“Truth is what stands the test of experience.”
– Albert Einstein.
(The Law of Science & The Law of Ethics, The Radical Humanist,
April 24, 1955.)
“నేను వింటాను, కానీ మర్చిపోతాను.
చూసైతే జ్ఞాపకం ఉంచుకుంటాను.
అదే చేస్తే బాగా అర్ధం చేసుకుంటాను !”
రెండు పదుల వయసు దాటిన కన్న కూతురు హఠాత్తుగా మరణించడం ఆ కుటుంబానికి తేరుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. అయితే, ఆ బాధని సమాజం పట్ల బాధ్యతగా మార్చుకుని ఎదిగిన ప్రతీ అమ్మాయిలోనూ తమ కూతుర్నే చూసుకుంటూ, నిత్యజీవితంలో వైజ్ఞానిక స్పృహ కల్పించడం ద్వారా విద్యార్ధుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కొద్దిమంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఇతర అధ్యాపకులతో కలిసి స్థాపించిన ఒక సంస్థ ఈ రోజు సైన్సుకోసం మహోన్నతమైన కార్యక్రమాలు రూపొందించే దిశగా ఎదిగింది. ఆ సంస్థ పేరు ‘రేవతి సైన్స్ ఫౌండేషన్’, దాని వ్యవస్థాపకులు శ్రీకృష్ణసాయి దంపతులు!
భౌతికంగా మరణించిన తమ పెద్ద కుమార్తె రేవతి పేరుతో ఆమె స్మృతి చిహ్నంగా ఈ సంస్థను ఆరేళ్ళక్రితం 2018 లో విద్యార్ధుల్లో, ముఖ్యంగా బాలికల్లో వైజ్ఞానిక స్పృహ కోసం ఆసక్తి, అవగాహన కల్పించే మానసపుత్రిక (Brainchild) గా మలిచారు. ఆనాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా మానవాళి పురోగతి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులు, శాస్త్రవేత్తలు, సామాజిక ఆలోచనాపరుల గురించిన ప్రచారోద్యమాన్ని విద్యార్ధుల్లో కలిగించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాల్ని వినూత్నంగా రూపొందిస్తున్నారు. జ్ఞానమనేది కేవలం తరగతి గదులకి పరిమితం కాదని, బోధన వల్ల, వినికిడి, దృశ్య మాధ్యమాల వల్లా పిల్లలకి అందేది సమాచారం తప్పితే జ్ఞానం కాదనీ, నిజమైన జ్ఞానానికి అనుభవమే ప్రమాణమనీ, తప్పొప్పుల బేరీజు తేలాల్సింది ప్రయోగంతోనే అనే ఆలోచనలోంచి రూపుదిద్దుకున్నదే ఈ విశిష్ట వైజ్ఞానిక సంస్థ!
అందులో భాగంగా గత ఆరేళ్ళుగా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుండే కాక జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుండీ ఎందరో ఔత్సాహిక బాలికలతో చిన్న వయసు నుండే వారిలో ప్రశ్నించే తత్వాన్ని, సత్యాసత్య వివేచనా పద్ధతిని, హేతుబద్ద ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా విజ్ఞాన ప్రదర్శన (Science Fair)ని ఏర్పాటు చేయడం వాటిల్లో ఒకటి. ఎక్కడెక్కడి నుండో వచ్చే విద్యార్ధులు స్వంతంగా చేసిన అనేకానేక సైన్సు ప్రయోగాల్ని, సరికొత్తగా ఆవిష్కరించే శాస్త్ర నమూనాలనూ ప్రదర్శించడంతో పాటు, సైన్సు పట్ల ఆరోగ్యకర దృక్పధాన్ని నిర్మించడం, చిన్నారులకు విలువలతో కూడిన చింతనాత్మక జీవన విధానం పట్ల గౌరవభావన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. విజ్ఞానాభిలాష విజయాపజయాలకి అతీతమని గుర్తిస్తూనే, ప్రతిభ కనబర్చిన చిన్నారుల్ని ప్రోత్సహిం చేందుకు అందిస్తోందే రేవతి సైన్స్ ఫౌండేషన్ అవార్డు!
విశిష్ట మహిళా శాస్త్రవేత్త మేరీక్యూరీ స్పూర్తితో, కేవలం సైన్సు నమూనాలకే పరిమితం కాకుండా, శాస్త్ర ప్రయోజనం సమాజ ఉన్నతితో మాత్రమే ముడిపడి ఉంటుందనే స్పష్టతను చిన్నారులకి కల్పిస్తూ, వారిలో సాంస్కృతిక వికాసం దిశగా కూడా కృషి చేస్తూ ఐన్ స్టీన్ మొదలుకొని డార్విన్ వరకూ, ఎడిసిన్ నుండి న్యూటన్ దాకా,జగదీస్ చంద్రబోస్తో మొదలెడితే సి. వి. రామన్ దాక మేధస్సుని మానవాళి ఉన్నతి కోసం ఉపయోగించిన మహామహుల జీవితం గురించి చిన్నారులతో చిరునాటికల ప్రదర్శన (మోనో యాక్షన్)వంటి రూపకాలు కూడా ఇక్కడ చిన్నారులే ప్రదర్శిస్తారు!
ప్రజల కోసమే సైన్సు అనే అవగాహనతో పని చేస్తున్న జన విజ్ఞాన వేదిక, రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ, చెలికాని రామారావు స్మారక సమితి, సంగమం తదితర అనేక సంఘాలతో కలిసి సంవత్సరం మొత్తంలో పిల్లలు, పెద్దల్లో శాస్తీయ స్పృహ పెంచేలా పదుల సంఖ్య లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, బాలికా దినోత్సవంనాడు ప్రత్యేకంగా బాలికల కోసమే ఏర్పాటు చేసే ఈ వైజ్ఞానిక ప్రదర్శన నాకు తెలిసీ రాష్ట్రంలోనే ప్రత్యేకత కలది. వ్యక్తిగత ఆసక్తీ, పూర్వ విద్యార్థుల సహకారం, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో గతించిన కుమార్తె స్మృతుల్ని వందలాది మంది పిల్లలు సాధిస్తోన్న శాస్త్ర సాధికారతలో చూసుకోవడం కృష్ణసాయిగారి దార్శనికతకి నిదర్శనం!
అందుకనే వెనుదీయని సంకల్పంతో ఎందరో సైన్సు ఆలోచనాపరులు, విజ్ఞానశాస్త్ర ప్రముఖుల సమక్షంలోతో పిల్లలకోసం ఎప్పటికప్పుడు ప్రదర్శనల్ని, ప్రసంగాల్ని , కార్యశాలల్నీ ఏర్పాటు చేయడం, విద్యార్థి దశలోనే పిల్లల్లో మానవీయ వైజ్ఞానిక నైతిక జీవన విధానాన్ని ఏర్పర్చే దిశగా వారికి ప్రోత్సాహక బహుమతులు అందించడం, ఆ క్రమంలోనే సొంత ఖర్చుతో తన ఇంట్లోనే భావితరాలకు సైతం ప్రయోజనం చేకూర్చేలా ‘రేవతి సైన్స్ సెంటర్’ ఏర్పాటుకు నడుం బిగించడం వంటివి నాకు తెలిసీ ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా ఆయన చేస్తోన్న అసామాన్య యత్నాలే
!
ఏ సమాజ ఉన్నతికయినా పౌరసమాజంలోని వైజ్ఞానిక దృష్టే ప్రమాణం. దానిని హేతుబద్ధంగా మల్చుకోవడమే నాగరిక వ్యవస్థల లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఉండాల్సిన మౌలిక భావనల్లో అదొకటి. అందుకనే బాబా సాహెబ్ అంబేద్కర్ వైజ్ఞానిక స్పృహను, మానవవాద భావనను రాజ్యాంగబద్దంగా ప్రతి పౌరుడికీ కల్పించాలంటాడు. ఆయన ఆశయాల సాధనలో భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా జరిగిన బాలికల వైజ్ఞానిక ప్రదర్శన ఆ మహోన్నత ఆకాంక్షలకి అద్దం పట్టింది. ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న పసి మనసుల సాక్షిగా, ఈ దేశంలో మానవీయ విజ్ఞాన పరంపరని సుస్థాపితం చేయగల అజేయమైన శక్తి రేపటి మహిళలుగా ఈనాటి ఈ బాలికలకే ఉందనిపించింది!
(కవీ, తత్వవేత్త, చరిత్రకారుడూ అయిన వైజ్ఞానిక వైతాళికుడు ప్రాన్సిన్ బెకన్ జయంతి రోజున డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కేంద్రంగా రేవతి సైన్స్ ఫౌండేషన్ నిన్న (22- 01 – 23, ఆదివారం) వెంకటాయపాలెంలో నిర్వహించిన బాలికల సైన్స్ ఫెయిర్ ని చూస్తే చాలా ఆనందం కలిగింది. అంత మంది పిల్లలు ఎంతో చురుగ్గా వారి వారి నమూనాల్ని ప్రదర్శిస్తూ, వచ్చిన సందర్శకులకి వాటి గురించి వివరిస్తూ చెప్పిన తీరు ముచ్చటగొల్పింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలకి రేవతి సైన్స్ ఫౌండేషన్ వేదిక అవ్వాలనీ, పిల్లల్లో వైజ్ఞానిక స్పృహనూ, సత్యాన్వేషణా పద్దతుల్ని పెంపొందించేలా మరిన్ని ప్రోత్సాహక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, నిర్వహకులకి, సందర్శకులకి, ప్రోత్సాహకులకి ప్రత్యేక అభినందనలతో ఈ చిన్న రైటప్.)
– గౌరవ్