు.

పద్నాలుగో అధ్యాయం: ఎన్నికల వ్యవస్థ పనితీరు

రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చే సరికి పార్లమెంటుకు కానీ, అసెంబ్లీకి కానీ ప్రత్యేక ఓటు హక్కును నిషేధిస్తూ 325వ అధికరణ ద్వారా సర్దార్ పటేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ తిరుగులేని ఏర్పాటు చేసింది. మతం, జాతి, కులం, ఆడ, మగ, ఇతర కారణాలపైన ఏ నియోజకవర్గంలోనైనా ప్రత్యేక ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎవరైనా కోరినా అందుకు వారు అర్హులు కారు’ అంటూ రాజ్యాంగం స్పష్టం చేసింది.

అంబేడ్కర్ ఉడుంపట్టు కారణంగా శాసనసంస్థలలో షెడ్యూల్డ్ కులాలవారికీ, షెడ్యూల్డ్ జాతులవారికీ సీట్లు రిజర్వు చేయాలనే విషయం రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది వారి జనాభా ప్రాతిపదికన జరగాలని 330వ అధికరణ నిర్దేశిస్తున్నది. ద్విసభ్య నియోజకవర్గాల గురించీ, 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికల గురించీ, బాంబే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అంబేడ్కర్ పరాజయం గురించీ, కోర్టు లో పోరాటం గురించీ రాజశేఖర్ గారు వివరంగా  రాశారు. పదేళ్ళ తర్వాత కూడా రాజకీయ రిజర్వేషన్లను నెహ్రూ పొడిగించారు. ద్విసభ్య నియోజకవర్గాల వ్యవస్థను రద్దు చేశారు. రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో వాటిని రద్దు చేసే సర్దార్ ఎవ్వరూ లేరు.

పదిహేనో అధ్యాయం : ఉపసంహారం

చారిత్రకంగా అణచివేతకూ, వివక్షకూ గురైన సామాజికవర్గాలకోసం చట్టసభలలో రిజర్వుడు నియోజకవర్గాలను కేటాయించడం భారత ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకతకు ప్రధాన కారణం చారిత్రక నేపథ్యం. జాతీయ స్వాతంత్ర్యోద్యమం నడిచిన తీరూ, దళితులకు అంబేడ్కర్ నాయకత్వం వహించడం ఇందుకు దోహదం చేశాయి. భవిష్యత్తులో ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉండబోతోందో కూడా రచయిత ఈ అధ్యాయంలో చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చర్చించారు. ఇప్పటికీ ఎన్నికల వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయనీ,వాటిని సవరించుకోవాలనీ చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో దళిత ఓట్లలో నిర్దిష్టమైన శాతం పడితేనే అభ్యర్థిని విజేతగా ప్రకటించాలన్న అంబేడ్కర్ షరతును అమలు చేస్తే బాగుంటుందని రచయిత వుండ్రు రాజశేఖర్ గారు సూచించారు.

ముగ్గురు మహానుభావులు

ముగ్గురు మహానుభావుల గురించి పుస్తకం రాయడం, వారిలో ఒకరి తరఫున పరిణామాలను విశ్లేషిస్తూ రాసినప్పటికీ తక్కిన ఇద్దరు నాయకుల పట్లా కించిత్ అగౌరవం కానీ, ప్రతికూలత కానీ లేకుండా సమదృష్టితో రాయడం రాజశేఖర్ వుండ్రు ప్రత్యేకత. ఆయన ఎక్కడా ఆవేశానికి లోనై నిగ్రహం కోల్పోలేదు. ముగ్గురు నాయకులూ విశాల హృదయం ఉన్నవారు. ముఖ్యంగా గాంధీ హిందూమతం నుంచి దళితులను  మినహాయించడాన్ని సహించలేకపోయారు. అందరిదీ పెద్దమనసే. గాంధీ నిరశనదీక్షలో ఆయనకు ప్రాణాపాయం కలుగుతుందేమోనన్న ఆందోళనతో మొదటి నుంచీ తాను  నమ్ముతూ, వాదిస్తూ వచ్చిన ప్రత్యేక ఓటింగ్ హక్కు గురించి పట్టవీడడం అంబేడ్కర్ గొప్పదనం. అంబేడ్కర్ ని ప్రత్యేక ఓటింగ్ హక్కు విషయంలో నిర్ద్వంద్వంగా వ్యతిరేకించినప్పటికీ అంబేడ్కర్ ని రాజ్యాంగరచన సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని రాజేంద్రప్రసాద్ చేసిన సూచనను గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ అంగీకరించడం వారి విశాల హృదయానికి నిదర్శనం. ముగ్గురూ ముగ్గురే. పట్టువిడుపులు తెలిసినవారే. ఎవ్వరికీ స్వార్థ చింతన లేదు. స్వలాభాపేక్ష లేదు. తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయరంగంలో పనిచేయానికి కంకణబద్ధులైనారు. అంబేడ్కర్ ది ఒకే ఒక అంశంపైన రాజీలేని సుదీర్ఘ పోరాటం. దళితులకు రాజకీయ సాధికారత కోసం ఆయన జీవితాంతం పోరాడారు. అందుకు ఆయనను దళితులు అవతారపురుషుడుగా భావించడం సమంజసమే. ఆయన లేకపోతే దళితులకు రిజర్వేషన్లు కూడా అనుమానమే. భారత ప్రజలందరికీ వర్తించే, వారందరికీ రక్షణ కల్పించే, పౌరులకు ప్రాథమిక హక్కులు సమకూర్చే, సుపరిపాలనకు దోహదం చేసే సమున్నతమైన రాజ్యాంగ రచనలో మేటిపాత్ర పోషించినందుకు, నాయకత్వ పాత్ర నిర్వహించినందుకు భరత జాతియావత్తూ ఆయనకు రుణపడి ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణంలో, అంతకంటే ముఖ్యంగా దేశంలో ఎన్నికల వ్యవస్థ రూపకల్పనలో అంబేడ్కర్ పోషించిన అద్వితీయమైన పాత్ర గురించి తెలుసుకోవాలంటే, నాటి నాయకుల మనస్తత్వాలనూ, దృక్పథాలనూ అవగాహన చేసుకోవాలనుకుంటే  ‘అంబేడ్కర్, గాంధీ, పటేల్’ గ్రంథం తప్పనిసరిగా చదవాలి.


Ambedkar, Gandhi and Patel (Telugu): The Making of India’s Electoral System

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles